యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ వచ్చేంతవరకూ ఆగాలా?

ఇంటెలిజెన్స్‌ అనే సొంత ఏఐ పరిజ్ఞానాన్ని తీసుకొస్తున్నట్టు యాపిల్‌ సంస్థ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది అందుబాటులోకి రావటానికి ఇంకా చాలా నెలలు వేచి చూడాల్సిందే.

Published : 03 Jul 2024 00:46 IST

ఇంటెలిజెన్స్‌ అనే సొంత ఏఐ పరిజ్ఞానాన్ని తీసుకొస్తున్నట్టు యాపిల్‌ సంస్థ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది అందుబాటులోకి రావటానికి ఇంకా చాలా నెలలు వేచి చూడాల్సిందే. అంతవరకూ ఎవరు ఆగుతారని అనుకుంటున్నారా? అయితే కొన్ని ట్రిక్కులతో ఇప్పుడే ఐఫోన్లలో ఏఐ ఫీచర్లను వాడుకోండి. అలాంటి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.


నప్పే దుస్తులు, నచ్చిన వంటలు

ఇటీవల జీపీటీ 4-ఓ అప్‌డేట్‌తో ఉచితంగా ఇమేజ్‌లను విశ్లేషించుకునే వెసులుబాటు కలిగింది. కాబట్టి ఐఫోన్‌లో ఛాట్‌జీపీటీ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు. దీనికి మీ ఫొటోను అప్‌లోడ్‌ చేసి ఎలాంటి దుస్తులు నప్పుతాయో అడగొచ్చు. వెంటనే నప్పే రంగుల దుస్తులతో మీ ఫొటో ప్రత్యక్షమవుతుంది. ఫ్రిజ్‌లో రకరకాల కూరగాయలున్నాయా? వాటితో ఏం వండాలో తెలియటం లేదా? అయితే వాటి ఫొటో తీసి ఏయే వంటకాలు చేసుకోవచ్చో తెలుసుకుంటే సరి. బుర్రకు పదును పెడితే ఇలాంటి పనులు ఎన్నయినా చేసుకోవచ్చు. అయితే జీపీటీ-4ఓ వాడకం పరిమితమేనన్న సంగతి మరవొద్దు. తాత్కాలిక పరిమితిని దాటితే కొద్ది గంటల వరకూ వేచి చూడాల్సిందే. అంతవరకూ ఆగలేం, వెంటనే వాడుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఛాట్‌జీపీటీ ప్లస్‌ ప్లాన్‌ కొనుక్కోవాలి.


ఇమేజ్‌ల నుంచి టెక్స్ట్‌ 

ఇమేజ్‌లలో కనిపించే టెక్స్ట్‌ను కాపీ చేసుకోవాలని అనుకుంటు న్నారా? ఐఓఎస్, ఐప్యాడ్‌ఓఎస్, మ్యాక్‌ఓఎస్‌లో ఈ సదుపాయం కొంతకాలంగా ఉన్నదే. టెక్స్ట్‌తో కూడిన ఇమేజ్‌ను క్లిక్‌ చేసి ఉన్నట్టయితే దీన్ని వాడు కోవటమూ తేలికే. ఇమేజ్‌ మీద కనిపించే టెక్స్ట్‌ మీద కాసేపు అదిమిపట్టి ఉంచితే ఒక బాక్స్‌ పాపప్‌ అవుతుంది. అందులో టెక్స్ట్‌ కనిపిస్తుంది. దాన్ని కాపీ చేసుకుంటే సరి. చేత్తో టైప్‌ చేయాల్సిన అవసరం తప్పుతుంది.


ఫొటో, వీడియోల్లో దృశ్యాల సంగ్రహణ

ఫొటోలు, వీడియోల్లో వెనకాల దృశ్యాలు బాగా ఆకర్షిస్తున్నాయా? వాటిని అక్కడి నుంచి సంగ్రహించి, ఇష్టమైన విధంగా వాడుకోవాలని అనుకుంటున్నారా? దీనికీ మంచి చిట్కా ఉంది. గ్రాఫిక్‌ డిజైనర్లయినా, మామూలు వాళ్లయినా వాడుకునే ఫీచర్‌ ఐఫోన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే ఐఓఎస్‌ 16, ఆ తర్వాతి వర్షన్‌తో పనిచేసేది అయ్యిండాలి. ముందు ఫొటోను ఓపెన్‌ చేయాలి. లేదా వీడియోను పాజ్‌ చేయాలి. వాటిల్లో దేని మీదయినా తాకి, కాసేపు అదిమి పట్టాలి. అప్పుడు వాటి అంచుల చివరలు వెలుగుతాయి. అప్పుడు వేలిని పైకి లేపి ఆ వస్తువునో, జంతువునో, మనిషినో కాపీ చేసుకోవచ్చు. స్టిక్కర్‌గా జత చేసుకోవచ్చు. ఇతర యాప్‌లకు షేర్‌ చేసుకోవచ్చు.


పెంపుడు జంతువుల గుర్తింపు

ఫొటోల్లోని జంతువులనూ ఐఓఎస్‌ 17 గుర్తించగలదు. ఫొటోస్‌ యాప్‌లో వ్యక్తులను ఫేవరెట్‌గా లేదా మార్క్‌గా ఎంచుకున్నట్టుగానే జంతువులనూ మార్క్‌ చేసుకోవచ్చు. పెంపుడు జంతువులు గలవారికిది బాగా ఉపయోగ పడుతుంది. ఫోన్‌లో ఉన్న బోలెడన్ని ఫొటోల్లో ఒక్కొక్కటీ చూస్తూ జంతువులను గుర్తించటానికి బదులు దీన్ని వాడుకుంటే చిటికెలో పని పూర్తవుతుంది.


 పొర్ట్రెయిట్, సినిమాటిక్‌ మోడ్స్‌

కెమెరాలో సినిమాటిక్‌ మోడ్‌ను వాడుతున్నప్పుడు ఫ్రేమ్‌లో బోలెడన్ని అంశాలున్నా ఐఫోన్‌ ఫోకస్‌ను సర్దుకోవటం గమనించే ఉంటారు. ఇది అద్భుతమనీ అనిపిస్తుంటుంది. అంతా యాపిల్‌ సంస్థకు చెందిన మెషిన్‌ లెర్నింగ్‌ ఆల్గారిథమ్‌ల మాయ. చిప్‌సెట్స్‌తో కలిసి ఈ పని చేసి పెడుతుంది. తొలిసారి 2021లో సినిమాటిక్‌ మోడ్‌ను ఐఫోన్‌ 13 సిరీస్‌తో పాటు పరిచయం చేశారు. అప్పటి నుంచీ ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తోంది. అలాగే పొర్ట్రెయిట్‌ మోడ్‌ కూడా ఈ ఆల్గారిథమ్‌ల మీదే పనిచేస్తుంది. ఫొటోలను కెమెరా మాదిరిగా బ్లర్‌గా చేయటం వంటి పనులు చేసి పెడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని