దావోస్‌లో టెక్ అంకురాలు
దావోస్‌లో ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ సదస్సు అనగానే ప్రభుత్వ విధానాలు, వాణిజ్య వ్యూహాల చర్చలే గుర్తుకొస్తాయి. ఇవి మాత్రమే కాదు.. సాంకేతిక రంగం పాత్రా తక్కువేమీ కాదు. ఆర్థికాభివృద్ధి సాధనకు, భవిష్యత్ సమాజ భద్రతకు కొంగొత్త ఆవిష్కరణలు చాలా కీలకమన్న భావనతో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ‘టెక్నాలజీ పయోనీర్స్ కమ్యూనిటీ’ని ప్రారంభించింది. ఏటా దీనికి ప్రపంచవ్యాప్తంగా వినూత్న అంకుర సంస్థలను ఎంపిక చేస్తుంది. ఈసారి 100 టెక్నాలజీ సంస్థలను ఎంచుకోగా.. వీటిల్లో మనదేశానికి చెందినవి ఐదు ఉండటం విశేషం. వార్షిక సదస్సులో జరిగే వర్క్‌షాప్‌లు, అత్యున్నత చర్చాగోష్ఠుల్లో పాల్గొనటానికీ వీటికి ఆహ్వానం లభించింది. ఈ అంకుర సంస్థల ఆవిష్కరణల్లో కొన్ని ఆసక్తికరమైన టెక్నాలజీలపై కన్నేద్దామా!
అటు నీటి శుద్ధి.. ఇటు చేపల ఆహారం
ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) ప్రకారం నీటి కాలుష్యానికి ఎక్కువగా కారణమవుతున్నది వ్యవసాయమే. ఎరువుల్లో పెద్దమొత్తంలో ఉండే పోషకాలు (ముఖ్యంగా నైట్రోజన్, ఫాస్ఫరస్), పశువుల వ్యర్థాలు చాలావరకు నీటిలోనే కలుస్తుంటాయి. నైట్రోజన్, ఫాస్ఫరస్ మూలంగా నీటిలో నాచు విపరీతంగా పెరుగుతుంది. ఇక్కడే మెక్సికోకు చెందిన మైక్రోటెరా అనే బయోటెక్ సంస్థ వినూత్నంగా ఆలోచించింది. చేపల పెంపకానికి వాడిన తర్వాత వదిలే నీటిని బయోరియాక్టర్లతో అక్కడిక్కడే శుద్ధి చేయటం దీని ఉద్దేశం. వ్యర్థ జలాల్లో ఉండే పోషకాలను వాడుకొని ఒకరకమైన నాచును పెంచటం.. దీన్ని మంచి ప్రొటీన్‌తో కూడిన ఆహారంగా మార్చటం ఇందులోని కీలంకాశం. దీన్ని తిరిగి చేపలకు ఆహారంగా వాడుకోవచ్చు. అంటే చేపల వ్యర్థాలే వాటికి మళ్లీ ఆహారంగా ఉపయోగపడతాయన్నమాట. శుద్ధి చేసిన నీటిని తిరిగి చేపల చెరువులకు మళ్లిస్తారు. దీంతో చేపల చెరువుల చుట్టుపక్కల జల వనరులు కలుషితం కావు. సముద్రాల్లో ప్రమాదకర పోషకాల మోతాదులు పెరగవు. అదే సమయంలో చేపల ఆహార ఉత్పత్తికి అయ్యే ఖర్చూ తగ్గుతుంది. కావాలంటే నాచుతో తయారుచేసిన ప్రొటీన్‌ను ఇతర ఆహార పదార్థాలు తయారుచేయటానికీ వాడుకోవచ్చు.
అరుదైన చక్కెరలు అదరహో
ఆరోగ్యకరమైన, అందరికీ అందుబాటులో ఉండే చక్కెరలను తయారుచేయటం బోనుమోస్ సంస్థ లక్ష్యం. అందుకే టాగటోజ్ అనే అరుదైన చక్కెర మీద దృష్టి సారించింది. కొన్ని పండ్లు, ధాన్యాల్లో టాగటోజ్ తక్కువ మోతాదులో లభిస్తుంది. దీని రుచి చక్కెర మాదిరిగానే ఉంటుంది. ఇది సుక్రోజ్ తీపిలో 92% తియ్యదనాన్ని కలిగి ఉన్నప్పటికీ 38% కేలరీలే ఉంటాయి. అందువల్ల మామూలు చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుకోవచ్చు. టాగటోజ్ 15 ఏళ్లుగా అందుబాటులో ఉన్నప్పటికీ దీని తయారీకి చాలా ఖర్చవుతుంది. సాధారణంగా పాల నుంచి తీసిన ముడి పదార్థంతో దీన్ని తయారుచేస్తుంటారు. ఇది ఖరీదైనది. ఇక్కడే బోనుమోస్ సంస్థ కొత్తగా ఆలోచించింది. ముడి పదార్థం ఖర్చు తగ్గించటానికి మొక్కల నుంచి తీసిన పిండి పదార్థంతో టాగటోజ్‌ను సేకరించే ప్రక్రియను రూపొందించింది. ఇందుకు ప్రత్యేక ఎంజైమ్‌లను వాడుకోవటం వల్ల దిగుబడీ ఎక్కువగానే వస్తుంది. ఈ సంస్థ అల్యులోజ్, అలోజ్ వంటి ఇతర అరుదైన చక్కెరలనూ తయారుచేస్తోంది.
అంతరిక్ష వాతావరణ పర్యవేక్షణ
అంతరిక్ష వాతావరణానికి ఇటీవల ప్రాధాన్యం పెరిగిపోతోంది. సూర్యుడి పరిస్థితులు, సౌర గాలులు, అయస్కాంతావరణం, అయానోవరణం ఇవన్నీ అంతరిక్ష వాతావరణంలో భాగమే. ఇవి ఉపగ్రహ వ్యవస్థలు, వ్యోమగాములు, విమానాలు, అంతరిక్ష ప్రయోగశాలల వంటి వాటిపై గణనీయమైన ప్రభావాన్నే చూపుతాయి. ఈ నేపథ్యంలో అంతరిక్ష వాతావరణం తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అందించటానికి మిషన్ స్పేస్ సంస్థ కృషి చేస్తోంది. ఎల్‌ఈఓ ఆధారిత నెట్‌వర్క్‌తో కూడిన ఇది వినూత్నమైన డిటెక్టర్ల సాయంతో పనిచేస్తుంది. క్లౌడ్ సేవలతో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తుంది. ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది. మున్ముందు అంతరిక్ష వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేసి చెబుతుంది. ఉపగ్రహ వ్యవస్థలు, విమానాలు, అంతరిక్ష ప్రయోగాలు, అంతరిక్ష పర్యటకం, ఇంధన కంపెనీలు, రైల్వే సంస్థలు, అత్యధిక వేగంతో పనిచేసే స్టాక్ మార్కెట్ సంస్థల వంటి వాటికిది ఎంతగానో ఉపయోగపడుతుంది.
మామూలు ఫొటోతోనే 3డీ అవతార్
వర్చువల్ రియాలిటీ ప్రపంచానికి సహజత్వాన్ని పరిచయం చేయాలన్నది వోల్ఫ్‌ప్రింట్ 3డి సంస్థ లక్ష్యం. ఇందుకోసం ఎస్‌డీకే/ఏపీఐ పరిజ్ఞానాన్ని రూపొందించింది. 20వేల మంది ముఖాలను 3డీ స్కానర్లతో స్కాన్ చేసి.. ప్రత్యేకమైన కృత్రిమ మేధ పరిజ్ఞానంతో మేళవించటం దీనిలోని విశేషం. దీంతో మామూలు ఫొటో సైతం 3డీ రూపంలో అవతార్‌గా మారుతుంది. డెస్క్‌టాప్, మొబైల్, వెబ్ మీద పనిచేసే దీంతో కేవలం 5 సెకండ్లలోనే అవతార్‌ను సృష్టించుకోవచ్చు. దీనిలోని యాపిల్ ఏఆర్‌కిట్ సాయంతో అవతార్‌కు భావోద్వేగాలనూ జోడించుకొని, యానిమేషన్‌గా మలచుకోవచ్చు. ఇష్టమైనట్టుగా అవతార్ స్టికర్లనూ తయారు చేసుకోవచ్చు. ఒక్క తల భాగాన్ని మాత్రమే కాదు, శరీరం మొత్తాన్ని 3డీ అవతార్‌గా సృష్టించుకొని, కాల్పనిక ప్రపంచంలో విహరించొచ్చు.
ఇ-వ్యర్థాల నుంచి బంగారం
పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లలో బంగారం, రాగి వంటి విలువైన లోహాలెన్నో ఉంటాయి. వీటిని తక్కువ ఖర్చుతో వెలికి తీస్తే? న్యూజిలాండ్‌కు చెందిన మింట్ ఇన్నోవేషన్ సంస్థ లక్ష్యం ఇదే. బయోటెక్ ప్రక్రియ సాయంతో ఇ-వ్యర్థాల నుంచి విలువైన లోహాలను వెలికి తీస్తోంది. సూక్ష్మక్రిములు, చవకైన రసాయనాలు వాడుకొని దీన్ని సుసాధ్యం చేస్తోంది. రసాయనాల సాయంతో లోహాలను కరిగించి వాటిని బయో రియాక్టర్లలోకి పంపిస్తారు. అక్కడ ప్రత్యేకమైన సూక్ష్మక్రిములు బంగారం వంటి లోహాలను సంగ్రహిస్తాయి. దీన్నే బయోఅబ్జార్‌ప్షన్ అంటారు. లోహాలను సంగ్రహిస్తున్నకొద్దీ సూక్ష్మక్రిములు బరువెక్కుతాయి. అందువల్ల అపకేంద్ర యంత్రంతో తేలికగా బయటకు తీయొచ్చు. వీటిని శుద్ధిచేసి లోహాలను వెలికి తీస్తారు.
నిలువు సాగుకు జై
చైనాకు చెందిన ఎస్‌హెల్త్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద నిలువు వ్యవసాయ క్షేత్రాలను నిర్మిస్తోంది. చాలాచోట్ల నిలువు సాగు చేస్తున్నప్పటికీ ఈ సంస్థ రూపొందించిన కొత్త పరిజ్ఞానాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎల్‌ఈడీ బల్బులు, జెల్‌పోనిక్స్, జీవ-ఎరువులు, సాఫ్ట్‌వేర్, ఆటోమేషన్ వంటివి దీనికి ప్రత్యేక ఆకర్షణ తెచ్చి పెడుతున్నాయి. మొక్కలకు ఎప్పుడు ఏ రంగు అవసరమో ఆ రంగునే వెదజల్లేలా ఎల్‌ఈడీ బల్బుల వ్యవస్థను రూపొందించారు. దీంతో దిగుబడి బాగా పెరుగుతుంది. హైడ్రోఫోనిక్ పద్ధతిలో మట్టి లేకుండా కేవలం నీటితోనే పంటలను పండిస్తుంటారు. ఈ నీటిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచటం ద్వారా మొక్కలకు మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధి చెందించటం మరో ప్రత్యేకత. మొక్కల వేళ్లకు దన్నుగా నిలిచేలా ఎస్‌బేస్ అనే వృక్ష ఆధారిత జెల్‌నూ ఇందులో వాడుకుంటారు. ఇది విత్తనాలు మొలకెత్తుతున్నప్పుడు స్థిరమైన ఆధారంగా ఉపయోగపడుతుంది. సూక్ష్మక్రిములతో తయారుచేసిన పోషకాలను జెల్‌కు జోడించటం వల్ల మొక్కలు త్వరగానూ ఎదుగుతాయి. ఈ జెల్ కరిగిన తర్వాత నీటిని కలుషితం చేయదు. అందువల్ల మొక్కలకు ఎలాంటి హాని కలగదు. తేలికగానూ శుభ్రం చేయొచ్చు.
మహిళల ఆరోగ్యానికి ప్రత్యేకంగా
మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి కృషి చేస్తోంది ఇజ్రాయెల్‌కు చెందిన ఓకాన్ హెల్త్‌కేర్ సంస్థ. జననాంగంలో తేలికగా అమర్చుకునే, అనువైన పరికరాలను తయారు చేయటం దీని ప్రత్యేకత. వీటిల్లో ఒకటి ఐయూబీ బాలెరైన్. ఇది హార్మోన్ రహిత గర్భ నిరోధక సాధనం. ఇది స్వల్ప మోతాదులో రాగిని విడుదల చేస్తూ ఐదేళ్ల వరకు గర్భం రాకుండా చేస్తుంది. ఎక్కువగా రుతుస్రావం అయ్యేవారికి ఉపయోగపడేందుకు తోడ్పడే పరికరం ఐయూబీ సీడ్. ఐయూబీ ప్రైమా పరికరమైతే నేరుగా లోపలికే హార్మోన్ మందులను సరఫరా చేస్తుంది.
మనదేశం అంకురాలూ భేష్!
శాకాహార పాలు, వెన్న
మన శరీరానికి ప్రొటీన్లు అత్యవసరం. అయితే మాంసంతో లభించే వాటి కన్నా శాకాహారంతో లభించే ప్రొటీన్లు మంచివనే భావన పెరుగుతోంది. దీని మీదే గురిపెట్టింది మన దేశానికి చెందిన అంకుర సంస్థ ప్రొఇయాన్. అత్యధిక పోషక విలువలు, రుచితో కూడిన శాకాహార ప్రొటీన్లు తయారుచేయటం దీని ప్రత్యేకత. ఇప్పటికే పెసర్లు, శనగలు, తోటకూర గింజలతో ప్రొటీన్లను రూపొందించింది. నురగ వచ్చే స్వభావం ఉండటం వల్ల పెసర్ల ప్రొటీన్‌ను గుడ్డుకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. శాకాహార ఛీజ్, వెన్న తయారీకీ ఉపయోగపడుతుంది. నీటిని ఎక్కువగా పట్టుకొని గుణముండే శనగ ప్రొటీన్‌తో మయోనేజ్, ప్రొటీన్ పట్టీల వంటివి తయారుచేసుకోవచ్చు. తోటకూర గింజల ప్రొటీన్‌కు ఎక్కువగా కరిగే, నురగ వచ్చే స్వభావం ఉంటుంది. అందువల్ల దీన్ని పాలకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. శాకాహార పాలు, పెరుగు, ఛీజ్, వెన్న తయారుచేసుకోవచ్చు.
పాత వ్యాపారం కొత్తగా
పాత పుస్తకాలు, కాగితాలు, ప్లాస్టిక్ బాటిళ్ల వంటి వాటిని ఇంటింటికీ తిరిగి సేకరించేవారి గురించి తెలిసిందే. ఇప్పుడు ప్రత్యేకంగా దుకాణాలు కూడా వెలుస్తున్నాయి. ఇలాంటివారిని, పాత వస్తువులను కొనేవారిని అనుసంధానం చేస్తూ ఒకే వేదిక మీదికి తెస్తున్న సంస్థ రీసైకల్. యాప్ ద్వారా పనిచేసే ఇది 30కి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రోజుకు 10వేల మెట్రిక్ టన్నుల పాత వస్తువుల క్రయ విక్రయాలు సాగిస్తోంది. కావాల్సిన వారు అందుబాటులో ఉన్న వస్తువులను యాప్ జాబితాలో చూసుకొని ఆర్డర్ చేయొచ్చు. ధర కూడా ముందే నిర్ణయించి ఉంటుంది. ఒకవేళ పాత వస్తువులను అమ్మాలనుకుంటే వాటి ఫొటో, వివరాలను పోస్ట్ చేయొచ్చు. చెత్తే కదాని తీసిపారేయటానికి లేదు. నిపుణులు నాణ్యతను నిశితంగా పరిశీలిస్తారు. ఆ తర్వాతే సరఫరా చేస్తారు. సరుకు ఎక్కడ ఉందనేదీ యాప్‌లో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.
కార్మికులు-పరిశ్రమల వారధి
పెద్ద సంఖ్యలో కార్మికులు అవసరమైన పరిశ్రమలకు తోడ్పడుతున్న అంకుర సంస్థ వాహన్. ఇది వాట్సప్ ద్వారా పనిచేస్తుంది. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ‘మిత్రా’ అనే ఛాట్‌బోట్ దీనిలోని కీలకాంశం. ఇది పనుల కోసం వెతుకున్న కార్మికులకు.. అలాగే కార్మికుల కోసం చూస్తున్న పరిశ్రమలకు మధ్య అనుసంధాన వారధిగా ఉపయోగపడుతుంది. కేవలం సమాచారం ఇవ్వటమే కాదు.. కార్మికులు ఆయా ప్రాంతాలకు చేరుకునేలా, పని ఆరంభించేలా కూడా చూస్తుంది. అభ్యర్థుల అర్హతలనూ తనకు తానే తనిఖీ చేస్తుంది. పనికొచ్చేవారినే సూచిస్తుంది. ఇలా ఖర్చును తగ్గిస్తుంది. సమయాన్ని ఆదా చేస్తుంది. వందలాది రిక్రూట్‌మెంట్ వెండర్స్ మీద ఆధారపడటం తగ్గిస్తుంది. ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌తోనూ వాహన్ జతకట్టి పనిచేస్తోంది.
* వేలాది ట్రాన్స్‌పోర్ట్ సంస్థలు. లక్షలాది లావాదేవీలు. వీటన్నింటి డేటా ఆధారంగా సరకు పంపిణీ వ్యవస్థను నియంత్రించే సంస్థ పాండాకార్ప్. సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌తో రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తోంది.
* మధ్య, దిగువ ఆదాయ వర్గాలకు అత్యవసర సమయాల్లో చిన్నమొత్తం రుణాలు ఇస్తూ ఆదుకుంటున్న సంస్థ స్మార్ట్‌కాయిన్. మొబైల్ యాప్ రూపంలో పనిచేస్తుంది. పాన్‌కార్డు, ఆధార్ కార్డు వంటి పత్రాలతో ధ్రువీకరించుకొని రూ.1,000 నుంచి రూ.70,000 వరకు రుణాలు ఇస్తుంది. వీటిని 91 రోజుల నుంచి 270 రోజుల్లో తీర్చాల్సి ఉంటుంది. కనిష్ఠంగా 20%, గరిష్ఠంగా 36% వడ్డీ వసూలు చేస్తారు. ఆల్గోరిథమ్ సాయంతో ఈ యాప్ రుణం తీసుకునేవారు సకాలంలో చెల్లించగలరో లేదో ముందే అంచనా వేస్తుంది కూడా.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Lokesh Kanagaraj: సూర్య, కార్తిలతో ‘అయ్యప్పనుమ్ కోషియం’ చేస్తా: లోకేశ్ కనగరాజ్
-
Sports News
Scott Styris: భవిష్యత్తులో అతడిని టీమ్ఇండియా కెప్టెన్‌గా చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు: స్కాట్ స్టైరిస్
-
Technology News
Gift Ideas: రాఖీ పండగకి గిఫ్ట్ కొనాలా..? ₹5 వేల లోపు ధరలో ఉన్న వీటిపై ఓ లుక్కేయండి!
-
General News
Srisailam-Sagar: ఎగువ నుంచి వరద.. శ్రీశైలం, సాగర్ గేట్లు ఎత్తివేత
-
Movies News
AlluArjun: బన్నీ.. మీరు కెమెరా ముందుకొస్తే చాలు.. రూ.10 కోట్లు ఇస్తాం..!
-
India News
India Corona: దిల్లీలో 17.83 శాతానికి పాజిటివిటీ రేటు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?