మౌజ్‌ కట్స్‌

కంప్యూటర్‌ను ఎంతకాలం నుంచి ఉపయోగిస్తున్నప్పటికీ కొత్త షార్ట్‌కట్‌ గురించి తెలిస్తే బోలెడు సంతోషమేస్తుంది. మౌజ్‌ షార్ట్‌కట్స్‌ అలాంటివే. 80ల వరకూ మౌజ్‌ను పెద్దగా వాడేవారు కాదు.

Updated : 14 Jun 2023 04:09 IST

కంప్యూటర్‌ను ఎంతకాలం నుంచి ఉపయోగిస్తున్నప్పటికీ కొత్త షార్ట్‌కట్‌ గురించి తెలిస్తే బోలెడు సంతోషమేస్తుంది. మౌజ్‌ షార్ట్‌కట్స్‌ అలాంటివే. 80ల వరకూ మౌజ్‌ను పెద్దగా వాడేవారు కాదు. ఇప్పుడు మౌజ్‌ లేని డెస్క్‌టాప్‌ను ఊహించటమే కష్టం. కీబోర్డు మాదిరిగానే దీని వాడకంలోనూ కొన్ని షార్ట్‌కట్స్‌ ఉన్నాయి. ఇవి వర్డ్‌ ప్రాసెసర్లు, ఈమెయిల్‌, సోషల్‌ మీడియా.. ఇలా అన్నిచోట్లా పనికొస్తాయి. అలాంటి కొన్ని మౌజ్‌ చిట్కాలు తెలుసుకుందాం.

పెద్దగా, చిన్నగా

కోబోర్డులో కంట్రోల్‌ మీటను పట్టుకొని మౌజ్‌ చక్రాన్ని పైకి తిప్పితే అక్షరాలు పెద్దగా అవుతాయి. కిందికి తిప్పితే చిన్నగా అవుతాయి. గూగుల్‌ మ్యాప్స్‌ వంటి కొన్ని అప్లికేషన్లలోనూ ఈ చిట్కా పనిచేస్తుంది. దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదే కాదు.. డెస్క్‌టాప్‌ మీద ఫైళ్లు, ఫోల్డర్ల గుర్తుల సైజునూ దీంతో మార్చుకోవచ్చు. తెర మీద చాలా ఎక్కువ ఫైళ్లు ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.

వర్డ్‌, పేరా సెలెక్షన్‌కు

డబుల్‌ క్లిక్‌తో ఫైళ్లు ఓపెన్‌ అవుతాయన్నది తెలిసిందే. మరి దీన్ని టెక్స్ట్‌ను హైలైట్‌ చేయటానికీ ఉపయోగించుకోవచ్చని తెలుసా? వెబ్‌పేజీలో గానీ డాక్యుమెంటులో గానీ టెక్స్ట్‌ మీద మౌజ్‌తో డబుల్‌ క్లిక్‌ చేస్తే పదం హైలైట్‌ అవుతుంది. అదే వరుసగా మూడు సార్లు క్లిక్‌ చేస్తే పేరా మొత్తం సెలెక్ట్‌ అవుతుంది.

టెక్స్ట్‌ వరుస సెలెక్షన్‌

ఎక్సెల్‌లో టెక్స్ట్‌ కాలమ్‌ను హైలైట్‌ చేయటం తేలికే. మరి ఇది వర్డ్‌ డాక్యుమెంట్‌లోనూ సాధ్యమేనంటే నమ్ముతారా? ముందుగా టెక్స్ట్‌ మీద కర్సర్‌ పెట్టి ఆల్ట్‌ మీట, కుడి క్లిక్‌ను ఒకేసారి నొక్కిపట్టి, డ్రాగ్‌ చేయాలి. ఆల్ట్‌, కుడి క్లిక్‌ రెండింటినీ ఒకేసారి వదిలేస్తే డ్రాగ్‌ చేసిన భాగమంతా హైలైట్‌ అవుతుంది. తర్వాత అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.

కాపీ, మూవ్‌

మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ డాక్యుమెంటులో టెక్స్ట్‌ను సెలెక్ట్‌ చేసి.. కంట్రోల్‌, కుడి క్లిక్‌తో నొక్కి పట్టి వేరేచోటుకు డ్రాగ్‌ చేసి వదిలేస్తే అది అక్కడ కాపీ అవుతుంది.

వినూత్నంగా స్క్రోల్‌

మౌజ్‌ చక్రంతో పేజీలను తేలికగా స్క్రోల్‌ చేయొచ్చనేది అనుభవమే. కానీ ఎక్కువ పేజీలు, స్క్రీన్లు ఉంటే తేలికగా స్క్రోల్‌ చేయటానికి ఒక మార్గముంది. మౌజ్‌ చక్రాన్ని తిప్పటం కన్నా దాన్ని కాసేపు అలాగే అదిమి పడితే తెర మీద మధ్యలో ఒక చుక్క.. రెండు బాణం గుర్తులున్న వృత్తం దర్శనమిస్తుంది. దాన్ని పైకీ, కిందికీ జరిపి పేజీలను చూడొచ్చు. వద్దనుకున్నప్పుడు చక్రాన్ని తిరిగి అదిమి పడితే చాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు