Updated : 11 Aug 2022 14:54 IST

దొంగ చేతికి ఫోనా?

స్మార్ట్‌ఫోన్లంటే ఎవరికి ఇష్టముండదు? కాకపోతే ఖరీదు ఎక్కువ. అందుకే దొంగలనూ ఆకర్షిస్తుంటాయి. మరి దొంగల బారినపడకుండా ఫోన్లను కాపాడుకోవటమెలా?

మీ ఫోన్‌ ఎక్కడుంది? అని ఎవరినైనా అడిగి చూడండి. వెంటనే జేబు తడుము కుంటారు. లేదూ బ్యాగ్‌లో వెతుకుతారు. డెస్క్‌ మీద, టీవీ దగ్గర పెట్టామేమోనని చూస్తారు. ఎక్కడా కనిపించకపోతే? గుండె గుభేల్‌ మంటుంది. ఎవరు దొంగిలించారో అనే కంగారు మొదలవుతుంది. అవును. చాలాసార్లు ఫోన్‌ పోయినట్టయినా తెలియదు. దొంగల హస్త లాఘవం అలాంటిది. ప్రస్తుతం కాంటాక్టుల దగ్గర్నుంచి బ్యాంకు ఖాతాల వరకూ అన్నీ ఫోన్‌తో ముడిపడే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దొంగల చేతికి ఫోన్‌ చిక్కితే అంతే. కాబట్టి ఫోన్‌ను కంటికి రెప్పలా కాపాడుకోవటం తప్పనిసరి. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.


పిన్‌, బయోమెట్రిక్‌ రక్షణ

ఫోన్‌ను కొనగానే మొదట చేయాల్సిన పని ఇదే. అందరికీ తెలిసిన విషయమే అయినా కొందరు దీన్ని పెద్దగా పట్టించుకోరు. పిన్‌ను సెట్‌ చేసుకుంటే ఇతరులు తెరవటం కుదరదు. దీంతో కనీసం మన డేటా, ఫోన్‌తో ముడిపడిన అకౌంట్ల వివరాలు చోరుల చేతికి చిక్కకుండా చూసుకోవచ్చు. పిన్‌ కన్నా మెరుగైంది ఫింగర్‌ ప్రింట్‌, ఫేషియల్‌ రికగ్నిషన్‌ వంటి బయోమెట్రిక్‌ ఫీచర్లతో లాక్‌ చేసుకోవటం. ఇప్పుడు చాలా ఫోన్లు ఇలాంటి ఫీచర్లను అందిస్తున్నాయి. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో సెటింగ్స్‌ ద్వారా సెక్యూరిటీలోకి వెళ్లి ఫింగర్‌ ప్రింట్‌ను సెట్‌ చేసుకోవచ్చు. కావాలంటే సిమ్‌ కార్డుకూ పిన్‌ నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం సెక్యూరిటీ విభాగంలోని సిమ్‌ లాక్‌ ఫీచర్‌ను వాడుకోవచ్చు. ఐఫోన్‌లోనైతే సెటింగ్స్‌ ద్వారా ‘ఫేస్‌ ఐడీ అండ్‌ పాస్‌కోడ్‌’ను సెట్‌ చేసుకోవచ్చు.


మొబైల్‌ ట్రాకింగ్‌ సాయం

తొలిసారి ఫోన్‌ను సెట్‌ చేసుకుంటున్నప్పుడు మరో చక్కని అవకాశం ఫోన్‌ ట్రాకింగ్‌ సేవలతో ముడిపడిన ఖాతాను ఎనేబుల్‌ చేసుకోవటం. ఒకవేళ ఫోన్‌ కనిపించకపోతే దీని ద్వారా ఎక్కడుందో కనుక్కోవచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ‘ఫైండ్‌ మై డివైస్‌’.. ఐఫోన్లలో ‘ఫైండ్‌ మై’ ఫీచర్లు ఇందుకు ఉపయోగపడతాయి. ఫోన్‌ కొన్నప్పుడు దీన్ని సెట్‌ చేసుకోవటం మరచిపోయినా తర్వాత నిర్ణయించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో సెటింగ్స్‌లోని సెక్యూరిటీ విభాగంలో ‘ఫైండ్‌ మై డివైస్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకొని, లొకేషన్‌ ఆన్‌ చేస్తే చాలు. ఐఫోన్లలో సెటింగ్స్‌లోకి వెళ్లి పేరు మీద ట్యాప్‌ చేయాలి. తర్వాత ‘ఫైండ్‌ మై’ ఫీచర్‌ ద్వారా ‘ఫైండ్‌ మై ఐఫోన్‌’ను ఎంచుకొని, ‘షేర్‌ మై లొకేషన్‌’ను ఆన్‌ చేసుకోవాలి. ఆండ్రాయిడ్‌ వాడేవారు ఫైండ్‌ మై యాప్‌తో, ఐఫోన్‌ వాడేవారు యాపిల్‌ ఐ క్లౌడ్‌ ద్వారా ఫోన్‌ ఎక్కడుందో కనుక్కోవచ్చు.


యాంటీ థెఫ్ట్‌ యాప్‌

న్‌బిల్ట్‌గా వచ్చే ఫోన్‌ ట్రాకర్లు మాత్రమే కాదు. ప్రస్తుతం బోలెడన్ని యాంటీ థెఫ్ట్‌ యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. కావాలంటే వీటిని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఇవి ఫోన్లను ట్రాక్‌ చేయటమే కాదు.. తప్పుడు పిన్‌తో ఫోన్‌ను ఎవరైనా తెరవటానికి ప్రయత్నిస్తే వారి ఫొటోలనూ తీస్తాయి. పెద్ద శబ్దంతో బెదిరిపోయేలా చేసేవీ ఉన్నాయి.


యాంటీ థెఫ్ట్‌ ఫోన్‌ కేసు

ద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు తాడుతో కూడిన ఫోన్‌ కేసు వాడుకోవచ్చు. తాడును మెడలో వేసుకుంటే ఫోన్‌ భద్రంగా ఉంటుంది. ఎవరైనా దొంగిలించాలని ప్రయత్నిస్తే వెంటనే తెలుస్తుంది. బయట పరుగెత్తటం, వ్యాయామాలు చేయటానికి వెళ్లినప్పుడు చేతికి ధరించే ‘ఆర్మ్‌బ్యాండు’ వాడుకోవచ్చు. ఫోన్‌ను ఇందులో వేసుకొని, జిప్‌ బిగించి చేతికి ధరిస్తే భద్రంగా ఉంటుంది. తక్కువ బరువుతో సాగటానికి అనువుగా ఉండే దీనిలో బ్యాంకు కార్డులు, తాళం చెవుల వంటి చిన్న వస్తువులనూ వేసుకోవచ్చు.


అవకాశం ఇవ్వకుండా..

కొందరు దొంగలు ఖరీదైన ఫోన్లను కొట్టేయటానికి ముఠాగా ఏర్పడి, ముందుగానే ప్రణాళిక వేసుకుంటుంటారు. అందువల్ల రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇతరుల కంటికి ఫోన్‌ కనిపిచకుండా ముందుగానే జాగ్రత్త పడటం ఉత్తమం. కానీ అన్నిసార్లూ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇదే దొంగలకు అవకాశం కల్పిస్తుంది. ఫోన్‌ను కాజేయాలని నిర్ణయించుకున్న దొంగలు దృష్టిని మరల్చి పని కానిచ్చేస్తుంటారు. ఉదాహరణకు- టైం ఎంతయ్యిందని అడగొచ్చు. ఫోన్‌ను బయటకు తీయగానే లాక్కొని పోవచ్చు. కాబట్టి అపరిచితులు ఎవరైనా టైం ఎంతయ్యిందని అడిగితే తెలియదని చెప్పటమే మంచిది. బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో చుట్టుపక్కల పరిసరాల మీద ఓ కన్నేయాలి. బయటకు వెళ్లినప్పుడు ఎవరైనా కావాలని అనుసరిస్తున్నట్టు అనుమానిస్తే పక్కన ఏదైనా దుకాణంలో కాసేపు గడపటం మంచిది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని