పరికరం వినూత్నం

కొవిడ్‌ మహమ్మారి విజృంభణలోనూ డిజిటల్‌ పరికరాల వెల్లువ ఆగలేదు. కొంగొత్త పరిజ్ఞానాలతో వినూత్నంగానే అలరించాయి. ఇంటి నుంచే పని చేస్తున్నవారికి చేదోడుగా నిలిచాయి. ఆత్మీయులతో సంబంధ బాంధవ్యాలకు బాటలు వేశాయి.

Updated : 29 Dec 2021 02:00 IST

కొవిడ్‌ మహమ్మారి విజృంభణలోనూ డిజిటల్‌ పరికరాల వెల్లువ ఆగలేదు. కొంగొత్త పరిజ్ఞానాలతో వినూత్నంగానే అలరించాయి. ఇంటి నుంచే పని చేస్తున్నవారికి చేదోడుగా నిలిచాయి. ఆత్మీయులతో సంబంధ బాంధవ్యాలకు బాటలు వేశాయి. నిరాశా నిస్పృహలకు లోనుకాకుండా కొత్త ఉత్సాహాన్ని నింపాయి.  వీటిల్లో ఆదరణ పొందిన కొన్ని పరికరాలు ఇవీ..


ఐఫోన్‌ 13 ప్రొ మ్యాక్స్‌

డిజైన్‌ దగ్గర్నుంచి ప్రాసెసింగ్‌ పవర్‌ వరకు యాపిల్‌ ఐఫోన్‌ 13 ప్రొ మ్యాక్స్‌ సరికొత్తగా దర్శనమిచ్చింది. ఈ ఏడాది అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ ఇదే. హై రిఫ్రెష్‌ రేట్‌, మరింత సమర్థమైన బ్యాటరీ, మెరుగుపరచిన కెమెరా సెటప్‌తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఏ15 బయోనిక్‌ చిప్‌ దీనికి ఇంకా ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. అత్యంత శక్తిమంతమైన స్మార్ట్‌ఫోన్‌గా నిలబెట్టింది. కాంతిని ఎక్కువగా గ్రహిస్తూ, తక్కువ కాంతిలోనూ నాణ్యమైన దృశ్యాలను తీసేలా కెమెరా సెటప్‌ను తీర్చిదిద్దటం విశేషం. దీంతో సినిమాల మాదిరి వీడియోలను చిత్రీకరించుకోవటానికి మార్గం సుగమమైంది. వీడియోను ఫోన్‌లోనే ఎడిట్‌ చేసుకునే అవకాశమూ ఉంది.


సామ్‌సంగ్‌ మడత ఫోన్లు

డత ఫోన్ల విషయంలో ఈ సంవత్సరం సామ్‌సంగ్‌దే. గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3, ఫ్లిప్‌ 3 ఫోన్లతో సంచలనం సృష్టించింది. మరిన్ని పనులు చేసుకోవటానికి వీలుగా అదనపు తెరతో కూడిన గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3 మొబైల్‌ ప్రియులను బాగా ఆకట్టుకుంది. మడత ఫోన్ల రంగంలో గీటురాయిగానూ మారింది. ఇంత నాణత్య కలిగుంటుందని మొదట్లో ఎవరూ ఊహించలేదు. గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3 మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. వాడుకోని సమయంలో ఫోన్‌ చిన్నగా ఉండాలని కోరుకునేవారికిది ఎంతగానో నచ్చింది. ధర కూడా అంత ఎక్కువగా లేకపోవటమూ కలిసి వచ్చింది.


రెడ్‌మీ నోట్‌ 10 ప్రొ మ్యాక్స్‌

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా రెడ్‌మీ నోట్‌ సిరీస్‌ రూ.20వేల లోపు స్మార్ట్‌ఫోన్లలో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. రెడ్‌మీ నోట్‌ 10 ప్రొ మ్యాక్స్‌తో కంపెనీ 108ఎంపీ కెమెరా, మ్యాక్రో కెమెరాలను పరిచేయం చేసింది. ఇవి రెండూ అద్భుతమైన పనితీరుతో కనువిందు చేస్తున్నాయి. నైట్‌ మోడ్‌లోనూ దృశ్యాలను చాలా స్పష్టంగా గ్రహిస్తుండటం విశేషం.  డిస్‌ప్లేను కూడా అమోలెడ్‌ రకానికి ఆధునికీకరించారు. మొత్తానికి చవక స్మార్ట్‌ఫోన్ల రంగంలో తమకు సాటిలేదని మరోసారి కంపెనీ నిరూపించింది.


నథింగ్‌ ఇయర్‌ 1

మార్కెట్‌లో ఎన్నో వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ అందుబాటులో ఉన్నప్పటికీ నథింగ్‌ ఇయర్‌ 1ను పక్కన పెట్టి చూడలేం. పాక్షిక పారదర్శక డిజైన్‌తో ఎంతగానో ఆకట్టుకుంటోంది. చాలా తేలికగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రణగొణధ్వనులను తొలగించే నాయిస్‌ క్యాన్సలేషన్‌తో శ్రావ్యమైన శబ్దాలు వినిపిస్తుంది. దీని ఛార్జింగ్‌ కేసు కూడా పారదర్శకమైందే.  ఛార్జ్‌ అవుతున్నప్పుడు ఇయర్‌ఫోన్స్‌, వెలుగుతున్న ఎల్‌ఈడీ లైటును బయటి నుంచే చూడొచ్చు. యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌ కూడా ఉండటం మరో ప్రత్యేకత.


ఐప్యాడ్‌ మినీ

ఫోన్‌, సంప్రదాయ ఐప్యాడ్‌ మధ్య హద్దులను చెరిపేస్తూ అందుబాటులోకి వచ్చిన ఐప్యాడ్‌ మినీ కొత్త లైఫ్‌స్టైల్‌ పరికరంగానూ మారిపోయింది. ఐప్యాడ్‌లాంటిదే అయినా ఐప్యాడ్‌ మినీ పూర్తిగా భిన్నమైన పరికరం. రెండో తరం యాపిల్‌ పెన్సిల్‌ పుణ్యమాని నోట్స్‌ తీసుకునేటప్పుడు వెలుగుతుంది. ఆటలు ఆడుకోవటానికైనా, ఇ-పుస్తకాలు చదువుకోవటానికైనా వెంట ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి ఫీచర్లన్నీ దీనికి ఆదరణ పెరిగేలా చేస్తున్నాయి.


డెల్‌ 4కె అల్ట్రాషార్ప్‌ వెబ్‌క్యామ్‌

వీడియో ప్రసారాలు చేసేవారికి, కంటెంట్‌ క్రియేట్‌ చేసేవారికి డెల్‌ 4కె అల్ట్రాషార్ప్‌ వెబ్‌క్యామ్‌ ఎంతగానో నచ్చింది. రెట్రో-ఇన్‌స్పైర్డ్‌ డిజైన్‌తో కనువిందు చేయటమే కాదు.. గోప్యత కోసం మాగ్నెటిక్‌ లెన్స్‌, సులభమైన మౌంట్‌ ఆప్షన్లు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 8.3 మెగాపిక్సెల్‌ ఇమేజ్‌ సెన్సర్‌తో కూడిన ఈ వెబ్‌క్యామ్‌లో ఏఐ ఆటో ఫ్రేమింగ్‌ పరిజ్ఞానాన్నీ జోడించారు. ఇదేమీ మొట్టమొదటి 4కె వెబ్‌క్యామ్‌ కాకపోయినా డెల్‌ వర్షన్‌ బాగా ఆకట్టుకుంది. మొత్తానికిది ఆధునిక పని జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది.


సోనీ ఏ1 మిర్రర్‌లెస్‌ కెమెరా

న్యప్రాణులను, క్రీడలను చిత్రీకరించే అధునాతన కెమెరాల విషయంలో సోనీ ఏ1 కొత్త మైలురాయిని సృష్టించింది. అత్యంత శక్తిమంతమైన ఇమేజ్‌ ప్రాసెసర్‌తో కూడిన ఇది ఆగకుండా ప్రతి సెకండుకు 30 ఫుల్‌ రెజల్యూషన్‌ ఫొటోలను తీయగలదు. మెకానికల్‌ షటర్‌ను ఆపేసి, చడీ చప్పుడు లేకుండానూ చిత్రీకరించుకోవచ్చు.


మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ స్లిమ్‌ పెన్‌ 2

చ్చం కాగితం మీద బొమ్మలు గీస్తున్న అనుభూతిని కలిగించే మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ స్లిమ్‌ పెన్‌ 2 కళాకారులను బాగానే ఆకర్షించింది. అంతా దీనిలోని గ్రాఫిక్‌ నిబ్‌ గొప్పతనం. ఇందులో ‘జీరో-ఫోర్స్‌ ఇంకింగ్‌’ ఫీచర్‌ కూడా ఉంది. దీంతో స్క్రీన్‌ను తాకినప్పుడు పెన్నులోంచి డిజిటల్‌ సిరా ధారగా పడుతున్న అనుభూతి కలుగుతుంది. సర్ఫేస్‌ స్లిమ్‌ పెన్‌ ఛార్జింగ్‌ పెట్టెతో ఇది వైర్‌లెస్‌గా ఛార్జ్‌ అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని