ఇసుక బంగారం!

రేణువంత ఇసుక ఆధునిక మానవ జీవితాన్నే మార్చేసింది. ఇది లేని పట్టణాలను ఊహించనేలేం. ఇళ్లు, భవనాలు, కార్యాలయాలు, షాపింగ్‌ మాళ్లు, అపార్టుమెంట్లు, వంతెనలు, రోడ్లు ఒకటేమిటి..

Updated : 04 Apr 2022 11:25 IST

రేణువంత ఇసుక ఆధునిక మానవ జీవితాన్నే మార్చేసింది. ఇది లేని పట్టణాలను ఊహించనేలేం. ఇళ్లు, భవనాలు, కార్యాలయాలు, షాపింగ్‌ మాళ్లు, అపార్టుమెంట్లు, వంతెనలు, రోడ్లు ఒకటేమిటి సిమెంటు కట్టడాలన్నింటికీ ఇసుకే కీలకం. అంతేనా? కిటికీల అద్దాలు, స్మార్ట్‌ఫోన్‌ తెరల వంటివన్నీ దీని చలవే. ఫోన్లు, కంప్యూటర్లలోని సిలికాన్‌ చిప్‌లు సైతం ఇసుక నుంచి పుట్టుకొచ్చినవే. ఇలా ఇది వామన రూపంతోనే విశ్వమంతా విస్తరించింది.

ఇసుక బంగారం! ఆ మాటకొస్తే బంగారం కన్నా గొప్పదీనూ. విలువ పరంగా బంగారం గొప్పదే. కానీ వాడకం విషయంలో ఇసుక అంతకన్నా విలువైందంటే అతిశయోక్తి కాదు. గాలి, నీరు తర్వాత మనిషి అత్యధికంగా వినియోగిస్తున్న సహజ వనరు ఇదే మరి. రోజురోజుకీ దీనికి డిమాండ్‌ పెరుగుతూ వస్తోందే తప్ప తరగటం లేదు. మనం ఏటా 5వేల కోట్ల టన్నుల ఇసుకను వాడుకుంటున్నామని అంచనా. ఇదిలాగే కొనసాగితే 2060 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇసుక డిమాండ్‌ 45% మేరకు పెరుగుతుందని నెదర్లాండ్స్‌ పరిశోధకుల తాజా లెక్కలు చెబుతున్నాయి. దీనికోసం మనిషి నదులు, సముద్ర తీరాలను విపరీతంగా తవ్వటం పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తుందనీ హెచ్చరిస్తున్నారు. భవనాల మన్నిక కాలాన్ని పెంచటం, కాంక్రీటును తిరిగి వాడుకోవటం, తేలికైన భవనాల డిజైనింగ్‌, కలప ఫ్రేముల వంటి ప్రత్యామ్నాయ పదార్థాల వాడకం వంటివి చేపట్టకపోతే పెను ప్రమాదంలో పడక తప్పదని గుర్తుచేస్తున్నారు. నిజానికి భూమ్మీద బోలెడంత ఇసుక ఉంది. సహారా నుంచి థార్‌ వరకు ఏడారుల నిండా ఇసుక దిబ్బలే. అయినా కూడా ఎందుకింత కొరత? రహస్యమంతా దీని వైవిధ్యంలోనే ఉంది. మనం ఎక్కువగా ఇసుకను కాంక్రీటు కోసం వాడుతుంటాం. దీనికి ఎడారి ఇసుక పనికిరాదు. ఇది చాలా నున్నగా, గుండ్రంగా ఉంటుంది. అందువల్ల బలంగా కలిసి ఉండలేదు. నిర్మాణాలకు పనికిరాదు. కాబట్టే నదులు, సముద్రాలు, సరస్సుల తీరాల ఇసుకకు డిమాండ్‌ పెరిగిపోతోంది.

ఈనాటిది కాదు
చూడటానికి పైకి ఇసుక అంతా ఒకేలా కనిపిస్తుంది. కానీ దీని రేణువులు రకరకాల ఆకారాల్లో, సైజుల్లో ఉంటాయి. వివిధ పదార్థాలతో తయారవుతాయి. వుడ్డెన్‌-వెంట్‌వర్త్‌ స్కేల్‌ ప్రకారం- 2 నుంచి 0.0625 మిల్లీమీటర్ల వ్యాసంతో ఉండి, గట్టి పదార్థంతో తయారైన రేణువును ఇసుకగా భావిస్తారు. ఇంతకీ ఇసుక ఎలా ఏర్పడుంది? రాళ్ల కోత వల్ల. గాలి, వాన, నీరు, సూక్ష్మక్రిములు, ఇతర బలాల వంటి ప్రభావంతో పర్వతాలు, గుట్టలు, రాళ్లు క్షీణిస్తూ వస్తాయి. చిన్న చిన్న రేణువులుగా మారి, రాళ్ల ఉపరితలం నుంచి విడిపోతాయి. వాన కురిసినప్పుడు నీటి ప్రవాహంతో కలిసి కిందికి వస్తాయి. కాలువలు, నదుల ద్వారా దూరదూరాలకు విస్తరిస్తూ.. చివరికి సముద్రాలకు చేరతాయి. ఈ క్రమంలోనే నదీ తీరాల వద్ద, నదులు సముద్రంతో కలిసే చోట ఇసుక మేట వేసుకుపోతుంది. శతాబ్దాలుగా నదులు తీరాలను ముంచెత్తటం, దిశను మార్చుకోవటం వంటివన్నీ ఇసుక పెద్ద మొత్తంలో పోగయ్యేలా చేస్తూ వచ్చాయి. ఇదంతా చాలా చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. లక్షలాది సంవత్సరాలుగా ఇసుక ఒక అవక్షేపంగా (స్లిట్‌) భూగర్భంలో పొరలు పొరలుగా పరచుకొంటూ వస్తుంది. అవక్షేపం మనం చూసే ఇసుక కన్నా ఇంకా సన్నగా ఉంటుంది. ఇదే కొత్త పర్వతాలుగా మారుతుంది. ఈ పర్వతాల రాళ్లే క్షీణించి తిరిగి నేల మీదికి చేరుకుంటాయి. ఈ ప్రక్రియ మళ్లీ మళ్లీ పునరావృతమవుతూ వస్తుంటుంది. ఇసుక ఏర్పడటం, పోగుపడటం, భూమిలో నిక్షిప్తం కావటం, పర్వతాల రూపంలో తిరిగి పైకి రావటం, గాలి తాకిడికి క్షీణించటం, చిన్న చిన్న రేణువులుగా మారి నదులు, సముద్రాల్లోకి చేరటం.. ఇదంతా ఒక చట్రంలా కొనసాగుతూ వస్తుంది. ఒక చట్రం పూర్తవటానికి సగటున 20 కోట్ల సంవత్సరాలు పడుతుంది! అంటే ఇప్పుడు మనం చూసే ఇసుక కోట్లాది సంవత్సరాల క్రితం నాటిది అన్నమాట. సముద్రాల్లో నత్తగుల్లలు, కోరల్స్‌ క్షీణించటంతోనూ ఇసుక ఏర్పడుతుంది. ఇది క్యాల్షియం కార్బొనేట్‌ రకం ఇసుక. కరేబియన్‌ దీవుల్లోని తీరాలు చాలావరకు ఇలాంటి క్షీణించిన నత్తగుల్లలతో తయారైనవే. అగ్నిపర్వతాల నుంచి వెలువడే లావా చల్లబడి.. గాలి, నీటి ప్రవాహాల తాకిడికి గురవ్వటంతోనూ ఇసుక ఏర్పడొచ్చు. హవాయి నల్ల ఇసుక బీచులు ఇలా ఏర్పడ్డవే. జిప్సమ్‌తో కూడిన ఇసుక తెల్లగా ఉంటుంది. ఇది అరుదు. అమెరికాలోని వైట్‌ సాండ్స్‌ నేషనల్‌ పార్కు వంటి చోట్ల ఇది కనిపిస్తుంది.

క్వార్ట్జ్‌ ప్రధానం
ఇసుక ప్రధానంగా క్వార్ట్జ్‌ స్ఫటికాలతో కూడుకొని ఉంటుంది. ఇది సిలికాన్‌ డయాక్సైడ్‌ రూపం. దీన్నే సిలికా అనీ అంటారు. ఇందులో సిలికాన్‌, ఆక్సిజన్‌ మూలకాలు ఉంటాయి. భూమి అంతర్భాగంలో పెద్దమొత్తంలో ఉండే మూలకాలు ఇవే. క్వార్ట్జ్‌ చాలా గట్టిగా ఉంటుంది. రాళ్ల కోతకు ఇతర ఖనిజాలు విచ్ఛిన్నమైనా క్వార్ట్జ్‌ అలాగే స్థిరంగా ఉంటుంది. అందుకే సుదీర్ఘకాలం చెక్కు చెదరకుండా దృఢంగా ఉంటుంది. క్వార్ట్జ్‌ ఆయా భూభాగాల్లోని ఐరన్‌, ఫ్లెడ్‌స్పార్‌ వంటి ఇతర పదార్థాల మిశ్రమంతో కలిసిపోయి ఉంటుంది. స్వచ్ఛ క్వార్ట్‌ పారదర్శకంగా ఉంటుంది. కానీ ఆక్సీకరణ మూలంగా క్వార్ట్జ్‌ రేణువుల రంగు మారుతుంది. వీటి మూలంగానే సముద్ర తీరాల్లోని బీచ్‌ల ఇసుక రకరకాల రంగులతో కనిపిస్తుంటుంది.

ఒక్కోటి ఒకోలా
ఇసుక రూపాలు అనేకం. మనం నిర్మాణాలకు వాడుతున్న ఇసుక వివిధ ముఖాలతో ఉంటుంది. అందుకే సిమెంటు మిశ్రమంతో కలిసి గట్టి అనుబంధాన్ని ఏర్పరచుకుంటుంది. సముద్రం అడుగున ఉండే ఇసుకను ఎక్కువగా కృత్రిమ దీవుల వంటివి నిర్మించటానికి వినియోగిస్తుంటారు. దుబాయిలోని కృత్రిమ పామ్‌ దీవులు దీంతో నిర్మించినవే. దీన్ని కాంక్రీటుకూ వాడుకోవచ్చు. కాకపోతే ముందు దీనిలోని ఉప్పును తొలగించాల్సి ఉంటుంది. ఇది చాలా ఖరీదైన వ్యవహారం. గాజు తయారీకి స్వచ్ఛమైన సిలికా ఇసుక అవసరం. ఇది చాలా తక్కువచోట్లనే దొరుకుతుంది. ఇందులో 95% వరకు సిలికా ఉంటుంది. దీన్ని పారిశ్రామిక ఇసుక అనీ పిలుచుకుంటారు. లోహ పరిశ్రమల్లో అచ్చులు తయారుచేయటానికి, రంగులు మరింతగా మెరవటానికి, ఈత కొలనుల్లో నీటిని శుద్ధి చేయటానికీ ఇది ఉపయోగపడుతుంది. అమెరికాలోని విస్కాన్సిన్‌లో లభించే ప్రత్యేక సిలికా ఇసుకను చమురు, గ్యాస్‌ వెలికి తీసే పనిలోనూ వినియోగించు కుంటారు. ఇక అన్నింటికన్నా ప్రధానంగా చెప్పుకోవాల్సింది అత్యంత శుద్ధమైన క్వార్ట్జ్‌ గురించి. కంప్యూటర్‌ చిప్‌ల వంటి అత్యాధునిక పరికరాల తయారీకి ఉపయోగపడేది ఇదే.


జీవితంలో ఒక భాగం
మన జీవితం ఇసుక మీదే ఆధారపడి ఉంది! దీని మూలంగానే మన జీవితం సాఫీగా సాగుతోంది. నమ్మకం కలగటం లేదా? అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేం పనులు చేస్తున్నామో ఒకసారి గుర్తుతెచ్చుకోండి.


ఉదయం నిద్ర లేవగానే ఏం కనిపిస్తుంది? ఇంటి కప్పు, గోడలు. ఇసుక లేకపోతే సిమెంటుతో ఇల్లు కట్టటం సాధ్యమేనా? గోడలకు ప్లాస్టరింగ్‌ అయినా కాంక్రీటు కప్పు అయినా ఇసుక ఉండాల్సిందే. గోడలకు వేసే రంగులోనూ సన్నటి సిలికా ఇసుక పొడి ఉంటుంది. దీని మూలంగానే రంగు ఎక్కువకాలం మన్నుతుంది. రంగు మెరవటానికి, నూనెను గ్రహించుకోవటానికి, రంగు చిక్కగా ఉండటానికీ బాగా శుద్ధి చేసిన ఇసుకను వాడుతుంటారు. ఒకసారి బల్బులు, అద్దాల వంక చూడండి. నీళ్లు తాగే గాజు గ్లాసు, సీసాలను గమనించండి. వీటి తయారీకి వాడే గాజు ఎలా వస్తుందో తెలుసా? ఇసుకను కరిగించటం వల్లనే. బాత్రూమ్‌లోని సింక్‌ తయారయ్యేదీ ఇసుక ఆధారిత పోర్సిలీన్‌ నుంచే. నల్లాలోంచి వచ్చే నీరు ఇసుకతో శుభ్రపడ్డాకే మనదాకా చేరుకుంటుంది. టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముకుంటాం కదా. వీటిల్లోనూ హైడ్రేటెడ్‌ సిలికా వాడుతుంటారు. ఇది పళ్ల మీద ఘర్షణ కలిగిస్తూ గార, మచ్చలను తొలగిస్తుంది. లోదుస్తులు జారిపోకుండా చూసే ఎలాస్టిక్‌ను సిలికాన్‌తో తయారుచేస్తారు. ఈ సిలికాన్‌ ఇసుక నుంచి తీసిందే. షాంపూలు జుత్తును మెరిసేలా చేయటానికి, చొక్కాలు త్వరగా ముడతలు పడకుండా చూడటానికి కూడా సిలికాన్‌ ఉపయోగపడుతోంది. ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వద్దాం. సిమెంటు రోడ్ల మీద వేగంగా దూసుకుపోవటం కొత్తేమీ కాదు. ఆఫీసులోనూ కంప్యూటర్‌ తెర, కంప్యూటర్‌లోని చిప్‌లు, ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసే ఫైబర్‌ ఆప్టిక్‌ తీగలన్నీ ఇసుకలోని సిలికాతో తయారైనవే. ప్రింటింగ్‌ కోసం వాడే కొన్నిరకాల కాగితాల మీద ఇసుకతో కూడిన పొరను పరుస్తుంటారు. ఇది ప్రింటర్‌ ఇంక్‌ను పీల్చుకోవటానికి తోడ్పడుతుంది. స్టికీ నోట్స్‌ను అంటించటానికి వాడే జిగురు కూడా ఇసుక నుంచి వచ్చిందే. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చాక టీవీ చూస్తూ సేదతీరుతాం కదా. దీని తెర తయారీలోనూ క్వార్ట్జ్‌ ఇసుకను వాడుతారు. అంటే మనం ఇసుకలోనే నివసిస్తున్నాం, ఇసుక మీదే నడుస్తున్నాం, ఇసుకతోనే అనుసంధానం అవుతున్నామన్నమాట.


ఇసుక చేప

ఇదో అద్భుతమైన చేప. పేరు ప్యారట్‌ ఫిష్‌. దీన్ని ఇసుక చేప అనీ అనుకోవచ్చు. దీని పళ్లు కలగలిసి ఉంటాయి. వీటితో పగడపు దిబ్బలకు గట్టిగా పట్టుకొని ఉండే నాచును గీకుతుంది. ఈ క్రమంలో కొంత పగడపు దిబ్బల భాగాన్నీ లోపలికి పీల్చుకుంటుంది. దీనికి గొంతులోనూ ప్రత్యేకమైన దంతపు పలకలుంటాయి. ఇవి అదనపు దంతాల మాదిరిగా పనిచేస్తూ కఠినమైన పగడాలను పిండి చేస్తాయి. ఇది జీర్ణకోశం గుండా సాగుతూ చివరికి మలం ద్వారా తెల్లటి ఇసుక రూపంలో బయటకు వస్తుంది. ఈ ఇసుక పీతలు, రొయ్యల వంటి జీవులకు ఆవాసంగానూ ఉపయోగపడుతుంది. కరేబియా, హవాయి బీచుల్లోని తెల్లటి ఇసుకలో 70% పార్యట్‌ ఫిష్‌ విసర్జితాలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చేప సుమారు 40 ఏళ్ల వరకు జీవిస్తుంది. నాలుగు అడుగుల పొడవు, 50 కిలోల బరువు వరకు పెరుగుతుంది. ఒక్కోటీ ఏటా వందలాది కిలోల ఇసుకను పుట్టిస్తాయి.


గ్రానైట్‌ రాయి విచ్ఛిన్నం ఇలా..
వేలాది ఏళ్లుగా రసాయన క్షీణత మూలంగా గ్రానైట్‌ వంటి గట్టి రాళ్లు సైతం అవక్షేపంగా మారతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని