Updated : 13 Jul 2022 16:03 IST

Computer : పాతవే.. ఇక కొత్తగా పని చేస్తాయ్‌!

ఇంట్లో పాత మ్యాక్‌బుక్‌ గానీ విండోస్‌ పీసీ గానీ మూలకు పడి ఉన్నాయా? ఇంకా పనిచేసే స్థితిలో ఉన్నాయా? అయితే గూగుల్‌ ఇటీవల విడుదల చేసిన క్రోమ్‌ ఓఎస్‌ ఫ్లెక్స్‌తో వాటికి కొత్త ప్రాణం పోయండి. పాత ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లను తిరిగి వాడుకోవటానికి, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను తగ్గించటానికిది బాగా ఉపయోగపడుతుంది.

డిజిటల్‌ పరికరాలు పాతవైనా పక్కన పడేయటానికి చాలాసార్లు మనసొప్పదు. ఎంతో ఖర్చుపెట్టి, ముచ్చటపడి కొనుక్కున్నవాయె. అలాగని ఎలాగోలా వాటితో నెట్టుకొద్దామంటే వేగంగా పనిచేయవు. ఇలాంటి పరిస్థితుల్లో క్రోమ్‌ ఓఎస్‌ ఫ్లెక్స్‌ను ఒక వరంగా భావించొచ్చు. ఇది పాత సిస్టమ్‌లోని ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను క్రోమ్‌ ఓఎస్‌తో మార్చేస్తుంది. అధునాతన యాప్స్‌ రన్‌ కావటానికి తాజా హార్డ్‌వేర్‌ లేని పీసీలను వాడుకునేలా మార్చేస్తుంది. అవి వేగంగా, ఎక్కువ కాలం పనిచేసేలా తీర్చిదిద్దుతుంది.

క్లౌడ్‌ ఆధారితం

క్రోమ్‌ ఓఎస్‌ ఫ్లెక్స్‌ అనేది క్లౌడ్‌-ఫస్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ మీద ఆధారపడటం వల్ల సాఫ్ట్‌వేర్‌ చాలా సరళంగా ఉంటుంది. నెవర్‌వేర్‌ సంస్థ రూపొందించిన క్లౌడ్‌రెడీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ మీద పనిచేస్తుంది. ఇది పాత పీసీ, మ్యాక్‌లను క్రోమ్‌బుక్‌గా మారుస్తుంది. క్రోమ్‌ ఓఎస్‌ ఫ్లెక్స్‌ను అత్యంత భద్రంగా ఉండేలా రూపొందించారు. అందువల్ల దీనికి ఎలాంటి యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ అవసరముండదు. యూఈఎఫ్‌ఐ సెక్యూరిటీ బూట్‌ను సపోర్టు చేసే దీన్ని గూగుల్‌ అడ్మిన్‌ కన్సోల్‌తో తేలికగా నిర్వహించొచ్చు. ఇన్‌స్టాల్‌ చేయకుండానే యూఎస్‌బీ డ్రైవ్‌తో నేరుగా పనిచేసుకోవచ్చు.

కంపాటబిలిటీ ఇదీ..

దీనికి 64-బిట్‌ ఇంటెల్‌ లేదా ఏఎండీ సీపీయూ, 16 జీబీ యూఎస్‌బీ డ్రైవ్‌ అవసరం. యూఎస్‌బీ నుంచి బూటింగ్‌ అవటానికీ పీసీ సపోర్టు చేయాల్సి ఉంటుంది. బీఐఓఎస్‌/యూఈఎఫ్‌ఐ సెటింగ్స్‌కు అడ్మినిస్ట్రేటివ్‌ యాక్సెస్‌ కూడా ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం.

ఎలా వాడుకోవాలి?

* ముందుగా క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌ నుంచి క్రోమ్‌బుక్‌ రికవరీ యుటిలిటీ ఎక్స్‌టెన్షన్‌ను కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. దీన్నిhttps://chrome.google.com/webstore/detail/chromebook-recoveryutili/ pocpnlppkickgojjlmhdmidojbmbodfmhl=en-GB లింక్‌ నుంచి పొందొచ్చు. పేజీ ఓపెన్‌ అయ్యాక ‘యాడ్‌ టు క్రోమ్‌’ బటన్‌ మీద క్లిక్‌ చేయాలి.

* కంప్యూటర్‌లో యూఎస్‌బీ డ్రైవ్‌ను ఇన్‌సర్ట్‌ చేయాలి. ఇందులో ముఖ్యమైన సమాచారమేదీ లేకుండా చూసుకోవాలని మరవద్దు.

* అనంతరం క్రోమ్‌లో పైన కుడివైపున జిగ్‌సా పజిల్‌ మాదిరిగా కనిపించే ఎక్స్‌టెన్షన్స్‌ లైబ్రరీని ఓపెన్‌ చేయాలి. క్రోమ్‌బుక్‌ రికవరీ యుటిలిటీ మీద క్లిక్‌ చేయాలి. దీని మొదటి పేజీలో కుడివైపు అడుగున కనిపించే ‘గెట్‌ స్టార్టెడ్‌’ మీద క్లిక్‌ చేయాలి.

* తర్వాత స్క్రీన్‌ మీద ‘సెలెక్ట్‌ ఎ మోడల్‌ ఫ్రమ్‌ ఎ లిస్ట్‌’ మీద క్లిక్‌ చేయాలి. డ్రాప్‌ డౌన్‌ మెనూ ద్వారా తయారీ సంస్థకు ‘గూగుల్‌ క్రోమ్‌ ఓఎస్‌ ఫ్లెక్స్‌’ను, ప్రొడక్ట్‌కు ‘క్రోమ్‌ ఓఎస్‌ ఫ్లెక్స్‌ (డెవలపర్‌-అన్‌స్టేబుల్‌)’ను ఎంచుకోవాలి. తర్వాత ‘కంటిన్యూ’ మీద క్లిక్‌ చేయాలి.

* అప్పుడు పక్క స్క్రీన్‌లో యూఎస్‌బీ ఫ్లాష్‌ డ్రైవ్‌ లేదా ఎస్‌డీ కార్డును ఇన్‌సర్ట్‌ చేయమని సందేశం కనిపిస్తుంది. అప్పటికే యూఎస్‌బీ డ్రైవ్‌ను ఇన్‌సర్ట్‌ చేసి ఉండటం వల్ల దీన్ని ఎంచుకొని ‘కంటిన్యూ’ బటన్‌ను నొక్కాలి.

* తర్వాత పేజీలో కుడివైపు అడుగున ఉండే ‘క్రియేట్‌ నౌ’ మీద క్లిక్‌ చేయాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది. ఇది పూర్తయ్యాక ‘డన్‌’ బటన్‌ మీద నొక్కాలి.

* పీసీ బూట్‌ విధానాన్ని మార్చటం చాలా ముఖ్యం. అందువల్ల కంప్యూటర్‌ ఓపెన్‌ అవుతున్నప్పుడు బూట్‌ మెనూలోకి వెళ్లటానికి తోడ్పడే ఎస్కేప్‌, ఎఫ్‌2, ఎఫ్‌10, ఎఫ్‌12 మీటలను (పీసీ మోడల్‌ను బట్టి) నొక్కాలి. బయోస్‌లోకి వెళ్లాక బూట్‌ ప్రయారిటీని చూడటానికి, మార్చటానికి తోడ్పడే మెనూ లేదా ఆప్షన్‌ను గుర్తించాలి. జాబితాలో అన్నింటికన్నా మీద యూఎస్‌బీ ఉండేలా క్రమాన్ని మార్చుకోవాలి.

* యూఎస్‌బీ డ్రైవ్‌ నుంచి బూట్‌ కావటానికి మ్యాక్‌లో కమాండ్‌, ఆర్‌ మీటలను కలిపి నొక్కాలి. తర్వాత ‘స్టార్టప్‌ సెక్యూరిటీ యుటిలిటీ’ ద్వారా ‘అలో బూటింగ్‌ ఫ్రమ్‌ ఎక్స్‌టర్నల్‌ ఆర్‌ రిమూవబుల్‌ మీడియా’ను ఎంచుకోవాలి. అనంతరం రీస్టార్ట్‌ చేయాలి. ఈ సమయంలో ఆప్షన్‌ మీటను కిందికి నొక్కి పట్టుకోవాలి. క్రోమ్‌ ఓఎస్‌ ఫ్లెక్స్‌ డ్రైవ్‌ను ఎంచుకోవాలి.

* దీంతో బూటప్‌ అయ్యి పీసీ పనిచేయటం ఆరంభిస్తుంది. సైన్‌ఇన్‌ అయితే చాలు. క్రోమ్‌బుక్‌ మాదిరిగా నిక్షేపంగా వాడుకోవచ్చు.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts