డెస్క్‌టాపే ఫోన్‌!

డెస్క్‌టాప్‌ మీదో, ల్యాప్‌టాప్‌ మీదో పనిచేస్తుంటాం. అంతలో ఫోన్‌ మోగింది. అదేమో దూరంగా ఉంది. లేచి వెళ్లి ఫోన్‌ తీయాల్సిందే. తీరా ఫోన్‌ తీశాక అదేదో మార్కెటింగ్‌ సంస్థ కాల్‌ అయితే మరీ చిరాకు వేస్తుంది.

Updated : 17 May 2022 16:38 IST

డెస్క్‌టాప్‌ మీదో, ల్యాప్‌టాప్‌ మీదో పనిచేస్తుంటాం. అంతలో ఫోన్‌ మోగింది. అదేమో దూరంగా ఉంది. లేచి వెళ్లి ఫోన్‌ తీయాల్సిందే. తీరా ఫోన్‌ తీశాక అదేదో మార్కెటింగ్‌ సంస్థ కాల్‌ అయితే మరీ చిరాకు వేస్తుంది. మరి కుర్చీలోంచి లేవకుండా కంప్యూటర్‌తోనే ఫోన్‌ కాల్స్‌ మాట్లాడితే? మెసేజ్‌లు పంపించు కోగలిగితే? ఆ మాటకొస్తే ఫోన్‌లో చేసే పనులన్నీ డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లోనే చేస్తే? ఇందుకు పీసీని ఫోన్‌ను అనుసంధానం చేసే యువర్‌ ఫోన్‌ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

మైక్రోసాఫ్ట్‌ సంస్థ విండోస్‌ 10 అప్‌డేట్‌తోనే యువర్‌ ఫోన్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో పీసీని స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవటం తేలికైంది. అప్పుడు డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ నుంచే కాల్‌ చేసుకోవచ్చు. టెక్స్ట్‌ మెసేజ్‌లను చూసుకోవచ్చు, పంపుకోవచ్చు. నోటిఫికేషన్లు అందుకోవచ్చు, మానేజ్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ యాప్‌లనూ యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఫైళ్లను, ఫొటోలను బదిలీ చేసుకోవచ్చు. మరి యువర్‌ ఫోన్‌ యాప్‌ సదుపాయాలను వాడుకోవటమెలా?

* ముందుగా మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ నుంచి యువర్‌ యాప్‌ను డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
* యాప్‌ను పీసీలో ఓపెన్‌ చేసి మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌తో సైన్‌ ఇన్‌ కావాలి.
* ఫోన్‌లో యువర్‌ ఫోన్‌ కంపానియన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఇందుకోసం ఫోన్‌లో వెబ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి పీసీలో మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌తో సైన్‌ అయ్యాక యాప్‌లో కనిపించే లింక్‌ను (www.aka.ms/your-pc) ఎంటర్‌ చేయాలి. సర్ఫేస్‌ డుయో, కొన్ని సామ్‌సంగ్‌ పరికరాల్లో యువర్‌ ఫోన్‌ యాప్‌ అప్పటికే ఇన్‌స్టాల్‌ అయ్యింటుంది.
* పీసీలో సైన్‌ ఇన్‌ అయిన వివరాలతోనే ఫోన్‌లోని యాప్‌తో సైన్‌ ఇన్‌ కావాలి.
* తర్వాత పీసీలోకి వెళ్లి ‘ఐ హావ్‌ ద యువర్‌ ఫోన్‌ కంపానియన్‌ - లింక్‌ టు విండోస్‌ యాప్‌ అల్రెడీ’ అనే బాక్స్‌లో టిక్‌ పెట్టి.. పెయిర్‌ విత్‌ క్యూఆర్‌ కోడ్‌ను ఎంచుకోవాలి. అప్పుడు పీసీ తెర మీద క్యూఆర్‌ కోడ్‌ విండో పాపప్‌ అవుతుంది. (ఒకవేళ క్యూఆర్‌ కోడ్‌ వద్దనుకుంటే ‘పెయిర్‌ మాన్యువల్లీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీన్ని ఎంచుకోగానే ఒక కోడ్‌ కనిపిస్తుంది. దీన్ని ఫోన్‌లో ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.)
* మొబైల్‌ ఫోన్‌లో ‘లింక్‌ యువర్‌ ఫోన్‌ అండ్‌ పీసీ’ని ఎంచుకోవాలి. అప్పుడు ‘ఈజ్‌ ద క్యూఆర్‌ కోడ్‌ ఆన్‌ యువర్‌ పీసీ రెడీ?’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. తర్వాత ‘కంటిన్యూ’ బటన్‌ను నొక్కాలి. తర్వాత కెమెరా యాక్సెస్‌ చేయటానికి అనుమతి ఇవ్వాలి. దీంతో ఇన్‌ యాప్‌ కెమెరా ఓపెన్‌ అవుతుంది. అప్పుడు పీసీలో కనిపించే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.
* క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేశాక మరిన్ని ఫొటోలు, ఫైళ్లు, ఎస్‌ఎంఎస్‌, వాయిస్‌ కాల్స్‌ వంటి వాటికి అనుమతులు అడుగుతుంది. వీటన్నింటికీ అంగీకరించాలి. అప్పుడే పీసీ మీద ఫోన్‌లోని అన్ని సదుపాయాలను వినియోగించుకోవటానికి వీలుంటుంది.
* పీసీలో ఫోన్‌ యాప్‌ సెటింగ్స్‌లోకి వెళ్లి ఆయా అంశాలకు సంబంధించిన బటన్లను ఆన్‌ చేసుకోవాలి. అంతే.. ఫోన్‌లో మాదిరిగానే డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లో మెసేజెస్‌, ఫొటోస్‌, యాప్స్‌ వంటివన్నీ దర్శనమిస్తాయి. కాల్స్‌ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయగానే ఫోన్‌లోని బ్లూటూత్‌తో అనుసంధానం కోసం ఒక కోడ్‌ను పంపుతుంది. దీనికి అనుమతించాలి. కనెక్ట్‌ అయ్యాక ఎంచక్కా పీసీ స్పీకర్‌ నుంచే ఫోన్‌ చేసుకోవచ్చు.
* యాప్స్‌కు ఒకసారి అవసరమైన అనుమతులిస్తే చాలు. అన్ని యాప్స్‌ను డెస్క్‌టాప్‌ మీదే చూసుకోవచ్చు. ఒకే సమయంలో ఎన్ని యాప్స్‌తోనైనా పనులు చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని