కంపించే పట్టీతో కంటి చూపు!

చూపు కోల్పోయినవారి కోసం జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిచ్‌ శాస్త్రవేత్తలు వినూత్నమైన పరారుణ అద్దాలను రూపొందించారు. ఇవి కంపించే ప్యాడ్లతో కూడిన చేతి పట్టీతో అనుసంధానమై పనిచేస్తాయి. చేతిలో కర్ర, హెడ్‌ఫోన్స్‌ వంటి సాధనాలతో పనిలేకుండా తేలికగా

Published : 09 Feb 2022 00:30 IST

చూపు కోల్పోయినవారి కోసం జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిచ్‌ శాస్త్రవేత్తలు వినూత్నమైన పరారుణ అద్దాలను రూపొందించారు. ఇవి కంపించే ప్యాడ్లతో కూడిన చేతి పట్టీతో అనుసంధానమై పనిచేస్తాయి. చేతిలో కర్ర, హెడ్‌ఫోన్స్‌ వంటి సాధనాలతో పనిలేకుండా తేలికగా తిరగటానికి తోడ్పడతాయి. 3డీ ముద్రిత అద్దాల్లో రెండు ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలుంటాయి. ఇవి స్టీరియోస్కోపిక్‌ చిత్రాలను తీస్తాయి. వీటిని సూక్ష్మ కంప్యూటర్‌ విశ్లేషించి ముందున్న దృశ్యాలకు సంబంధించి ఒక పటాన్ని తయారుచేస్తాయి. తర్వాత ఈ పటం తక్కువ రెజల్యూషన్‌తో కూడిన 5 చదరాల గ్రిడ్‌గా మారుతుంది. ఇది చేతి పట్టీలోని కంపించే ప్యాడ్లకు చేరుకొని, చుట్టుపక్కల ఉన్నవాటిని గుర్తించేలా చేస్తాయి. ఉదాహరణకు- అద్దాలను, చేతి పట్టీని ధరించినవారు ఇరుకు దారిలో నడుస్తున్నారనుకోండి. ఎదురుగా గోడ ఉందనుకోండి. పట్టీలోని ప్యాడ్లు.. గ్రిడ్‌ దృశ్యం అంచులను గుర్తించి బలంగా కంపిస్తాయి. ఎదురుగా ఏదైనా అడ్డంకి ఉంటే దానికి దగ్గరగా వెళ్తుంటే కంపనాలు క్రమంగా పెరుగుతూ వస్తాయి. అద్దాలు ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలను ఉపయోగించుకుంటాయి కాబట్టి చిమ్మ చీకట్లోనూ పనిచేస్తాయి. ఈ అద్దాలు, ప్యాడ్లను గదిలో కొందరిపై పరీక్షించగా మంచి ఫలితం కనిపించింది. మామూలుగా 320 సెకండ్లలో నడిచే దూరాన్ని 148 సెకండ్లలోనే పూర్తిచేశారు. చేతిలో కర్ర వంటివి పట్టుకోవాల్సిన అవసరం లేకపోవటం వల్ల చూపు కోల్పోయినవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు చేసుకోవటానికి వీలవుతుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని