స్నాప్‌డ్రాగన్‌ కొత్త మొబైల్‌ వేదిక

స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు శుభవార్త. మరింత నాణ్యమైన ఆడియో, వీడియో కాల్స్‌.. ఫొటోలకు వీలు కల్పించటానికి క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌ సంస్థ సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది

Published : 05 Jul 2023 00:36 IST

స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు శుభవార్త. మరింత నాణ్యమైన ఆడియో, వీడియో కాల్స్‌.. ఫొటోలకు వీలు కల్పించటానికి క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌ సంస్థ సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది. పేరు స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌. రోజంతా అత్యధిక వేగంతో సీపీయూను పని చేయించటం, మరింత నాణ్యమైన ఫొటోలు గ్రహించటం వంటి పనులకిది వీలు కల్పించనుంది. 5జీ వేగాన్నీ పెంచుతుంది. 4 సిరీస్‌లో తొలి 4ఎన్‌ఎం ప్లాట్‌ఫామ్‌ ఇదే. బ్యాటరీ మన్నికను పెంచేలా, మొత్తంగా ఫోన్ల సామర్థ్యాన్ని పెంచేలా దీన్ని డిజైన్‌ చేశారు. క్వాల్‌కామ్‌ క్రయో సీపీయూ 2.2 జీహెచ్‌జెడ్‌ గరిష్ఠ వేగంతో పనిచేస్తుంది. దాదాపు 10% వరకు సీపీయూ సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. క్వాల్‌కామ్‌ క్విక్‌ ఛార్జ్‌ ఇ ప్లస్‌ టెక్నాలజీ బ్యాటరీని 15 నిమిషాల్లోనే 50% ఛార్జ్‌ చేయగలదు. మరింత స్పష్టత, తేలికగా స్క్రోల్‌ కావటానికి 120ఎఫ్‌పీఎస్‌ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేలనూ ఇది సపోర్టు చేస్తుంది. ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే- ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌, వేగంగా ఆటోఫోకస్‌ చేసే ఫీచర్లు ఉండటం వల్ల మసక దృశ్యాలకు కాలం చెల్లుతుందని చెప్పుకోవచ్చు. కదిలే వస్తువుల ఫొటోలూ స్పష్టంగా కనిపిస్తాయి. 4 సిరీస్‌లో తొలిసారిగా హార్డ్‌వేర్‌కు మల్టీ కెమెరా టెంపోరల్‌ ఫిల్టరింగ్‌ సదుపాయాన్ని జోడించారు. ఇది అత్యధిక నాణ్యమైన వీడియోల్లో రణగొణ ధ్వనులను తగ్గిస్తుంది. ఎక్కువమంది గుమిగూడి ఉన్న చోట్ల ఆడియో, వీడియో కాల్స్‌ చేసినప్పుడు చుట్టుపక్కల శబ్దాలను తొలగించటానికి ఏఐ ఆధారిత పరిజ్ఞానాన్నీ జత చేశారు. రెడ్‌మీ, వివో వంటి ఫోన్లను స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌ సపోర్టు చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని