రోబో అన్వేషి!

డిమెన్షియా గలవారు తరచూ మరచిపోతుంటారు. మందులు, కళ్లద్దాలు, ఫోన్‌ వంటివి ఎక్కడ పెట్టారో వెంటనే గుర్తు తెచ్చుకోలేరు. ఇలాంటివారి కోసం యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్‌లూ ఇంజినీర్లు వినూత్న మార్గాన్ని కనుగొన్నారు.

Published : 21 Jun 2023 00:03 IST

డిమెన్షియా గలవారు తరచూ మరచిపోతుంటారు. మందులు, కళ్లద్దాలు, ఫోన్‌ వంటివి ఎక్కడ పెట్టారో వెంటనే గుర్తు తెచ్చుకోలేరు. ఇలాంటివారి కోసం యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్‌లూ ఇంజినీర్లు వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. ఆయా వస్తువులను వెతికిపెట్టేలా రోబోలను తీర్చిదిద్దారు. కృత్రిమ మేధ సాయంతో కృత్రిమ జ్ఞాపకశక్తిని సృష్టించటంలో విజయం సాధించారు. పరిశోధకులు ముందుగా ఫెచ్‌ మొబైల్‌ మానిప్యులేటర్‌ రోబోతో పని మొదలెట్టారు. దీనికి ఒక కెమెరా ఉంటుంది. ఇది పరిసరాలను ‘చూడటానికి’ ఉపయోగపడుతుంది. అనంతరం వస్తువును గుర్తించే అల్గోరిథమ్‌తో రోబోకు శిక్షణ ఇచ్చారు. వస్తువును గుర్తించటం, దాన్ని పసిగట్టటంతో పాటు ఎక్కువ కాలం గుర్తుంచుకునేలా తీర్చిదిద్దారు. వేర్వేరు వస్తువుల మధ్య తేడాను గుర్తించగల ఇది తన కెమెరా పరిధిలోకి వచ్చే, పోయే వస్తువుల తేదీని, సమయాన్ని నమోదు చేసుకుంటుంది. వీటిని రోబోకు గల గ్రాఫికల్‌ ఇంటర్ఫేస్‌ ద్వారా వెతకొచ్చు. వస్తువుల పేర్లను మొబైల్‌ ఫోన్‌ యాప్‌ లేదా కంప్యూటర్‌లో సెర్చ్‌ చేస్తే అవెక్కడున్నాయో చెప్పేస్తుంది. ప్రస్తుతానికి మతిమరుపుతో బాధపడేవారి కోసమే ఈ పరిజ్ఞానాన్ని రూపొందించినప్పటికీ మున్ముందు అందరికీ అందుబాటులోకి రాగలదని భావిస్తున్నారు. తరచూ వస్తువులు పెట్టిన చోటును మరచిపోయేవారికి బాగా ఉపయోగపడగలదని అనుకుంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు