మధు రక్షలు!

మధుమేహంతో బాధపడేవారికి పాదాల మీద గాయాలు, పుండ్లు పడితే త్వరగా మానవు. దీంతో ఇన్‌ఫెక్షన్‌ తలెత్తే అవకాశం ఎక్కువ. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిస్థితి విషమిస్తే వేళ్లు, పాదాల వంటివీ తొలగించాల్సి రావొచ్చు. ఇలాంటి

Published : 22 Jun 2022 00:24 IST

ధుమేహంతో బాధపడేవారికి పాదాల మీద గాయాలు, పుండ్లు పడితే త్వరగా మానవు. దీంతో ఇన్‌ఫెక్షన్‌ తలెత్తే అవకాశం ఎక్కువ. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిస్థితి విషమిస్తే వేళ్లు, పాదాల వంటివీ తొలగించాల్సి రావొచ్చు. ఇలాంటి ప్రమాదాన్ని తప్పించటానికి బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పరిశోధకులు 3డీ ముద్రణ పద్ధతిలో స్వీయ నియంత్రిత పాదరక్షలను తయారుచేశారు. మధుమేహలు ధరించే మామూలు పాదరక్షల మాదిరిగా కాకుండా వీటిల్లో ఒత్తిడిని బట్టి సర్దుకునే వ్యవస్థ ఉంటుంది. అడుగు వేసినప్పుడు పాదాలు కుదురుగా ఉంటాయి. అందువల్ల పుండు పడిన భాగం వేగంగా నయం కావటానికి అవకాశముంటుంది. పాదంలో వేరే చోట పుండ్లు పడటమూ తగ్గుతుంది. మధుమేహుల్లో పాదాల్లోని నాడులు దెబ్బతినటం పెద్ద సమస్య. దీంతో స్పర్శ తగ్గుతుంది. నడిచే తీరూ మారుతుంది. మామూలుగా మనం నడుస్తున్నప్పుడు ముందు మడమ.. తర్వాత పాదం, వేళ్లు నేలను తాకుతాయి. అప్పుడు పాదం మీద ఒత్తిడి సమానంగా పడుతుంది. కానీ స్పర్శ తెలియకపోవటం వల్ల మధుమేహుల్లో ఈ క్రమం దెబ్బతింటుంది. ఫలితంగా పాదం మీద ఒత్తిడి అస్తవ్యస్తంగా పడుతుంది. ఒత్తిడి ఎక్కువగా పడే చోట పుండ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అప్పటికే పుండ్లు పడినట్టయితే అవి త్వరగా మానవు కూడా. అందుకే పాదం మీద ఒత్తిడి సమానంగా పడేలా చూసే పాదరక్షలను పరిశోధకులు తయారుచేశారు. ఒత్తిడి ఎక్కువగా పడ్డప్పుడు చెప్పు మధ్యలో ఉబ్బెత్తుగా ఉండే భాగం కాస్త కిందికి దిగటం వీటిల్లోని కీలకాంశం. ఒత్తిడి తగ్గగానే ఈ భాగం తిరిగి యథాస్థితికి వచ్చేస్తుంది. అంటే పాదరక్షలు తమకు తామే ఒత్తిడిని తగ్గించుకుంటాయన్నమాట. ఆయా వ్యక్తుల ఎత్తు, పాదాల సైజు, నడిచే వేగం, పాదం మోపినప్పుడు ఒత్తిడి పడుతున్న తీరు వంటి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వీటిని తయారు చేయటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని