
అంతర్జాలవిప్లవం 3.0
అంతర్జాలం (ఇంటర్నెట్) కొత్తరూపు సంతరించుకుంటోంది. ముచ్చటగా మూడో ‘అవతారం’ దాలుస్తోంది. వెబ్ 3.0గా పిలుచుకుంటున్న దీనిపై ఇటీవల విస్తృతమైన చర్చ నడుస్తోంది. బ్లాక్‌చెయిన్ పరిజ్ఞానంతో నిర్మితమయ్యే ఇది కంటెంట్ విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని, అంతర్జాలాన్ని వికేంద్రీకరిస్తుందనీ విశ్వసిస్తున్నారు. ఇంతకీ దీని కథేంటి?
వార్తలు చదువుతాం. కథలు, కథనాలు చదువుతాం. బ్లాగులు రాస్తాం. వీడియోలు, సినిమాలు చూస్తాం. సంగీతం వింటాం. వస్తువులు కొంటాం. ఆయా విషయాలు నచ్చితే లైక్ చేస్తాం. లేదంటే వ్యాఖ్యానిస్తాం. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు పంచుకుంటాం. తాజా ఘటనలపై చర్చించుకుంటాం. ఇప్పుడంటే అంతర్జాలాన్ని ఇలా విరివిగా వాడుకుంటున్నాం గానీ ఒకప్పుడిది సాధ్యమయ్యేది కాదు. ఏదో ఒక సంస్థో, కంపెనీనో వెబ్సైట్లను తయారుచేసేవి. వాటిల్లో ఉన్న విషయాన్ని చూడటం, చదువుకోవటం తప్ప చేయటానికేమీ ఉండేది కాదు. పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త డిజిటల్ పరిజ్ఞానాల సాయంతో క్రమంగా మారుతూ వచ్చింది. ఒకనాటి ‘నిశ్చల’ స్థితిని దాటుకొని నేటి ‘క్రియాశీల’ దశకు చేరుకుంది. ఇప్పుడు మరింత చైతన్యాన్ని సంతరించుకోవటానికీ సిద్ధమైంది. ఈ అంతర్జాల పరిణామ క్రమాన్ని మూడు దశలుగా వర్గీకరించుకోవచ్చు.
వెబ్ 1.0
ట్విటర్, ఫేస్బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలు.. యూట్యూబ్ వంటి వీడియో ప్రసారాలు లేని ఇంటర్నెట్ను ఇప్పుడు ఊహించుకోగలమా? నమ్మినా నమ్మకపోయినా తొలిదశలో అంతర్జాలం ఇలాగే ఉండేది. ఇది సుమారు 1991 నుంచి 2004 వరకు సాగింది. ఇందులో వెబ్సైట్ డెవలపర్లే కంటెంట్ సృష్టికర్తలు. ఇవి చాలావరకు కంటెంట్ అవసరమైనవారికే ఉపయోగపడేవి. ఆయా సంస్థల సమాచారం, కంపెనీల ప్రకటనల వంటివాటికే పరిమితమయ్యేవి. అన్నీ అక్షరాలు లేదా దృశ్యం రూపంలోనే ఉండేవి. అంటే డేటాబేస్‌తో కాకుండా నిశ్చల ఫైళ్ల వ్యవస్థ నుంచే డేటా, కంటెంట్ అందుబాటులో ఉండేవన్నమాట. దీంతో వెబ్సైట్లను చూడటానికి మాత్రమే వీలయ్యేది. బయటివాళ్లు వీటిల్లో పాల్గొనటం కలలోని మాట.
వెబ్ 2.0
ఇది రెండో దశ. ప్రస్తుతం మనం ఎక్కువగా వినియోగిస్తున్న అంతర్జాల రూపం ఇదే. సమాచారాన్ని చదువుకోవటానికే కాదు, రాసుకోవటానికీ.. అంటే పాలు పంచుకోవటానికీ వీలు కల్పించింది. వినియోగదారులను ప్రేక్షకుల స్థాయి నుంచి కంటెంట్‌ను సృష్టించి, అప్లోడ్ చేయగల స్థితికి చేర్చింది. ఫేస్బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలు.. ఉబర్, ఓలా వంటి సేవలు.. అమెజాన్ వంటి ఇ-కామర్స్ వెబ్సైట్లు, యాప్‌లన్నీ ఈ దశలో పుట్టుకొచ్చినవే. మనసులో ఏ ఆలోచన వచ్చినా వెంటనే ప్రపంచంతో పంచుకుంటున్నామన్నా, వీడియోలు అప్లోడ్ చేస్తున్నామన్నా అంతా దీని చలవే. వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలతో చర్చలు కూడా సాగిస్తున్నాం. ఓరియల్లీ మీడియా ఉపాధ్యక్షుడు డేల్ డవర్టీ ఈ దశకు వెబ్ 2.0 అని పేరు పెట్టారు. అనతికాలంలోనే ఈ పేరు చాలా ప్రాచుర్యం పొందింది. వెబ్ డిజైనింగ్ దగ్గర్నుంచి కంటెంట్, వాణిజ్య వ్యవహారాల వరకూ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం అంతర్జాలంలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించటం. తేలికగా వాడుకోవటానికి వీలు కల్పించటం. ఇది నిజంగానే రాన్రానూ చాలా సరళంగానూ మారిపోయింది.
వెబ్ 3.0
ఇది అధునాతన దశ. ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటోంది. దీని పనితీరును ఇప్పటికే చవి చూస్తున్నాం కూడా. ఉదాహరణకు ఏదో ఒక ఇ-కామర్స్ సైటులో ఒక వస్తువు కొన్నారనుకుందాం. వెంటనే వెబ్సైట్ ఆల్గోరిథమ్ రంగంలోకి దిగుతుంది. ఇంతకుముందు ఆ వస్తువుతో పాటు ఫలానాది కూడా కొన్నారని సిఫారసు చేయటం గమనించే ఉంటారు. అంటే వెబ్సైట్ తనకు తాను నేర్చుకుంటూ, మరింత తెలివిని సముపార్జిస్తోందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే వెబ్ 3.0 వెనక ఉన్న సిద్ధాంతం ఇదే. ఈ పేరును ఎథెరమ్ సహ వ్యవస్థాపకులు గేవిన్ వుడ్ 2014లో తొలిసారి ప్రస్తావించారు. క్రిప్టోకరెన్సీ ఔత్సాహికులు, పెద్ద టెక్నాలజీ కంపెనీలు, భారీ పెట్టుబడి సంస్థల మూలంగా 2021లో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బ్లాక్ చెయిన్, కృత్రిమ మేధ వంటి అధునాతన పరిజ్ఞానాలతో పనిచేసే ఇది అంతర్జాల ప్రపంచాన్ని వికేంద్రీకరిస్తుందని, బడా సంస్థల ఆధిపత్యాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇందులో డెవలపర్లు ఒకే సర్వరు మీద ఆధారపడరు. అలాగే ఒకే డేటాబేస్‌లో తమ సమాచారాన్ని స్టోర్ చేయరు. వెబ్ 3కి సంబంధించిన యాప్స్ బ్లాక్‌చెయిన్ పరిజ్ఞానం, వ్యక్తిగత నోడ్స్‌కు (సర్వర్లు) సంబంధించిన వికేంద్రీకృత నెట్‌వర్క్‌ల మీద పనిచేస్తాయి. ఈ మూడో తరం యాప్స్‌ను డియాప్స్(డీసెంట్రలైజ్డ్ యాప్స్)గా పిలుచుకుంటున్నారు. ఇందులో స్థిరమైన, భద్రమైన నెట్‌వర్క్‌ను సాధించటానికి డెవలపర్లకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఇది అత్యంత నాణ్యమైన సేవలు అందించటానికి పోటీ పడేలా ప్రేరేపిస్తుంది. వ్యక్తిగత సమాచారమూ గోప్యంగా ఉంటుంది.
కీలక ఫీచర్లు
వెబ్ 3.0 భావనను అర్థం చేసుకోవాలంటే కీలకమైన నాలుగు ఫీచర్ల గురించి తెలుసుకోవాలి.
యుబిక్విటీ: యుబిక్విటీ అంటే అన్నిచోట్లా.. ముఖ్యంగా అదే సమయంలో అందుబాటులో ఉండే సామర్థ్యం. వెబ్ 1.0 మాదిరిగా ఇంటర్నెట్ డెస్క్‌టాప్‌కు, వెబ్ 2.0 మాదిరిగా డెస్క్‌టాప్, స్మార్ట్ఫోన్లకే పరిమితం కాదు. వెబ్ 3.0 ఎప్పుడైనా, ఎక్కడైనా, దేనికైనా ఇంటర్నెట్ అందుబాటులో ఉండేలా చేస్తుంది. మన చుటుపక్కల ఉండేవన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరిజ్ఞానంతో అనుసంధానమై ఉంటాయి మరి.
సెమాంటిక్ వెబ్: పదాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేయటాన్ని సెమాంటిక్స్ అంటారు. ఒక పదాన్ని వేర్వేరు వాక్యాల్లో వాడినా వాటి మధ్య సంబంధాన్ని గుర్తించటం దీని ఉద్దేశం. ఇది సమాచార విశ్లేషణ ద్వారా వెబ్సైట్లు అర్థాన్ని, భావోద్వేగాలను విడమరచుకోవటానికి వీలు కల్పిస్తుంది. దీంతో సౌకర్యం పెరుగుతుంది.
కృత్రిమ మేధ: యంత్రాలు, పరికరాలు సంతరించుకునే తెలివిని కృత్రిమ మేధ అంటాం. వెబ్ 2.0లోనూ దీన్ని వాడుకుంటున్నాం. అయితే వెబ్ 3.0 పరికరాలు దీన్ని గుడ్డిగా అనుసరించవు. డేటా ఎక్కువగా ఉన్నా అందులో వ్యక్తమయిన భావోద్వేగాలను, అర్థాలను విడమరచుకోగలవు. అంటే ఎవరైనా కావాలని నెగెటివ్ రివ్యూలు పెడితే గుర్తించగలవన్నమాట. దీని సాయంతో గూగుల్ ఏఐ ఇటీవల ప్లే స్టోర్ నుంచి లక్ష నెగెటివ్ రివ్యూలను తొలగించింది కూడా. ఇది వెబ్ 3.0 రాకతో మరింత మెరుగవుతుంది.
3డీ గ్రాఫిక్స్: ఆన్లైన్ గేమ్స్, ఇ-కామర్స్, స్థిరాస్తి వంటి రంగాల వెబ్సైట్లు వెబ్ 3.0లో త్రీడీ గ్రాఫిక్స్‌ను మరింత ఎక్కువగా వాడుకుంటాయి. ఇది సైబర్ వరల్డ్‌ను వాస్తవ ప్రపంచంగా మార్చేస్తుంది. ఇప్పటికే కొన్ని గేమ్స్‌లో ఎంతోమంది ఆన్లైన్ అవతారాలతోనే పాల్గొంటుండటం గమనార్హం. ఇలాంటి కాల్పనిక ఆకారాలు మున్ముందు ఇ-మెయిల్, మొబైల్ ఫోన్ల కన్నా ప్రాచుర్యం పొందనున్నాయని భావిస్తున్నారు. డీసెంట్రాల్యాండ్ వంటి 3డీ వర్చువల్ ప్రపంచంలో ‘భూములు’ కొనటం దీనికొక మచ్చు తునక.