విస్తరిస్తోంది ఇ ఇంక్‌!

కిండిల్‌ వంటి ఇ-రీడర్లతో బాగానే చదివేస్తుంటాం. మామూలు పుస్తకాల మాదిరిగానే వీటినీ తిరగేస్తుంటాం. వీటిని చదువుతున్నప్పుడు కళ్ల మీద ఎలాంటి ఒత్తిడీ పడదు మరి. దీనికి కారణం వీటి తెరల వెనకాల ఉన్న పరిజ్ఞానమే. ఇదో ఇ ఇంక్‌ డిస్‌ప్లే టెక్నాలజీ. ఎల్‌సీడీ, ఓఎల్‌ఈడీల

Published : 25 May 2022 01:09 IST

కిండిల్‌ వంటి ఇ-రీడర్లతో బాగానే చదివేస్తుంటాం. మామూలు పుస్తకాల మాదిరిగానే వీటినీ తిరగేస్తుంటాం. వీటిని చదువుతున్నప్పుడు కళ్ల మీద ఎలాంటి ఒత్తిడీ పడదు మరి. దీనికి కారణం వీటి తెరల వెనకాల ఉన్న పరిజ్ఞానమే. ఇదో ఇ ఇంక్‌ డిస్‌ప్లే టెక్నాలజీ. ఎల్‌సీడీ, ఓఎల్‌ఈడీల వంటి డిస్‌ప్లే టెక్నాలజీలో తెర వెనకాల నుంచి కాంతి వెలువడి మన కళ్లను తాకుతుంది. ఇ ఇంక్‌ టెక్నాలజీలో చుట్టుపక్కల నుంచి వచ్చే కాంతి తెర మీద ప్రతిఫలించి మన కళ్లకు చేరుతుంది. విద్యుత్తు సాయంతో పనిచేసే ఇది వర్ణద్రవ్య క్యాప్యూల్స్‌ను కనిపించేలా లేదా మాయమయ్యేలా చేస్తుంది. ఫలితంగా ఆయా దృశ్యాలు, అక్షరాలు మనకు కనిపిస్తాయి. కాగితం మీద సిరాతో ప్రింట్‌ తీసినట్టుగానే సహజంగా కనిపిస్తాయి. ఇది చాలా తక్కువ విద్యుత్తునే వాడుకుంటుంది. కొత్తగా ఏదైనా రాసినప్పుడే ఇ ఇంక్‌ విద్యుత్తును వినియోగించుకుంటుంది. అందుకే అమెజాన్‌ కిండిల్‌ వంటి ఇ-రీడర్ల బ్యాటరీలు ఎక్కువ కాలం మన్నుతాయి. ఇ ఇంక్‌ పరిజ్ఞానం ఇప్పుడు బాగా విస్తరిస్తోంది. దీన్ని ఇ-రీడర్లకే కాదు ఇతరత్రా అవసరాలకూ వాడుకుంటున్నారు. ఉదాహరణకు- అక్షరాలను మార్చాల్సిన అవసరం లేని డిజిటల్‌ సంకేతాల (సూపర్‌ మార్కెట్లలో ధరల సూచీల వంటివి) కోసం ఉపయోగించుకుంటున్నారు. దీన్ని మడతపెట్టే పరికరాల తెరలు, ట్యాబ్లెట్ల వంటి వాటికీ జోడించాలని కొన్ని ఫోన్ల కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. మడత తెరల పరికరాలు సాధారణంగా లోపలి వైపునకు మలచుకుంటాయి. పైభాగంలో ఎలాంటి సమాచారం కనిపించదు. ఈ ఇబ్బందిని తప్పించటానికి ఫోన్‌ తయారీదారులు బయటవైపు అదనపు స్క్రీన్లను జోడిస్తున్నారు. టైమ్‌ వంటి ప్రాథమిక సమాచారం కనిపించేలా చేస్తున్నాయి. కొన్ని ఫోన్లు ఇందుకు పూర్తిస్థాయి ఎల్‌ఈడీ తెరలనూ జత చేస్తున్నాయి. అయితే ఇవి ఎక్కువ విద్యుత్తును వాడుకుంటాయి. దీంతో బ్యాటరీ త్వరగా నిండుకుంటుంది. ఈ నేపథ్యంలో తక్కువ విద్యుత్తును వాడుకునే ఇ ఇంక్‌ మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఇ ఇంక్‌ తెరలు నలుపు తెలుపులోనే ఉండేవి. ప్రస్తుతం రంగుల్లోనూ వస్తున్నాయి. రంగు ఇ ఇంక్‌తోనైతే చీకట్లోనూ అక్షరాలు, దృశ్యాలు కనిపిస్తాయి.

* ఇ ఇంక్‌తో మరో ప్రయోజనం కంటికి హాయిగా ఉండటం. మామూలు కాంతి సమక్షంలో సహజంగా కనిపిస్తుంది. అయితే కొన్ని లోపాలు లేకపోలేదు. ఇ ఇంక్‌ కాంతిని వెదజల్లదు కాబట్టి చీకట్లో అక్షరాలు కనిపించవు. అందుకే ఇ-రీడర్లు తెరల చుట్టూ బిల్టిన్‌గా ఎల్‌ఈడీ లైట్లను అమరుస్తుంటాయి. మరో లోపం నెమ్మదిగా రిఫ్రెష్‌ కావటం. క్రమంగా ఈ వేగం పెరుగుతూ వస్తున్నప్పటికీ కంప్యూటర్‌ తెరల రిఫ్రెష్‌ వేగంతో పోలిస్తే తక్కువే. ఈ ఇబ్బందిని అధిగమించి యానిమేషన్‌, వీడియోల వంటి వాటికీ ఇ ఇంక్‌ను వాడుకోవటానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని