Updated : 01 Jun 2022 09:59 IST

ల్యాప్‌టాప్‌ వేగం పెంచండి

కొత్తదే అయినా రాన్రానూ ల్యాప్‌టాప్‌ వేగం నెమ్మదిస్తుంటుంది. దీంతో పనులూ ఆలస్యమవుతుంటాయి. ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. అత్యవసరమైన పనుల మధ్యలోనైతే మరింత చికాకు కలుగుతుంది. అయితే కొన్ని తేలికైన చిట్కాలతో ల్యాప్‌టాప్‌ వేగం పుంజుకునేలా చేయొచ్చు. అవేంటో చూద్దాం..

వాడని ప్రోగ్రామ్‌లను ఆపెయ్యటం

మనం ప్రస్తుతం వాడకపోయినా కొన్ని ప్రోగ్రామ్‌లు అలా నడుస్తూనే ఉంటాయి. ఇవి ల్యాప్‌టాప్‌ వేగాన్ని తగ్గిస్తాయి. అనవసరమైన ప్రోగ్రామ్‌ విండోలను క్లోజ్‌ చేస్తే వెంటనే కుదురుకుంటుంది. ముఖ్యంగా పాత ల్యాప్‌టాప్‌ అయితే తక్షణం వేగం పుంజుకుంటుంది. అయితే అన్ని ప్రోగ్రామ్‌లను ఇలా తేలికగా క్లోజ్‌ చేయలేం. కొన్ని ప్రోగ్రామ్‌లు పైకి కనిపించకపోయినా వెనకాల నడుస్తుంటాయి. వీటి మీద ఓ కన్నేయటం మంచిది. కంట్రోల్, షిఫ్ట్, ఎస్కేప్‌ బటన్లను ఒకేసారి నొక్కితే విండోస్‌ టాస్క్‌ మేనేజర్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో వెనకాల రన్‌ అవుతున్న ప్రోగ్రామ్‌లు కనిపిస్తాయి. వీటిల్లో అవసరం లేని వాటిపై రైట్‌ క్లిక్‌ చేసి ‘ఎండ్‌ టాస్క్‌’ను ఎంచుకోవాలి. దీంతో అవి రన్‌ అవటం ఆగిపోతుంది.

అనవసర ట్యాబ్‌లను క్లోజ్‌ చేయటం

అదేపనిగా బ్రౌజర్‌ మీద పని చేస్తున్నట్టయితే వీలైనంతవరకు తక్కువ ట్యాబ్‌లు ఓపెన్‌ చేసి ఉండేలా చూసుకోవాలి. బ్రౌజర్‌ విండోలో ఎన్ని ఎక్కువ ట్యాబ్‌లు ఓపెన్‌ చేసి ఉంటే ర్యామ్, ప్రాసెసర్‌ మీద అంత ఎక్కువ భారం పడుతుందని మరవరాదు. దీంతో ల్యాప్‌టాప్‌ వేగమూ తగ్గుతుంది. 

రీస్టార్ట్‌ చేయటం

అప్పుడప్పుడు రీస్టార్ట్‌ చేస్తుంటే పాత ల్యాప్‌టాప్‌ అయినా మరింత వేగంతో పనిచేస్తుంది. రీస్టార్ట్‌ చేయటం వల్ల తాత్కాలిక క్యాచీ మెమరీ తొలగిపోతుంది. చాలా ప్రోగ్రామ్‌లు మరింత బాగా పనిచేయటం ఆరంభిస్తాయి. అయితే విండోస్‌తో పాటు స్టార్ట్‌ అయ్యే ప్రోగ్రామ్‌లు ఉన్నట్టయితే రీస్టార్ట్‌ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

స్టార్టప్‌ యాప్స్‌పై కన్నేయండి

స్టార్టప్‌ యాప్స్‌ సంఖ్య తెలియకుండానే క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇవి ల్యాప్‌టాప్‌ బూట్‌ టైమ్‌ మీదే కాదు.. పనితీరు మీదా ప్రభావం చూపుతాయి. ఇవి పరికరం వనరులనూ వెనకాల నుంచి వాడుకుంటుంటాయి. కంట్రోల్, షిఫ్ట్, ఎస్కేప్‌ బటన్లను కలిపి నొక్కి ‘టాస్క్‌ మేనేజర్‌’ ఓపెన్‌ చేయాలి. అక్కడ్నుంచి స్టార్టప్‌ ట్యాబ్‌లోకి వెళ్లి అవసరం లేని వాటిని డిసేబుల్‌ చేసుకోవచ్చు.

అనవసర ప్రోగ్రామ్స్‌ అన్‌ఇన్‌స్టాల్‌

ఇది ల్యాప్‌టాప్‌ స్టోరేజీని పెంచుకోవటానికి అత్యంత సమర్థమైన, తేలికైన పద్ధతి. ఆటో స్టార్టయ్యే ప్రోగ్రామ్‌లను తరచూ పనిగట్టుకొని క్లోజ్‌ చేస్తున్నా, ఏవైనా ప్రోగ్రామ్‌లను చాలాకాలంగా వాడుకోవటం లేదనిపించినా ఆన్‌ఇన్‌స్టాల్‌ చేయటం మంచిది. పనికి సంబంధించినవైనా.. గేమ్స్, ఇతర సాఫ్ట్‌వేర్‌లు ఏవైనా అవసరంలేని వాటిని అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తే ల్యాప్‌టాప్‌ వేగం పెరుగుతుంది.  

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts