Published : 27 Jul 2022 00:17 IST

కచ్చా యాపిల్‌!

కొత్త స్మార్ట్‌ఫోన్‌ వస్తోందనగానే ప్రత్యేకతల మీదే అందరి దృష్టి పడుతుంది.కచ్చా యాపిల్‌! కొత్త స్మార్ట్‌ఫోన్‌ వస్తోందనగానే ప్రత్యేకతల మీదే అందరి దృష్టి పడుతుంది. తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకోవటంలో ఐఫోన్‌ ఎప్పుడూ అన్నింటికన్నా ముందే ఉంటుంది. ఈ సంవత్సరం మరిన్ని భారీ మార్పులతోనూ ముందుకు రానుంది. ఐఓఎస్‌ 16 తుది వర్షన్‌ ఈ సంవత్సరం చివర్లో కనువిందు చేయనున్నప్పటికీ ఇటీవల విడుదలైన పబ్లిక్‌ బీటా వర్షన్‌ ఇప్పటికే బాగా ఆకట్టుకుంటోంది. అన్నింటికన్నా గొప్ప విషయం ఏంటంటే దీన్ని ఐఫోన్‌ 8, దీని తర్వాతి మోడళ్లలో ఇన్‌స్టాల్‌ చేసుకునే అవకాశం ఉండటం. మరి దీనిలోని కొంగొత్త ఫీచర్లపై ఓ లుక్కేద్దామా!

లాక్‌ స్క్రీన్‌
కొత్త ఐఫోన్‌లో మార్పుల గురించైతే ప్రధానంగా చెప్పుకోవాల్సింది లాక్‌స్క్రీన్‌ గురించే. తెరను అన్‌లాక్‌ చేయకుండానే ఎన్నో పనులు చేసుకోవచ్చు. స్క్రీన్‌ మీద కాసేపు నొక్కి పట్టి, సెటింగ్స్‌లోకి వెళ్లొచ్చు. దీని ద్వారా వాల్‌పేపర్‌ను ఎంచుకోవచ్చు. ఒకవేళ వాల్‌పేపర్‌ నచ్చలేదనుకోండి. ఇష్టమైన ఫొటోలనూ వాల్‌పేపర్‌గా సెట్‌ చేసుకోవచ్చు. కలర్‌ ఆప్షన్‌ ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌ రంగును, గాఢతను ఆకర్షణీయంగా మలచుకోవచ్చు. అంతేకాదు, యాపిల్‌ వాచ్‌ మీద మాదిరిగానే తెర లాక్‌లోనే ఉన్నా విడ్జెట్లను ఎంచుకోవచ్చు. ఒకవేళ వాతావరణ విడ్జెట్‌ ముఖ్యమైందని భావిస్తే దీన్ని పైకి కనిపించేలా చూసుకోవచ్చు. ఇష్టమైన ఫాంట్స్‌, రంగులను జోడించుకోవచ్చు. లాక్డ్‌ స్క్రీన్‌తో వివిధ ఫోకస్‌ మోడ్లను కూడా అటాచ్‌ చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన ఫీచర్‌ లైవ్‌ యాక్టివిటీస్‌. మ్యూజిక్‌, క్రీడల వంటి వాటికోసం లాక్డ్‌ స్క్రీన్‌లో ప్రత్యేకంగా చోటు కల్పించారు మరి. తెర మీద ఒక్క గడియారం విడ్జెటే ఉన్నట్టయితే దీన్ని వాల్‌పేపర్‌ పోర్‌గ్రౌండ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మధ్యలో ఉండేలా సెట్‌ చేసుకునే వెసులుబాటూ ఉంటుంది. ఉదాహరణకు- పిల్లి బొమ్మ వాల్‌పేపర్‌ మధ్యలో గడియారం విడ్జెట్‌ వచ్చేలా సెట్‌ చేసుకున్నారనుకోండి. అప్పుడు పిల్లి తల గడియారం పైభాగాన కనిపిస్తుంది. మిగతా భాగమంతా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండిపోతుంది. ఇలా 3డీ ఎఫెక్ట్‌ కనిపిస్తుంది. ఇది పోర్‌ట్రెయిట్‌ మోడ్‌ ఫొటోలకే పరిమితం కాదు. ఎలాంటి ఫొటోనైనా దీనికి వాడుకోవచ్చు. మాటిమాటికీ ఫోన్‌ను అన్‌లాక్‌ చేసేవారికి ఇలాంటి మార్పులు ఎంతగానో ఉపయోగపడతాయనటంలో సందేహం లేదు.
మెసేజెస్‌ ఎడిట్‌/అన్‌సెండ్‌
పంపించిన మెసేజ్‌లను ఎడిట్‌ చేసుకునే, అన్‌సెండ్‌ చేసుకునే ఫీచర్‌ కోసం ఐఫోన్‌ ప్రియులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఐఓఎస్‌ 16 రాకతో ఇది తీరనుంది. ఏదో టైప్‌ చేశాం, దాన్ని పంపించొద్దని అనుకున్నామనుకోండి. కొత్త ఫీచర్‌తో ఇది సాధ్యమవుతుంది. అప్పుడే పంపించిన మెసేజ్‌ మీద కాసేపు నొక్కి పడితే ఎడిట్‌, అన్‌డూ సెండ్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. ఎడిట్‌ను ఎంచుకొని కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు. మెసేజ్‌ను పంపించాక 15 నిమిషాల్లోపు ఎడిట్‌ చేసుకోవచ్చు. మెసేజ్‌ను అందుకున్నవారికి దీన్ని మార్చినట్టు నోటిఫికేషన్‌ అందుతుంది. అన్‌డూ సెండ్‌ను ఎంచుకుంటే మెసేజ్‌ బబుల్‌ అదృశ్యమైపోతుంది. అవతలివారికి మెసేజ్‌ను సెండ్‌ చేయలేదని తెలుస్తుంది కానీ అన్‌సెండ్‌ చేసిన మెసేజ్‌ కనిపించదు. అయితే అవతలివారి ఫోన్‌ ఐఓఎస్‌ 16 మీద లేనట్టయితే మాత్రం మెసేజ్‌ అందుకున్నవారికి అది కనిపిస్తుంది.
* ఎస్‌ఎంఎస్‌ మేసేజ్‌లను ద ట్రాన్సాక్షన్స్‌, ప్రమోషన్స్‌ విభాగాల్లో 12 ఉపవర్గాలుగా విభజించుకోవచ్చు. ట్రాన్సాక్షన్స్‌లో ఫైనాన్స్‌, రిమైండర్స్‌, ఆర్డర్స్‌, హెల్త్‌, పబ్లిక్‌ సర్వీసెస్‌, వెదర్‌, కెరియర్‌, రివార్డ్స్‌, అదర్స్‌గా విడదీసుకోవచ్చు. ప్రమోషన్స్‌లో ఆఫర్స్‌, కూపన్స్‌ వారీగా విభజించుకోవచ్చు.

మెయిల్‌ యాప్‌
మెయిల్‌లో ఏదో రాస్తాం. దాన్ని తర్వాత పంపిస్తే బాగుంటుందని అనుకుంటాం. దీనికీ వెసులుబాటు ఉంటుంది. కొత్త మెసేజ్‌ను టైప్‌ చేస్తున్నప్పుడే దాన్ని తర్వాత పంపించుకునేలా నిర్ణయించుకోవచ్చు. మెసేజ్‌ మీద ‘మార్క్‌ ఫర్‌ లేటర్‌’ ఎంచుకుంటే దాని గురించి యాప్‌ తర్వాత మరోసారి గుర్తుచేస్తుంది. అప్పుడే పంపిన మెయిల్‌ను వెనక్కి తీసుకోవచ్చు కూడా. ఎదైనా అటాచ్‌మెంట్‌ను, రిసీపియెంట్‌ను మరచిపోతే మెయిల్‌ వెంటనే దాన్ని గుర్తిస్తుంది. ఏదైనా జోడించాల్సింది ఉందా? ఎవరినైనా మరచిపోయారా? అని అడుగుతుంది.

ఫొటోస్‌ యాప్‌
కుటుంబంతో షేర్‌ చేసిన ఫొటోలకు సంబంధించి ‘ఐక్లౌడ్‌ షేర్డ్‌ ఫొటో లైబ్రరీ’ ఆప్షన్‌ తోడైంది. దీంతో ఇతర కుటుంబ సభ్యులు తీసిన ఫొటోలకు విడిగా ఫీడ్‌ జనరేట్‌ అవుతుంది. లైబ్రరీకి ఆయా వ్యక్తులను, ప్రాంతాలను జోడించుకోవటంతో పాటు తీసిన ఫొటోలను షేర్డ్‌ లైబ్రరీలోకి నేరుగా వెళ్లేలా కూడా సెట్‌ చేసుకోవచ్చు. హిడెన్‌, డిలీటెడ్‌ ఫొటోలకు లాక్డ్‌ ఫోల్డర్ల ఫీచర్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఫోన్‌లో చాలా స్పేస్‌ ఆదా అవుతుంది.
లైవ్‌ టెక్స్ట్‌
ఫొటోల మీద టెక్స్ట్‌ను స్పష్టంగా చూపే లైవ్‌టెక్స్ట్‌ ఆప్షన్‌ ఇకపై వీడియోలకూ వర్తిస్తుంది. వీడియోల మీద కనిపించే టెక్స్ట్‌ మీద రెండుసార్లు నొక్కితే చాలు. దాన్ని సంగ్రహించొచ్చు, అనువాదం చేసుకోవచ్చు.
లైవ్‌ ఆబ్జెక్ట్స్‌
దీని ద్వారా ఏ ఫొటోలోనైనా బ్యాక్‌గ్రౌండ్‌ను వేరు చేసుకోవచ్చు. ఫొటోలో ఏ వస్తువు మీదనైనా కాసేపు అలాగే నొక్కి పడితే చాలు. దాన్ని అక్కడ్నుంచి తీసుకొని, కావాల్సిన చోట వాడుకోవచ్చు. అంటే తేలికగా ఇమేజ్‌ను కటౌట్‌ చేసుకోవచ్చన్నమాట. ఇమేజ్‌ను ఎడిట్‌ చేసుకోవటానికిది చాలా అనువుగా ఉంటుంది. పెంపుడు జంతువుల స్టికర్లను సృష్టించుకొని వాటిని మెసేజ్‌లలో జోడించుకోవాలని అనుకునేవారికీ ఉపయోగపడుతుంది.
కంటిన్యూటీ కెమెరా
ఇదో విచిత్రమైన ఫీచర్‌. స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు రాన్రానూ కొత్తదనం సంతరించుకుంటూ వస్తున్నాయి గానీ ల్యాప్‌టాప్‌ కెమెరాగా ఉపయోగించుకోలేం. ఐఓఎస్‌ 16, తాజా మ్యాక్‌ఓఎస్‌ వెంచురా ఉంటే కొత్త ఫీచర్‌తో ఫోన్‌ను వెబ్‌క్యామ్‌గా వాడుకోవచ్చు. ల్యాప్‌టాప్‌ మీద ఐఫోన్‌ను తగిలించి కంటిన్యూటీ కెమెరా ఆప్షన్‌ను ఆన్‌ చేస్తే అది మ్యాక్‌ వెబ్‌క్యామ్‌గా మారిపోతుంది. ఇది డెస్క్‌ వ్యూ అవకాశాన్నీ కల్పిస్తుంది. అంటే పై నుంచి కిందికి ఫొటోలు తీయటం అన్నమాట. వీడియోకాల్‌లో దేనినైనా చూపిస్తున్నప్పుడు కొన్నిసార్లు పై నుంచి కిందికి చూపించాల్సి రావొచ్చు. దీన్ని ఐఫోన్‌ కమెరాతోనే సాధించొచ్చు. ఇది అల్ట్రావైడ్‌ వ్యూతో ఆయా వస్తువులను స్పష్టంగా క్యాప్చర్‌ చేస్తుంది.
కొత్త నిఘంటువులు
తాజాగా ఏడు ద్విభాషా నిఘంటవులు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో బంగ్లా-ఇంగ్లిష్‌, కన్నడ-ఇంగ్లిష్‌, మలయాళం-ఇంగ్లిష్‌ నిఘంటువులూ ఉండటం విశేషం. ఐఓఎస్‌ 16, మ్యాక్‌ఓఎస్‌ వెంచురా ఈ నిఘంటువులకు కొత్త భాష్యాన్నీ చెప్పాయి. ఇవి ఆయా భాషల పదాలకు ఇంగ్లిష్‌లోనే కాదు.. ఇంగ్లిష్‌ పదాలకు ఆయా భాషల్లోనూ అర్థాలు తెలుసుకోవటానికి వీలు కల్పిస్తున్నాయి. అంటే బంగ్లా పదానికి ఇంగ్లిష్‌లో అర్థం తెలుసుకోవటంతో పాటు ఇంగ్లిష్‌ పదానికి బంగ్లాలోనూ అర్థాన్ని చూసుకోవచ్చు.
షేర్డ్‌ ట్యాబ్స్‌
స్నేహితులతో కలవటానికి సఫారీలో షేర్డ్‌ ట్యాబ్‌ గ్రూపులను సృష్టించు కోవచ్చు. షికారు కోసం ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఐడియాలను పంచుకోవటానికి పింటెరెస్ట్‌ పిన్‌బోర్డుల మాదిరిగా దీన్ని వాడుకోవచ్చు. కింద కుడివైపు మూలన కనిపించే ట్యాబ్‌ బటన్‌ మీద నొక్కితే మెనూ ఓపెన్‌ అవుతుంది. ఇందులో ప్రస్తుత ప్రాంతం లేదా ట్యాబ్‌ గ్రూపును తేలికగా వెంటనే జోడించుకోవచ్చు.
స్పాట్‌లైట్‌
ఫైళ్లను వెతకటానికి తోడ్పడే స్పాట్‌లైట్‌ను ఇకపై నేరుగా హోంస్క్రీన్‌ నుంచే వాడుకోవచ్చు. మెసేజెస్‌, నోట్స్‌, ఫైల్స్‌ వంటి యాప్‌ల నుంచి మరిన్ని ఇమేజ్‌ రిజల్ట్స్‌, సజెషన్స్‌ కనిపిస్తాయి. వేర్వేరు స్క్రీన్ల మధ్య మారుతున్నప్పుడు స్పాట్‌లైట్‌ తెర మీద డాట్స్‌ వెనకాలకు వెళ్లిపోతుంది. ‘సెర్చ్‌’ బాక్స్‌ మాత్రమే కనిపిస్తుంది.

ఎలా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి?
ఐఫోన్‌ 8, ఆ తర్వాతి మోడళ్లను ఐఓఎస్‌ 16 సపోర్టు చేస్తుంది. ఫోన్‌లో సఫారీ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి beta.apple.com అని టైప్‌ చేయాలి. ఒకవేళ సభ్యత్వం లేకపోతే సైన్‌ అప్‌ చేసుకోవాలి. సభ్యులైతే నేరుగా సైన్‌ ఇన్‌ కావాలి. అందులోని వివరాలను చదివి, ఐఓఎస్‌ పరికరాన్ని ఎన్‌రోల్‌ను ఎంచుకోవాలి. రిస్కుల గురించి వివరించిన అంశాలను చదివి, తెలుసుకోవాలి. ఇది పబ్లిక్‌ బీటా వర్షన్‌ కాబట్టి పరికరం బ్యాకప్‌ను నిర్ణయించుకోవటం మంచిది. ఇన్‌స్టాల్‌ ప్రొఫైల్‌ కింద కనిపించే డౌన్‌లోడ్‌ ప్రొఫైల్‌ను ఎంచుకోవాలి. అన్నింటికీ అనుమతులు ఇవ్వాలి. సెటింగ్స్‌లోకి వెళ్తే ప్రొఫైల్‌ డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ ఉంటుంది. దీన్ని ఎంచుకొని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అనుమతులన్నింటికీ అంగీకరించాలి.  

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts