జూమ్‌ ధాం..

ప్రపంచమంతా ఇప్పుడు జూమ్‌ ధాంగానే విహరిస్తోంది. ఆఫీసు సమావేశాలైనా, ఆన్‌లైన్‌ తరగతులైనా అన్నీ జూమ్‌లోనే. ఇది కేవలం వీడియో కాల్స్‌కే పరిమితం కాదు. వీడియో కాల్స్‌ అటెండ్‌ చేస్తూనే ఇతర పనులూ చేసుకోవచ్చు. క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్ల ఎక్స్‌టెన్షన్ల మాదిరిగానే

Published : 17 Nov 2021 00:50 IST

ప్రపంచమంతా ఇప్పుడు జూమ్‌ ధాంగానే విహరిస్తోంది. ఆఫీసు సమావేశాలైనా, ఆన్‌లైన్‌ తరగతులైనా అన్నీ జూమ్‌లోనే. ఇది కేవలం వీడియో కాల్స్‌కే పరిమితం కాదు. వీడియో కాల్స్‌ అటెండ్‌ చేస్తూనే ఇతర పనులూ చేసుకోవచ్చు. క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్ల ఎక్స్‌టెన్షన్ల మాదిరిగానే జూమ్‌ సైతం ఎన్నో ప్లగ్‌ ఇన్స్‌, యాడాన్స్‌ను అందిస్తోంది. జూమ్‌ మార్కెట్‌ప్లేస్‌ నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకొని యాప్‌నకు అనుసంధానం చేసుకోవచ్చు. వీటిల్లో ఉపయోగపడే కొన్ని ప్లగ్‌ ఇన్స్‌ గురించి తెలుసుకుందాం. ఇవి చాలావరకు ఉచితమే గానీ కొన్నింటిని కొనుక్కోవాల్సి ఉంటుంది.

వికీపీడియా.. విజ్ఞానం
ఆన్‌లైన్‌లో విహరించేవారికి వికీపీడియా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సందేహాన్నయినా తీర్చే విజ్ఞాన సర్వస్వమిది. జూమ్‌ సమావేశంలో ఉన్నప్పుడు దేని గురించైనా తెలుసుకోవాలంటే యాప్‌ నుంచి బయటకు రాకుండా అక్కడే సందేహ నివృత్తి చేసుకోవటానికిది ఎంతగానో ఉపయోగపడుతుంది.

లింగ్మో ట్రాన్స్‌లేటర్‌.. అనువాదం
వివిధ భాషలు మాట్లాడేవారితో సమావేశం నిర్వహించేవారికిది ఎంతో ఉపయుక్తం. ఇది ఆయా సంభాషణలను టెక్స్ట్‌ రూపంలోకి అనువాదం చేసేస్తుంది. సుమారు 80 భాషలను అనువదిస్తుంది. మరిన్ని భాషలను సపోర్టు చేసేలానూ దీన్ని తీర్చిదిద్దుతున్నారు.

సర్వేమంకీ.. గణన
నేరుగా జూమ్‌ నుంచి సర్వే చేయటానికి ఉపయోగపడే ప్లగ్‌ ఇన్‌ ఇది. జూమ్‌ యాప్‌ నుంచే సర్వేమంకీ అకౌంట్‌కు కనెక్ట్‌ కావొచ్చు. సర్వేను క్రియేట్‌ చేయొచ్చు. కొత్తగా ఎవరైనా స్పందిస్తే జూమ్‌ ఛాట్‌ నుంచే తెలుసుకోవచ్చు. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక, జూమ్‌ సమావేశం కింద ఉండే యాప్స్‌ ద్వారా కనెక్ట్‌ కావాలి.

విక్స్‌.. ఈవెంట్‌ నిర్వహణ
ఫిట్‌నెస్‌ క్లాసులు, చికిత్సల వివరణలు, కన్సల్టేషన్లు, వెబినార్ల వంటివి డిజిటల్‌ ఈవెంట్ల నిర్వహణకు తోడ్పడే సదుపాయమిది. వినియోగదారులు, విద్యార్థులు, సహోద్యోగులు.. ప్రపంచంలో ఎక్కడున్నా, ఎవరితోనైనా దీంతో అనుసంధానం కావొచ్చు. దూరాలను చెరిపేసి ఆన్‌లైన్‌ అనుభూతులను పంచుకోవచ్చు. వివిధ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.

క్యాలెండ్లీ.. సమయసారిణి
ఇది మీటింగ్స్‌ షెడ్యూల్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి ఒకసారి అనుసంధానం కాగానే ప్రతి క్యాలెండర్‌ ఈవెంట్‌కు వీడియో సమావేశం వివరాలు యాడ్‌ అవుతాయి. ఎప్పుడెప్పుడు ఏయే సమావేశాలున్నాయో గుర్తుచేస్తుంది.

జీమెయిల్‌.. ఆటోమేటిక్‌ అనుసంధానం
దీన్ని జూమ్‌ యాప్‌నకు జోడించుకుంటే.. నేరుగా జీమెయిల్‌ నుంచే మీటింగ్స్‌ను షెడ్యూల్‌ చేసుకోవచ్చు. ఆరంభించొచ్చు, మేనేజ్‌ చేయొచ్చు. ఈమెయిల్‌ భాగస్వాములందరూ ఆటోమేటిక్‌గా మీటింగ్‌కు అనుసంధానం అవుతారు. కావాలనుకుంటే ఇంకా ఎక్కువ మందినీ జోడించుకోవచ్చు.

క్రిస్ప్‌.. మాట స్పష్టం
జూమ్‌లోని నాయిస్‌ సప్రెషన్‌ ఫీచర్‌ అన్ని అనవసర శబ్దాలను తగ్గించకపోవచ్చు. ఇలాంటి సమయంలో క్రిస్ప్‌ యాడ్‌ ఆన్‌ను జోడించుకుంటే బాగా ఉపయోగపడుతుంది. ఇది మాట్లాడేవారి, అవతలివారి చుట్టుపక్కల శబ్దాలను తొలగించేస్తుంది. దీంతో స్పష్టంగా మాటలు వినిపిస్తాయి. అపార్థాలకు తావుండదు. జూమ్‌ రికార్డింగ్స్‌ సౌండ్‌ మెరుగు పడటానికీ దీన్ని వాడుకోవచ్చు. రికార్డింగ్‌ మొదలెట్టగానే క్రిస్ప్‌ను ఆన్‌ చేసుకోవాలి. అంతే. ప్రతిధ్వనులు లేకుండా హెచ్‌డీ క్వాలిటీలో స్పష్టంగా మాటలు రికార్డు అవుతాయి. తర్వాత ఎడిట్‌ చేసుకోవాల్సిన పనుండదు.

హనీబుక్‌.. కస్టమర్‌ రిలేషన్‌ సాధనం
చిన్న వ్యాపారాలు చేసుకునేవారు కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌ చేసుకోవటానికి దీన్ని వాడుకోవచ్చు. క్లయింట్లతో చర్చలు, రిసోర్సులు, కాంటాక్టులన్నీ ఒకేచోట ఉండేలా చూసుకోవచ్చు. ఇన్వాయిస్‌లు పంపటానికి, పేమెంట్లు అంగీకరించటానికి రకరకాల యాప్స్‌ల్లోకి వెళ్లాల్సిన పనుండదు. తక్షణం మీటింగులను షెడ్యూల్‌ చేసుకోవటానికి, ఆటో జెనరేటెడ్‌ కాల్స్‌ రిసీవ్‌ చేసుకోవటానికీ వీలుంటుంది.

సర్కిల్స్‌.. కొత్త సమావేశ అనుభూతి
కొత్తరకం మీటింగ్‌ అనుభూతిని కల్పించటం ద్వారా ఇది జూమ్‌ వాడకం తీరునే మార్చేస్తుంది. వీడియోలన్నీ సర్కిల్స్‌లోనే డిస్‌ప్లే అవుతాయి. గందరగోళానికి తావుండదు. షేర్‌ చేసిన వాటి మీదనే దృష్టి కేంద్రీకరించొచ్చు. జూమ్‌ ఫెటీగ్‌ తలెత్తకుండా స్క్రీన్లను మార్చుకోవచ్చు కూడా. వివిధ ట్యాబ్స్‌, యాప్స్‌ తెరవాల్సిన పనుండదు. వీడియోలన్నీ హెచ్‌డీ క్వాలిటీలోనే పెట్టుకోవచ్చు. కావాలనుకుంటే డెస్క్‌టాప్‌ స్పేస్‌ ఎక్కువ తీసుకోకుండా మార్పులూ చేసుకోవచ్చు.

ఆన్‌బోర్డ్‌.. మరింత భద్రత కోసం
ఉద్యోగులు, సమావేశంలో పాల్గొనేవారి మధ్య మెరుగైన బంధం కోసం ఆన్‌బోర్డును ఉపయోగించుకోవచ్చు. దీనికి నేరుగా జూమ్‌ యాప్‌ నుంచే కనెక్ట్‌ కావొచ్చు. పలు స్క్రీన్లను ఒకేసారి చూడటం, మెసేజ్‌ భద్రత, సర్వేలు, అప్రూవల్‌ సిస్టమ్‌, ఇ-సిగ్నేచర్‌ వంటి సదుపాయాలు ఎన్నెన్నో పొందొచ్చు. ఒకే పేజీలో అందరి హాజరు తీసుకొని, నమోదు చేసుకోవటానికి వీలుండటం ముఖ్యమైన ప్రయోజనం. మీటింగ్‌ జరుగుతుండగానే ఫైల్స్‌ రివ్యూ చేసుకోవచ్చు కూడా. అన్నింటినీ సురక్షితంగా సేవ్‌ చేసుకోవచ్చు.

ఫ్రెష్‌టీమ్‌.. నియామకం
జూమ్‌లో పూర్తి రిక్రూట్‌మెంట్‌ సూట్‌ ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఫ్రెష్‌టీమ్‌ను ప్రయత్నించొచ్చు. ఈ ప్లగ్‌ ఇన్‌ తనకుతానే అభ్యర్థుల ఇంటర్వ్యూను షెడ్యూల్‌ చేసి పెడుతుంది. మీటింగ్‌లో పాల్గొనాల్సిన వారందరికి, వారి క్యాలెండర్లకూ తనే ఆహ్వాన లింకులు పంపుతుంది కూడా. ఆన్‌బోర్డింగ్‌ మీటింగులకు, సమయాన్ని ఆదా చేసుకోవటానికి, ఉద్యోగుల సమాచారాన్ని సేకరించటానికీ దీన్ని వాడుకోవచ్చు.

ప్రెజి వీడియో.. అలంకరణ సదుపాయం
ప్రత్యక్ష వీడియో సమావేశాలు, రికార్డింగుల మీద ఇలస్ట్రేషన్లు, దృశ్యాలు, టెక్స్ట్‌లను అలంకరించుకోవాలని అనుకుంటే ప్రెజి వీడియోను ప్రయత్నించొచ్చు. దీంతో సమావేశాలను ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా మలచుకోవచ్చు. మార్కెటింగ్‌, సేల్స్‌, ప్రజెంటేషన్ల కోసం రికార్డు చేసిన వీడియోలకూ దీన్ని వాడుకోవచ్చు. ఆన్‌లైన్‌ తరగతులకు, ప్రత్యక్ష ప్రదర్శనలకు, మేధోమథన సమావేశాలకూ ఇది అనువుగా ఉంటుంది.

మెంటార్‌లూప్‌.. నైపుణ్య సాధనం
కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవటం చాలా ముఖ్యం. ఇలాంటి సందర్భాల్లో మెంటార్‌షిప్‌ కార్యక్రమాలకు హాజరు కావాలనుకునేవారికిది తోడ్పడుతుంది. తగిన మెంటార్‌తో కలవటానికి వీలు కల్పిస్తుంది. తమ లక్ష్యాలు, కార్యక్రమాలు, కమ్యూనికేషన్‌ వివరాలను సమీక్షించుకోవటానికీ ఇది ఉపయోగపడుతుంది. కొత్త అభివృద్ధి అవకాశాలను సూచించటానికి, మెంటార్‌తో ముఖాముఖి సంభాషణకు అవకాశం కల్పిస్తుంది.

ఈక్వియో.. బోధనాంశాలన్నీ ఒకే చోట
ఇది బోధనకు సంబంధించిన అన్ని అంశాలు, శిక్షకుల వివరాలు, నేర్చుకున్న సమాచారాన్ని ఒకే శిక్షణ నోట్‌ మీద పొందు పరచుకోవటానికి ఉపయోగపడుతుంది. మీటింగ్‌ షెడ్యూళ్లు, శిక్షణ వెబినార్ల కోసం వాడుకోవచ్చు. కోర్సులు, ఇంటర్నల్‌ లెర్నింగ్‌ రిసోర్సులు, ఇతర కార్యక్రమాలను సమర్థంగా ప్రదర్శించటానికీ తోడ్పడుతుంది. ముఖ్యంగా ఇది హెచ్‌ఆర్‌ టీమ్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగపరంగా తమ నైపుణ్యాలను పెంచుకోవటానికి దోహదం చేస్తుంది.

విడీయార్డ్‌.. షేరింగ్‌కు అనుకూలంగా
జూమ్‌ రికార్డింగ్‌ ఫైల్‌ను ఎవరికైనా పంపించుకోవాలంటే సెక్యూరిటీ సెటింగ్స్‌ అనుమతించవు. అదే వీడియార్డ్‌ ఎక్స్‌టెన్షన్‌తో వీడియోకు తేలికైన మార్పులు చేసి షేర్‌ చేసుకునేలా మలచుకోవచ్చు. వీటిని తాము నిర్వహించే జూమ్‌ సమావేశాలకు, వెబినార్లకు ఆటోమేటిక్‌గా పంపించుకోవచ్చు. కావాల్సినట్టుగా ఎడిట్‌ చేసుకోవచ్చు కూడా. రకరకాల జూమ్‌ రికార్డింగులను ఒకే చోట ప్రదర్శించొచ్చు. రికార్డింగు వీడియోలను చిన్నవిగా చేసుకోవచ్చు. వీటిని పాస్‌వర్డ్‌ ద్వారా సురక్షితం చేసుకోవచ్చు. పైగా వ్యూ నోటిఫికేషన్స్‌ ద్వారా ఆయా వీడియోలను ఎవరెవరు చూశారో తెలుసుకోవచ్చు. వీడియోలకు క్యాప్షన్లు సైతం జోడించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు