హోలోపోర్టేషన్‌తో ఐఎస్‌ఎస్‌కు డాక్టర్లు!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో ఐరోపా వ్యోమగామికి ఏదో జబ్బు చేసింది. అత్యవసరంగా డాక్టర్‌ సలహా అవసరమైంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అప్పటికప్పుడు ఐఎస్‌ఎస్‌కు డాక్టర్లను పంపించింది.

Published : 27 Apr 2022 01:55 IST

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో ఐరోపా వ్యోమగామికి ఏదో జబ్బు చేసింది. అత్యవసరంగా డాక్టర్‌ సలహా అవసరమైంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అప్పటికప్పుడు ఐఎస్‌ఎస్‌కు డాక్టర్లను పంపించింది. అదీ అంతరిక్ష నౌక లేకుండా! డాక్టర్లు అక్కడికి వెళ్లి, వ్యోమగామిని పరిశీలించి తగు చికిత్స సూచించారు. అదెలా? రాకెట్ల వంటివేవీ లేకుండా, ఉన్నపళంగా డాక్టర్లను అక్కడికి ఎలా పంపగలిగారు? నిజంగా డాక్టర్లు వెళ్లటం కుదరకపోవచ్చు. వాళ్ల నిలువెత్తు రూపాలు వెళ్లొచ్చుగా. చిత్రంగా అనిపిస్తోంది కదా. అవును. స్టార్‌వార్స్‌ లాంటి సినిమాలను నిజం చేస్తూ నాసా గత సంవత్సరం అక్టోబరులో ఇలాంటి చిత్రాన్నే సుసాధ్యం చేసింది. హోలోపోర్టేషన్‌ ద్వారా.. అంటే 3డీ హోలోగ్రామ్‌ రూపంలో డాక్టర్లను ఐఎస్‌ఎస్‌కు పంపించింది. వ్యోమగామిని ప్రత్యక్షంగా చూస్తూ, మాట్లాడుతూ డాక్టర్లు చికిత్స సూచించారు. దీని గురించి నాసా ఇటీవలే ప్రకటించింది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌ రూపొందించిన హోలోలెన్స్‌ కైనెక్ట్‌ కెమెరాలు, ఏఈఎక్స్‌ఏ కంపెనీ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకున్నారు. ఈ పరిజ్ఞానాన్ని మున్ముందు వ్యక్తిగత వైద్య సదస్సులు, మానసిక సదస్సులు, కుటుంబ సమావేశాలు, ఐఎస్‌ఎస్‌ను ప్రముఖులు సందర్శించటం వంటి వాటికి వాడుకుంటామని హోలోగ్రామ్‌ వైద్య బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ జోసఫ్‌ ష్మిడ్‌ చెబుతున్నారు. హోలోపోర్టేషన్‌ ద్వారా మనం మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారిని ‘నేరుగా’ కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అవతలి వారికి మనల్ని ప్రత్యక్షంగా చూస్తున్న భావన కలుగుతుంది. గ్రహాంతర యానానికి ప్రయత్నిస్తున్న మనిషి కలలూ ఇక్కడ్నుంచే నెరవేరే అవకాశమూ ఉంది. అంటే భౌతికంగా ఇక్కడే ఉన్నా మన రూపాలతో చంద్రుడి మీద, అంగారకుడి మీద తిరగొచ్చన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని