5జీ ఫోన్‌ కొంటున్నారా?

ఎట్టకేలకు మనదేశంలో 5జీ సేవలు ఆరంభమయ్యాయి. టెలికం సంస్థలు సేవలు ఆరంభించటం, కొత్త ప్లాన్లను ప్రకటించటమే తరువాయి. అయితే ప్లాన్ల కన్నా ముందు మనదగ్గర 5జీని సపోర్టు చేసే స్మార్ట్‌ఫోన్‌ ఉండొద్దూ? ఇప్పటికే చాలా ఫోన్‌ తయారీ సంస్థలు 5జీ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చాయనుకోండి.

Published : 05 Oct 2022 00:56 IST

ఎట్టకేలకు మనదేశంలో 5జీ సేవలు ఆరంభమయ్యాయి. టెలికం సంస్థలు సేవలు ఆరంభించటం, కొత్త ప్లాన్లను ప్రకటించటమే తరువాయి. అయితే ప్లాన్ల కన్నా ముందు మనదగ్గర 5జీని సపోర్టు చేసే స్మార్ట్‌ఫోన్‌ ఉండొద్దూ? ఇప్పటికే చాలా ఫోన్‌ తయారీ సంస్థలు 5జీ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చాయనుకోండి. మరి వీటిని ఎంచుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

5జీ చిప్‌సెట్‌
అన్నింటికన్నా ముందు చూడాల్సింది 5జీ నెట్‌వర్క్‌ను సపోర్టు చేసే చిప్‌సెట్‌. ఫోన్‌తో బిల్టిన్‌గా వచ్చే ఇది 5జీ రిసెప్షన్‌ను గుర్తిస్తుంది. మంచి విషయం ఏంటంటే- ప్రస్తుతం కొత్త చిప్‌సెట్లన్నీ 5జీ ఎనేబుల్‌గానే వస్తుండటం. క్వాల్‌కామ్‌-ఆధారిత స్నాప్‌డ్రాగన్‌ 695, అంతకన్నా ఎక్కువ.. స్నాప్‌డ్రాగన్‌ 765, అంతకన్నా ఎక్కువ.. స్నాప్‌డ్రాగన్‌ 865, అంతకన్నా ఎక్కువ చిప్‌లు డిఫాల్ట్‌గానే 5జీని సపోర్టు చేస్తున్నాయి. మీడియాటెక్‌ డైమెన్సిటీ సిరీస్‌కు చెందిన డైమెన్సిటీ 700, 8100, 9000 ఫోన్లన్నీ 5జీ ఎనేబుల్డ్‌గానే వస్తున్నాయి.

ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌
చాలా ఫోన్లు 5జీని సపోర్టు చేస్తుండొచ్చు. కానీ స్టాండలోన్‌ నెట్‌వర్క్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను పూర్తిస్థాయిలో ఎనేబుల్‌ చేసి ఉండకపోవచ్చు. అందువల్ల నిరాటంకంగా 5జీని స్వీకరించటానికి వీలుగా కంపెనీలు మున్ముందు అప్‌డేట్లను అందుబాటులోకి తేవటం తప్పనిసరి. కాబట్టి ఎప్పటికప్పుడు అప్‌డేట్లను విడుదల చేసే కంపెనీల ఫోన్లను ఎంచుకోవటం మంచిది. 5జీ సపోర్టును పూర్తి స్థాయిలో ఎనేబుల్‌ చేసుకోవటానికి ఈ అప్‌డేట్లు ఉపకరిస్తాయి. 5జీ నెట్‌వర్క్‌ను స్వీకరించటంలో ఏవైనా బగ్స్‌ అడ్డుతగులుతుంటే సరిచేస్తాయి.

5జీ బ్యాండ్స్‌
5జీ నెట్‌వర్క్‌ను ఫోన్‌ సపోర్టు చేస్తుందా? లేదా? అనేదాన్ని చిప్‌సెట్‌ నిర్ణయిస్తే.. అధునాతన కనెక్షన్‌ ఎంతవరకు నమ్మదగినదని నిర్ణయించేది 5జీ బ్యాండ్‌. అందువల్ల ఫోన్‌ కొనే ముందు అది 5జీ బ్యాండ్‌ను సపోర్టు చేస్తుందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. పరికరాన్ని తయారుచేసే కంపెనీ వెబ్‌సైట్‌ పేజీలో స్పెసిఫికేషన్స్‌ విభాగం కింద బ్యాండ్స్‌ వివరాలు కనిపిస్తాయి. వీటిని తనిఖీ చేసుకోవాలి. 8 నుంచి 12 మధ్యలోని 5జీ బ్యాండ్స్‌ గల ఫోన్లను ఎంచుకోవటం మంచిది. ఇవి పలు వైవిధ్యమైన పనులు సాఫీగా, వేగంగా సాగటానికి సహకరిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని