Updated : 01 Sep 2021 05:16 IST

డార్క్‌ ఫ్యాక్టరీ

కొవిడ్‌-19 ప్రపంచ గమనాన్నే మార్చేసింది. 2020 ఏడాదిలో మనుషుల మధ్య దూరం మంత్రమైపోయింది. ఎన్నో కంపెనీలు ఇంటినుంచే పని విధానాన్ని అవలంభించాయి. కార్మికులు, ఉద్యోగుల మీదే పూర్తిగా ఆధారపడిన తయారీ సంస్థలు మాత్రం చాలావరకు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదురుకుంటున్నప్పటికీ మున్ముందు ఇలాంటి సంక్షోభాలు ఎదురైతే? ఈ ప్రశ్నే డార్క్‌ ఫ్యాక్టరీల ఆవశ్యకతను ముందుకు తెస్తోంది. పేరుకు తగ్గట్టుగానే ఇవి చీకట్లోనూ నడుస్తాయి. మనుషుల ప్రమేయమూ ఉండదు.

‘భవిష్యత్‌ ఫ్యాక్టరీల్లో ఇద్దరే ఉద్యోగులుంటారు. ఒకరు కాపలా కుక్క. మరొకరు కుక్కకు ఆహారం వేసే వ్యక్తి’. ఇది నవ్వుకోవటానికి వేసుకునే జోకే కావొచ్చు. కానీ అలాంటి పరిస్థితులు ఇంకెంతో దూరంలో లేవన్నా అతిశయోక్తి కాదు. ఆటోమేషన్‌, డిజిటేషన్‌ ప్రాధాన్యాలుగా మారిన నేటి యుగంలో ఫ్యాక్టరీల్లో మనిషి అవసరం రోజురోజుకీ తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే మనం మనుషులతో పనిలేకుండా రోబోలు, తెలివైన యంత్రాలతో వస్తువులను ఉత్పత్తి చేసే స్థితికి చేరుకున్నాయి. ఇదిప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయం కాకపోవచ్చు. కానీ ఒకప్పుడు నమ్మలేని నిజమే. రోబోల వంటివి మనుషులే కాదు, వెలుతురు లేకపోయినా చీకట్లోనూ పనిచేయగలవు. మనమంటే కళ్లతో చూసి పనులు చేస్తాం. ఇందుకు వెలుగు కావాలి. మరి కళ్లు లేని యంత్రాలకు, రోబోలకు వెలుతురుతో పనేముంది? ఏ వస్తువు ఎక్కడుందో, ఎంత దూరంలో ఉందో, వాటినెలా చేరుకోవచ్చో, ఎలా పట్టుకోవచ్చో, ఎలా లేపొచ్చో, ఎలా తిప్పచ్చో.. అనేవి తెలిస్తే చాలు కదా. ముందుగానే నిర్ణయించిన ప్రొగ్రామ్‌తో అనుసంధానిస్తే అప్పగించిన పనిని చేసుకుంటూ వెళ్తాయి. చిమ్మ చీకట్లోనే కాదు.. అత్యధిక వేడి, అతి శీతల ప్రదేశాల్లోనూ, గాలి ఉన్నా లేకపోయినా పని చేస్తాయి. అదీ నిర్విరామంగా 24 గంటలూ సేవలు చేసి పెడతాయి. డార్క్‌ ఫ్యాక్టరీల ప్రత్యేకత ఇదే. ఒకప్పుడు రోబోలను ప్రమాదకరమైన, అపరిశుభ్రమైన వాతావరణంలో చేసే పనులకే వాడుకునేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. స్వతంత్రంగా, పూర్తిగా తమకు తామే పని చేసే రోబోలు, యంత్రాల సృష్టితో వస్తువుల తయారీ నుంచి వంటల వరకూ అన్ని పనులూ చేయిస్తున్నాం. కృత్రిమ మేధ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఆగ్మెంటెడ్‌ రియాల్టీ, ఇంటర్నెట్‌ థింగ్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ వంటి నూతన పరిజ్ఞానాలు ఇందుకు మార్గం సుగమం చేస్తున్నాయి. సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, ఆలోచించి నిర్ణయాలు తీసుకునే పనుల్లో మనుషుల అవసరం తప్పనిసరి. కాదనలేం. కానీ ఒకే తరహా పనులను పదే పదే చేయటానికి స్వయంచాలిత రోబోలు, యంత్రాలు చాలు. డార్క్‌ ఫ్యాక్టరీలకు ఇదే ప్రాతిపదికగా నిలుస్తోంది.

ఎలా సాధ్యం?
అసలు మనుషులన్నదే లేకుండా.. అదీ చీకట్లో కర్మాగారాలు పనిచేయటం సాధ్యమేనా? ఇది కలా? నిజమా? ఇలాంటి సందేహాలు తలెత్తటంలో ఆశ్చర్యం లేదు. ఇది ఆచరణీయమేనని ఇప్పటికే కొన్ని ఫ్యాక్టరీలు నిరూపిస్తున్నాయి. ఈ విషయంలో చైనా అన్నింటికన్నా ముందు నిలుస్తోంది. ఇతర దేశాలు కూడా దీనికి తీసిపోవటం లేదు. ఉదాహరణకు- జపాన్‌కు చెందిన రోబో కంపెనీ ఫనుక్‌నే తీసుకోండి. ఇది 2001 నుంచీ రోబోల సాయంతోనే రోబోలను తయారుచేస్తోంది. అక్కడ రోజుకు సుమారు 50 రోబోలు తయారవుతుంటాయి. నెదర్లాండ్స్‌లోని ఫిలిప్స్‌ కంపెనీ మరో ఉదాహరణ. ఇందులో ఏటా 1.5 కోట్ల ఎలక్ట్రిక్‌ రేజర్లు ఉత్పత్తి అవుతాయి. ఈ పనంతా చేసేది రోబోలే. ఇందులో 128 రోబోలు పనిచేస్తుంటాయి. ఒక్క మన్నికను తనిఖీ చేసే విషయంలో తప్ప మనుషుల ప్రమేయం ఎక్కడా ఉండదు. కార్ల తలుపుల వంటివి తయారుచేసే అమెరికాలోని హిరోటెక్‌ సంస్థ కూడా ఓటో అనే రోబో వ్యవస్థతో మనుషుల అవసరం లేకుండా 24 గంటలూ పనులు సాగేలా ఏర్పాట్లు చేసుకుంది. గోదాములను నిర్వహించే, వస్తువులను సరఫరా చేసే కంపెనీలు సైతం వీటి దిశగా నిశితంగా దృష్టి సారిస్తున్నాయి.

ఉద్దేశాలేంటి?
విద్యుత్తు అందుబాటులో ఉండగా చీకటి ఫ్యాక్టరీల అవసరమేంటనే సందేహం రావొచ్చు. పరికరాల ఏర్పాటు వంటి వాటికి మొదట్లో ఖర్చు అయినా వీటితో నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. తక్కువ చోటులోనే ఎక్కువ పనులు చేసుకోవచ్చు. కచ్చితత్వం, సామర్థ్యం మెరుగవుతాయి. రసాయనాలు, పొగలు, చమురు, జారుడు పదార్థాల వంటి వాటికి నెలవైన ప్రమాదకర వాతావరణంలోనూ తేలికగా పనిచేయటానికి వీలవుతుంది. దీంతో ప్రమాదాలు తగ్గుతాయి. కచ్చితమైన కొలతలతో పనులు జరగటం వల్ల తుక్కు వంటి వ్యర్థాలు తగ్గుముఖం పడతాయి. చేసిన పనినే మళ్లీ చేయటం తప్పుతుంది. ఇవన్నీ ఉత్పాదతకత పెరగటానికి దోహదం చేసేవే.

నాలుగో పారిశ్రామిక విప్లవం కానుక
పారిశ్రామక రంగంలో ప్రతి దశలోనూ భారీ మార్పులు, ఆవిష్కరణలు చూస్తూనే వస్తున్నాం. ఆవిరి శక్తి వినియోగంతో తొలి పారిశ్రామిక విప్లవం ఆరంభమవటం తెలిసిందే. యంత్రాల ఆవిర్భావంతో రెండో పారిశ్రామిక విప్లవం కొత్త పుంతలు తొక్కింది. విద్యుత్తు, చమురు వాడకంతో వస్తూత్పత్తి గణనీయంగా పెరిగింది. నిజానికి స్వయంచాలిత (ఆటోమేషన్‌) యంత్రాల ఆలోచనా అప్పుడే పురుడుపోసుకుంది. ప్రపంచ యుద్ధాల అనంతరం పుట్టుకొచ్చిన మూడో పారిశ్రామిక విప్లవం కొత్త యాంత్రిక యుగానికి నాంది పలికింది. కంప్యూటర్ల వంటి ప్రొగ్రామేబుల్‌ లాజిక్‌ కంట్రోలర్లతో (పీఎల్‌సీ) యంత్రాల నిర్వహణ, ఉత్పత్తి సులువైంది. వినూత్న కమ్యూనికేషన్‌ పరిజ్ఞానాల రూపకల్పన నవ శకానికి, నాలుగో పారిశ్రామిక విప్లవానికి బాటలు పరిచింది. అన్నింటికన్నా ముఖ్యమైన ఆవిష్కరణ ఇంటర్నెట్‌. ఇది అన్ని వ్యవస్థలనూ సమూలంగా మార్చేసింది. పీఎల్‌సీలు, కంప్యూటర్లు, సెన్సర్లు, రోబోలు అన్నింటినీ ఏకం చేసింది. ప్రస్తుతం స్మార్ట్‌ టెక్నాలజీ సాయంతో కొనసాగుతున్న ఆటోమేషన్‌ వంటి పారిశ్రామిక విధానాలన్నీ ఇందులో భాగమే. యంత్రానికీ యంత్రానికీ మధ్య కమ్యూనికేషన్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కలయిక ఆటోమేషన్‌ పురోగతికి వీలు కల్పించింది. డార్క్‌ ఫ్యాక్టరీ ఆలోచన కూడా దీని కానుకే.


సాంకేతిక పరిజ్ఞానాల తోడు

డార్క్‌ ఫ్యాక్టరీల స్థాపనకు వ్యూహాత్మక ప్రణాళిక కీలకం. పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాలను సమర్థంగా వాడుకోవటానికిది ఎంతైనా అవసరం. లేకపోతే భద్రత, నెట్‌వర్క్‌ సామర్థ్యం దెబ్బతింటాయి. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవటంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు సాయం చేస్తున్నాయి.

లైఫై: అధునాతన లో ఫిడెలిటీ (లైఫై) పరిజ్ఞానం అందుబాటులోకి రావటం సమాచారం సమర్థంగా, వేగంగా మార్పిడి చేసుకోవటానికి వీలు కల్పించింది. లైఫై పరిజ్ఞానం రేడియో తరంగధైర్ఘ్యాలకు బదులు కంటికి కనిపించే, అతి నీలలోహిత లేదా పరారుణ కాంతులతో మరింత ఎక్కువ వేగంగా సమాచారాన్ని బట్వాడా చేస్తుంది. ఇది యంత్రాలు, పరికరాలు, రోబోలు మంచి సమన్వయంతో, సమర్థంగా పనిచేయటానికి బీజం వేస్తోంది.

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ): ఇదిప్పటికే దూరం నుంచే పరికరాల పర్యవేక్షణ, చిప్‌ నిర్వహణ, భద్రత, వస్తువుల రవాణా వంటి వాటికి ఉపయోగపడుతోంది. సెన్సర్లు, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌తో కూడిన స్మార్ట్‌ పరికరాలతో రోజువారీ జీవనాన్ని ఎంతో సులభం చేస్తోంది. అందుకే దీన్ని డార్క్‌ ఫ్యాక్టరీలకు అనుగుణమైన వేదికగానూ మలచుకుంటున్నారు. దీంతో సమాచార విభజన, విశ్లేషణ, ఉత్పాదకత మెరుగవుతుంది.

క్లౌడ్‌, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌ సమన్వయం: ఇది కేంద్రీకృత వ్యవస్థ రూపకల్పనకు తోడ్పడుతోంది. వేగం, నెట్‌ సామర్థ్యం, సేవలు మెరుగుపడటానికి ఎడ్జ్‌ కంప్యూటింగ్‌.. ఎక్కువ సమాచారాన్ని విడమర్చుకోవటానికి క్లౌడ్‌ కంప్యూటింగ్‌ దోహదం చేస్తాయి. అందువల్ల వికేంద్రీకృత ఎడ్జ్‌ కంప్యూటింగ్‌, కేంద్రీకృత క్లౌడ్‌ కంప్యూటింగ్‌లను మేళవించటం సమర్థమైన ఆటోమేషన్‌ వేదికగా ఉపయోగపడుతోంది.

ఆగ్మెంటెడ్‌ రియాలిటీ: డార్క్‌ ఫ్యాక్టరీల నిర్వహణలో సప్లై చైన్‌ చాలా కీలకం. ఇక్కడే ఆగ్మెంటెడ్‌ రియాలిటీ కొత్త ఆశలు రేపుతోంది. కాల్పనిక వాతావరణంలో వాస్తవ అనుభూతిని కలిగించే ఇది వస్తువుల కదలికల సమయాన్ని కచ్చితంగా గుర్తించటానికి, నిర్వహించటానికి తోడ్పడుతుంది. వ్యాపారావసరాలను బట్టి డేటాను విడమర్చటానికీ వీలు కల్పిస్తుంది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts