ఆండ్రాయిడ్‌తో ఆడుకో

ఒక్క నిమిషం చేతిలో ఫోన్‌ లేకపోతే ఏమీ తోచదు. ఏదో పోగొట్టుకున్నట్టే అనిపిస్తుంది. మరి దీంతో చేసే పనులు అన్నీ ఇన్నీ కావాయె. వీటిని మరింత తేలికగా, త్వరగా చేయాలనుకుంటే? దగ్గరి దారులున్నాయిగా.

Updated : 20 Jul 2022 03:04 IST

క్క నిమిషం చేతిలో ఫోన్‌ లేకపోతే ఏమీ తోచదు. ఏదో పోగొట్టుకున్నట్టే అనిపిస్తుంది. మరి దీంతో చేసే పనులు అన్నీ ఇన్నీ కావాయె. వీటిని మరింత తేలికగా, త్వరగా చేయాలనుకుంటే? దగ్గరి దారులున్నాయిగా.

డబుల్‌ ట్యాప్‌తో

ఫోన్‌ను ఓపెన్‌ చేయటానికి పక్క బటన్‌ నొక్కటం తెలిసిందే. వేలితో తాకితేనే స్క్రీన్‌ వెలిగితే? ప్రీమియం ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో దాదాపు అన్నింటిలోనూ ఈ సదుపాయం ఉంటుంది. సెటింగ్స్‌ ద్వారా లాక్‌ స్క్రీన్‌ ఫీచర్‌లోకి వెళ్తే ‘డబుల్‌ ట్యాప్‌ స్క్రీన్‌ టు వేక్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఒకసారి దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే చాలు. స్క్రీన్‌ లాక్‌ అయినప్పుడు తెర మీద రెండు సార్లు వేలితో తడితే వెంటనే వెలుగుతుంది.

అన్‌లాక్‌ చేయకుండానే ఫొటోలు

అప్పుడప్పుడు ఫొటోలు తీయటానికి ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి ఇతరుల చేతికి ఇస్తుంటాం. ఇది అంత సురక్షితం కాదు. అందుకని ఈసారి అన్‌లాక్‌ చేయకుండానే స్క్రీన్‌ మీద కెమెరా గుర్తును నొక్కి పక్కకు జరిపి చూడండి. కెమెరా యాప్‌ తెరచుకుంటుంది. వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది. మనశ్శాంతి లభిస్తుంది.

నొక్కి పడితే షార్ట్‌కట్స్‌

యాప్స్‌తో తేలికగా పనులు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే షార్ట్‌కట్స్‌ వాడుకోండి. యాప్‌ గుర్తు మీద నొక్కిపడితే షార్ట్‌కట్స్‌ కనిపిస్తాయి. ఉదాహరణకు- డైలర్‌ గుర్తు మీద నొక్కి పట్టి కొత్త కాంటాక్ట్‌ను జోడించుకోవచ్చు. క్రోమ్‌ గుర్తు మీద నొక్కితే ఇన్‌కాగ్నిటో విండోను ఓపెన్‌ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ గుర్తు మీద నొక్కి పట్టి కెమెరా, న్యూ పోస్ట్‌, వ్యూ యాక్టివిటీ, ఛాట్స్‌ వంటి ఆప్షన్లు ఉపయోగించుకోవచ్చు.

ఒక చేత్తో కీబోర్డు

రాన్రాను ఫోన్ల సైజు పెరుగుతూ వస్తోంది. ఒక చేత్తో వాడుకోవటం కష్టమైపోతోంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో డిఫాల్ట్‌గా ఉండే గూగుల్‌ కీబోర్డు దీనికి పరిష్కారం చూపుతుంది. చిన్న షార్ట్‌కట్‌తో ఒక చేత్తో వాడుకునేలా మార్చుకోవచ్చు. కీబోర్డును మామూలుగా ఓపెన్‌ చేసి, కామా గుర్తు మీద నొక్కి పట్టాలి. అప్పుడు చేతి బొమ్మ ఒకటి కనిపిస్తుంది. అలాగే దీనిలోకి డ్రాగ్‌ చేయగానే కీబోర్డు స్వరూపం మారుతుంది. ఒక వైపున కనిపించే బాణం గుర్తుతో కీబోర్డును కుడి, ఎడమలకు మార్చుకోవచ్చు. కింద కనిపించే గుర్తుతో కీబోర్డును రీపొజిషన్‌ చేసుకోవచ్చు. పైన గుర్తుతో తిరిగి ఫుల్‌సైజులోకి మార్చుకోవచ్చు.

వై-ఫై డైరెక్ట్‌తో నేరుగా

కొన్నిసార్లు బ్లూటూత్‌ కనెక్ట్‌ కాకపోవచ్చు. కనెక్ట్‌ అయినా ఫైల్‌ నెమ్మదిగా ట్రాన్స్‌ఫర్‌ అవుతుండొచ్చు. ఫోన్‌లో వై-ఫై డెరెక్ట్‌ ఫీచర్‌ ఉంటే ఇలాంటి ఇబ్బందిని తప్పించుకోవచ్చు. బ్లూటూత్‌ మాదిరిగానే ఇదీ వైర్‌లెస్‌గా ఫైళ్లు పంపించుకోవటానికి వీలు కల్పిస్తుంది. ముందుగా సెటింగ్స్‌లోకి వెళ్లి, వై-ఫై విభాగంలో వై-ఫై డైరెక్ట్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. ఒకసారి కనెక్షన్‌ ఎస్టాబ్లిష్‌ కాగానే షేర్‌ బటన్‌ను నొక్కి ఒక ఫోన్‌ నుంచి మరొక ఫోన్‌కు ఫైళ్లు పంపించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని