మహా మహా కంప్యూటర్‌

రోజురోజుకీ సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందుతోంది. మనిషి తొలిసారి చంద్రుడి మీద కాలు మోపినప్పుడు వాడుకున్న పరిజ్ఞానాన్ని ప్రస్తుత ప్రమాణాలతో పోల్చి చూస్తే నవ్వు వస్తుంది. అవును మరి.  అపోలో 11 ప్రయోగానికి నాసా ఉపయోగించిన కంప్యూటింగ్‌ వ్యవస్థ

Published : 10 Aug 2022 00:47 IST

రోజురోజుకీ సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందుతోంది. మనిషి తొలిసారి చంద్రుడి మీద కాలు మోపినప్పుడు వాడుకున్న పరిజ్ఞానాన్ని ప్రస్తుత ప్రమాణాలతో పోల్చి చూస్తే నవ్వు వస్తుంది. అవును మరి.  అపోలో 11 ప్రయోగానికి నాసా ఉపయోగించిన కంప్యూటింగ్‌ వ్యవస్థ కన్నా మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌ పరిజ్ఞానం లక్షలాది రెట్లు ఎక్కువ శక్తిమంతమైంది, సమర్థమైంది. పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పుడు సూపర్‌ కంప్యూటర్లూ అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి, డేటా నిర్వహణకు, అతి వేగంగా పనులు పూర్తి చేయటానికివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇంతకీ సూపర్‌ కంప్యూటర్‌ అంటే ఏంటి? వీటి ప్రాముఖ్యతేంటి?

మామూలు కంప్యూటర్‌ మాదిరిగానే సూపర్‌ కంప్యూటర్‌ కూడా సమాచార నిక్షిప్తం, విశ్లేషణ వంటి పనులే చేస్తుంది. కాకపోతే వీటి వేగం, సామర్థ్యం అనూహ్యం. పేరుకు తగ్గట్టుగానే భారీవి కూడా. సూపర్‌ కంప్యూటర్‌లో బోలెడన్ని ప్రాసెసింగ్‌ యూనిట్ల సముదాయాలుంటాయి. ఇవి సాధారణ ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ల కన్నా కోట్లాది రెట్ల వేగంతో పనులు చేసేస్తాయి. పాత కంప్యూటర్లను ఐపీఎస్‌(ఇన్‌స్ట్రక్షన్స్‌ పర్‌ సెకండ్‌)లో కొలిస్తే.. సూపర్‌ కంప్యూటర్లను ఫ్లాప్స్‌ (ఫ్లోటింగ్‌ పాయింట్‌ పర్‌ సెకండ్‌) పరిమాణంలో కొలుస్తారు. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే సూపర్‌ కంప్యూటర్‌ అంత శక్తిమంతంగా ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి ప్రపంచంలో అతి వేగంగా పనిచేసే సూపర్‌ కంప్యూటర్‌ అమెరికాలోని టెన్నెసీలో ఉంది. దీని పేరు ఫ్రాంటియర్‌. మొత్తం 74 భాగాలతో (కేబినెట్లు) కూడుకొని ఉంటుంది. ఒకో కేబినెట్‌ బరువు 4వేల కిలోలకు పైనే. ఇది ఇటీవలే జపాన్‌ సూపర్‌ కంప్యూటర్‌ ఫుగాకును తలదన్ని అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌గా కీర్తికెక్కింది. ప్రపంచంలో మొట్టమొదటి ఎగ్జాస్కేల్‌ సూపర్‌ కంప్యూటర్‌ ఫ్రాంటియరే. అంటే ఒక సెకండుకు క్వింటిలియన్‌ (10వేల కోట్ల కోట్ల) ఫ్లోటింగ్‌ పాయింట్‌ గణాంకాలు చేస్తుంది. మనదేశమూ పరమ్‌ పేరుతో సూపర్‌ కంప్యూటర్లను అభివృద్ధి చేసింది. ఈ క్రమంలో మొదటిది పరమ్‌ 8000. దీన్ని 1991లో ప్రొఫెసర్‌ విజయ్‌ భట్కర్‌ రూపొందించారు. అప్పట్లో రెండో అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌ ఇదే. ఇప్పటివరకు 16 పరమ్‌ సూపర్‌ కంప్యూటర్లను అభివృద్ధి చేశారు. తాజాగా ఐఐటీ గాంధీనగర్‌లో పరమ్‌ అనంత సూపర్‌ కంప్యూటర్‌ను ఆవిష్కరించారు. ఇది గరిష్ఠంగా సెకండకు 838 లక్షల కోట్ల వేగంతో గణిస్తుంది.

వివిధ అవసరాలకు

పెద్ద మొత్తంలో డేటా ప్రాసెసింగ్‌ అవసరమైన ఏ రంగంలోనైనా సూపర్‌ కంప్యూటర్లను వాడుకోవచ్చు. ఇందుకు కొన్ని ఉదాహరణలు..

వాతావరణ అంచనా: పెద్దమొత్తంలో వాతావరణ సమాచారాన్ని సేకరించటం.. దాన్ని విశ్లేషించటం.. పాత అంచనాలను పోల్చి చూడటం ద్వారా వాతావరణాన్ని కచ్చితంగా, త్వరగా అంచనా వేయటానికి సూపర్‌ కంప్యూటర్లు బాగా ఉపయోగపడతాయి. వాతావరణ మార్పు ప్రభావాలను అర్థం చేసుకోవటానికి, వీటి నివారణకు తోడ్పడే మార్గాలను గుర్తించటానికీ వీటిని వాడుకోవచ్చు. కేవలం దీని కోసమే మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఒక సూపర్‌ కంప్యూటర్‌ను తయారుచేస్తోంది.

రన్నింగ్‌ సిమ్యులేషన్లు: కొత్తగా ఒక విమానాన్ని రూపొందిస్తున్నారనుకోండి. గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు వాతావరణం ఎంతమేరకు వెనక్కి నెడుతోంది, మరింత తేలికగా ప్రయాణించటానికి ఆకారాన్ని మార్చాలా అనేవి ముందే తెలుసుకోగలిగితే? విమానాలను మరింత సురక్షితంగా, తక్కువ ఇంధనంతో నడిచేలా తీర్చిదిద్దొచ్చు. ఇందుకు రన్నింగ్‌ సిమ్యులేషన్‌ విధానం తోడ్పడుతుంది. సూపర్‌ కంప్యూటర్లు దీనికి బాగా ఉపయోగపడతాయి. అణు పరీక్షలు, ప్రయోగాల వంటివీ సిమ్యులేషన్‌లో నిర్వహించొచ్చు. దీంతో సామాగ్రి, డబ్బు ఆదా అవుతాయి. పర్యావరణ నష్టాలనూ తప్పించుకోవచ్చు.

శాస్త్రీయ పరిశోధనలు: అధ్యయనాలు, పరిశోధనల కోసం శాస్త్రవేత్తలు పెద్దఎత్తున సమాచారాన్ని విశ్లేషిస్తుంటారు. దీన్ని సూపర్‌ కంప్యూటర్లతో తేలికగా, వేగంగా పూర్తి చేయొచ్చు. ఉదాహరణకు- కొవిడ్‌ విజృంభించినప్పుడు వైరస్‌తో పోరాటంలో ఐబీఎం సూపర్‌ కంప్యూటర్‌ సమిట్‌ ఎంతగా తోడ్పడిందో. పెద్ద మొత్తంలో గణనలు చేయటం దగ్గర్నుంచి మందుల మూలకాలను విశ్లేషించటం వరకూ చాలా పనుల్లో పరిశోధకులు దీన్ని ఉపయోగించుకున్నారు. భూమి చుట్టూ గాలి, నీటి కదలికలను సిమ్యులేట్‌ చేయటం ద్వారా నాసా శాస్త్రవేత్తలు భూ వాతావరణాన్నీ అధ్యయనం చేస్తున్నారు. సౌర మండలం ఆవలి గ్రహాలను గుర్తించటం, కృష్ణబిలాలను అధ్యయనం చేయటం, వ్యోమనౌకల రూపకల్పన వంటి వాటికీ సూపర్‌ కంప్యూటర్లు ఉపయోగపడుతున్నాయి.

మన జేబుల్లోనూ..

ప్రతి రెండేళ్లకు కంప్యూటర్ల వేగం రెట్టింపు అవుతుందని చెప్పే మూర్‌ సూత్రం గురించి తెలిసే ఉంటుంది. అంటే కంప్యూటర్లలోని ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్ల ప్రాసెసింగ్‌ శక్తి గణనీయంగా పెరుగుతూ వస్తోందన్నమాట. దీంతో ఒకప్పుడు అసాధ్యమనుకున్న పనులన్నీ ఇప్పుడు తేలికగా మారిపోయాయి. పదేళ్ల క్రితం వర్చువల్‌ రియాలిటీ, క్లౌడ్‌ గేమింగ్‌, మెటావర్స్‌ వంటివి కేవలం భావనలే. కానీ అవే ఇప్పుడు నిజమయ్యాయి. ఇలాంటి అధునాతన పరిజ్ఞానాలను అందుకోవటానికి మనం నిపుణులమే కానవసరం లేదు. మనకు తెలియకుండానే ఇవన్నీ మన జీవితంలో భాగమైనా ఆశ్చర్యపోనవసరం లేదు. అందువల్ల ఏదో ఒకనాడు సూపర్‌ కంప్యూటర్‌ మన జేబుల్లోనే ఇమిడిపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని