విండోస్‌-11 తెరకు అందాలద్దండి

విండోస్‌-11లో ఒకే వాల్‌పేపర్‌ను చూస్తుంటే విసుగొస్తోందా? అయితే వాల్‌పేపర్‌, లాక్‌స్క్రీన్‌ మార్చుకొని చూడండి. దీంతో తెర మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వాల్‌పేపర్‌తో పాటు థీమ్స్‌, రంగులు వంటి వాటిని కావాల్సినట్టుగా మార్చుకోవటానికి చాలా ఆప్షన్లే ఉన్నాయి.

Updated : 17 May 2022 16:36 IST

విండోస్‌-11లో ఒకే వాల్‌పేపర్‌ను చూస్తుంటే విసుగొస్తోందా? అయితే వాల్‌పేపర్‌, లాక్‌స్క్రీన్‌ మార్చుకొని చూడండి. దీంతో తెర మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వాల్‌పేపర్‌తో పాటు థీమ్స్‌, రంగులు వంటి వాటిని కావాల్సినట్టుగా మార్చుకోవటానికి చాలా ఆప్షన్లే ఉన్నాయి. వాల్‌పేపర్‌, లాక్‌స్క్రీన్‌ కోసం రంగు, ఫొటో లేదూ స్లైడ్‌షో ఏదైనా ఎంచుకోవచ్చు. దీనికి పెద్దగా కష్టపడాల్సిన పనేమీ లేదు. తేలికగానే చేసుకోవచ్చు.

వాల్‌పేపర్‌ మార్చుకోవటం

* స్టార్ట్‌ బటన్‌ను నొక్కి, పర్సనలైజేషన్‌ ట్యాబ్‌ ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌ బార్‌లోకి వెళ్లాలి.

* అక్కడ ఇమేజెస్‌ ప్రివ్యూలు కనిపిస్తాయి. పర్సనలైజ్‌ యువర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ విభాగానికి కుడివైపున ఉండే డ్రాప్‌డౌన్‌ మెనూలోకి వెళ్లాలి. దీనిలోంచి ఫొటో, స్లైడ్‌షో, కలర్‌ దేనినైనా వాల్‌పేపర్‌గా ఉపయోగించుకోవచ్చు. అందుబాటులో ఉన్న ఆప్షన్లనే కాదు.. గ్యాలరీలోని ఫొటోలనూ ఎంచుకోవచ్చు.

* డెస్క్‌టాప్‌ ఇమేజ్‌కు సరిపడినట్టుగా సైజును సరిచేసుకోగానే సెటింగ్స్‌ విండో వెనకాల కొత్త వాల్‌పేపర్‌ కనిపిస్తుంది.

* ఒకవేళ ఇమేజ్‌ మొత్తం స్క్రీన్‌ను ఫిల్‌ చేయకపోయినట్టయితే బ్యాక్‌గ్రౌండ్‌ రంగునూ ఎంచుకోవచ్చు. ఇష్టమైన రంగును సృష్టించుకోవచ్చు కూడా.

* కావాలంటే పర్సనలైజ్‌ యువర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మెనూ ద్వారా స్లైడ్‌షోను సెట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం పిక్చర్‌ ఆల్బమ్‌ నుంచి ఇమేజ్‌లను ఎంచుకోవాలి. స్లైడ్‌షోలో ఇమేజ్‌లు మారే తీరు, అవి తెరలో ఫిట్‌ అయ్యే విధానం, ఎఫెక్ట్‌లనూ సెట్‌ చేసుకోవచ్చు. కంప్యూటర్‌ బ్యాటరీ పవర్‌ మీద ఉన్నప్పుడు స్లైడ్‌షో ప్లే కావాలో, వద్దో కూడా నిర్ణయించుకోవచ్చు.

లాక్‌ స్క్రీన్‌ మార్పు ఇలా..

* ముందుగా డెస్క్‌టాప్‌లో ఖాళీగా ఉన్నచోట ఎక్కడైనా రైట్‌ క్లిక్‌ చేసి, పర్సనలైజ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. లేదా విండోస్‌, ఐ బటన్లు రెండింటిని ఒకేసారి నొక్కినా సైడ్‌బార్‌లో పర్సనలైజేషన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.

* తర్వాత ‘లాక్‌ స్క్రీన్‌’ ట్యాబ్‌ మీద క్లిక్‌ చేయాలి. లాక్‌ స్క్రీన్‌ స్టేటస్‌లోకి వెళ్లాలి. ఇందులో లాక్‌ స్క్రీన్‌ మీద స్టేటస్‌ విడ్జెట్‌ కనిపిస్తుంది. లాక్‌ స్క్రీన్‌ పిక్చర్‌ను డిసేబుల్‌ చేయాలి.

* పర్సనలైజ్‌ యువర్‌ లాక్‌ స్క్రీన్‌ ఆప్షన్‌ ద్వారా ఇష్టమైన పిక్చర్‌ లేదా స్లైడ్‌షోను ఎంచుకోవాలి. కావాలంటే అన్‌రీడ్‌ మెయిల్స్‌, ప్రస్తుత వాతావరణానికి సంబంధించిన యాప్స్‌ను కూడా లాక్‌ స్క్రీన్‌ మీద స్టేటస్‌ డిస్‌ప్లే అయ్యేలా చేసుకోవచ్చు.

* విండోస్‌ 11 సైన్‌-ఇన్‌ స్క్రీన్‌ మీద బ్యాక్‌గ్రౌండ్‌ ఇమేజ్‌ను లాక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ‘షో ద లాక్‌ స్క్రీన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ పిక్చర్‌ ఆన్‌ సైన్‌-ఇన్‌ స్క్రీన్‌’ను ఎంచుకొని ‘ఆఫ్‌’ చేసుకోవాలి.

* అన్నీ ఎంచుకున్నాక సెటింగ్స్‌ను క్లోజ్‌ చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని