Artificial Sperm: కృత్రిమ వీర్యం!

కృత్రిమ అవయవాల గురించి తెలుసు. మరి కృత్రిమ వీర్యం గురించి? ఇజ్రాయెల్‌ పరిశోధకులు ఇలాంటి అసాధ్యాన్నే సుసాధ్యం చేశారు. క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా ఇచ్చే కీమోథెరపీ, రేడియేషన్‌ వంటివి మగవారిలో వీర్యాన్ని తయారుచేసే కణాలను...

Updated : 15 Jun 2022 09:38 IST

కృత్రిమ అవయవాల గురించి తెలుసు. మరి కృత్రిమ వీర్యం గురించి? ఇజ్రాయెల్‌ పరిశోధకులు ఇలాంటి అసాధ్యాన్నే సుసాధ్యం చేశారు. క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా ఇచ్చే కీమోథెరపీ, రేడియేషన్‌ వంటివి మగవారిలో వీర్యాన్ని తయారుచేసే కణాలను దెబ్బతీస్తుంటాయి. దీంతో మున్ముందు సంతానం కలగటంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇక చిన్నప్పుడే క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నవారికిది మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించటానికే బెన్‌-గురియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ నెగెవ్‌ నేతృత్వంలో పరిశోధకులు వినూత్న మార్గాన్ని ఆవిష్కరించారు. అతి సూక్ష్మమైన ద్రవ వ్యవస్థ ద్వారా ప్రయోగశాలలో వీర్యాన్ని ఉత్పత్తి చేయటం దీని ఉద్దేశం. ఈ ద్రవ వ్యవస్థలో వేలాది అతి సన్నటి మార్గాలుంటాయి. ఇంకా వీర్యం ఉత్పత్తి కాని ఎలుక వృషణాల కణజాలం నుంచి తీసిన కణాలను ప్రత్యేకమైన సిలికాన్‌ చిప్‌ మీద ఉంచి.. ద్రవ వ్యవస్థ ద్వారా అవసరమైన పోషకాలను, పదార్థాలను సరఫరా చేశారు. క్రమంగా అవి వీర్యంగా వృద్ధి చెందటం గమనార్హం. మామూలుగా కీమో/రేడియో థెరపీలు తీసుకునే మగవారి విషయంలో మున్ముందు సంతానాన్ని కనటానికి వీలుగా ముందే వీర్యాన్ని సేకరించి, శీతలీకరణ కేంద్రాల్లో భద్ర పరుస్తుంటారు. కానీ పిల్లల విషయంలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే అప్పటికి వీరి వృషణాల్లో వీర్యాన్ని ఉత్పత్తి చేసే కణాలు వృద్ధి చెందవు. అందుకే ఇలాంటివారి వృషణాల నుంచి మూలకణాలను సేకరించి, మున్ముందు వీటితో శుక్ర కణాలను తయారుచేయొచ్చా? అనే దానిపై పరిశోధకులు దృష్టి సారించారు. వీర్యం ఉత్పత్తికి తోడ్పడే కణాలు అభివృద్ధి కాని ఎలుకల వృషణాల నుంచి తీసిన కణజాలంతో పరిశోధన చేశారు. ప్రయోగశాలలో సహజ పరిస్థితులను పోలిన వాతావరణంలో అవసరమైన పోషకాలను, వృద్ధి కారకాలను అందిస్తే వృషణాల కణాలను శుక్ర కణాలుగా మార్చే అవకాశముందని నిరూపించారు. అందుకే ఈ ప్రయోగాన్ని ‘టెస్టిస్‌ ఆన్‌ చిప్‌’గా పిలుచుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని