పీసీ రక్షణకు 7 టూల్స్‌!

కంప్యూటర్‌తో ఎన్ని పనులో! వెబ్‌ బ్రౌజింగ్‌ చేస్తాం. వర్డ్‌లో రాసుకుంటాం. పీడీఎఫ్‌ పైళ్లు సృష్టిస్తాం. ఫొటోలు దాచుకుంటాం. సినిమాలు చూస్తాం. సంగీతం వింటాం. గేమ్స్‌ ఆడతాం. ఇలా చెప్పుకొంటూ పోతే జాబితా చాలా పెద్దగానే ఉంటుంది.

Updated : 24 Aug 2022 17:42 IST

కంప్యూటర్‌తో ఎన్ని పనులో! వెబ్‌ బ్రౌజింగ్‌ చేస్తాం. వర్డ్‌లో రాసుకుంటాం. పీడీఎఫ్‌ పైళ్లు సృష్టిస్తాం. ఫొటోలు దాచుకుంటాం. సినిమాలు చూస్తాం. సంగీతం వింటాం. గేమ్స్‌ ఆడతాం. ఇలా చెప్పుకొంటూ పోతే జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. కానీ పీసీ మెయింటెనెన్స్‌ గురించే పెద్దగా పట్టించుకోం. ఎక్కువ కాలం, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పీసీ పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఇందుకు కొత్త సాఫ్ట్‌వేర్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన పనేమీ లేదు. విండోస్‌ అప్లికేషన్స్‌తోనే కంప్యూటర్‌ వేగాన్ని కాపాడుకోవచ్చు. సమస్యలను పరిష్కరించేవి, పీసీని కాపాడేవి ఎన్నో టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ట్రబుల్‌షూటింగ్‌
ప్రింటర్‌, ఇంటర్నెట్‌, యూఎస్‌బీ డ్రైవ్‌ల వంటి పీసీ భాగాలు సరిగా పనిచేయనట్టయితే ముందుగా ఆలోచించాల్సింది ట్రబుల్‌షూటింగ్‌ గురించే. కంట్రోల్‌ ప్యానెల్‌, విండోస్‌ సెటింగ్స్‌ ద్వారా ఇలాంటి బిల్టిన్‌ ట్రబుల్‌షూటర్లను వాడుకోవచ్చు. కంట్రోల్‌ ప్యానెల్‌లో ట్రబుల్‌షూటింగ్‌ అని సెర్చ్‌ చేస్తే ట్రుబుల్‌షూటింగ్‌ కంప్యూటర్‌ ప్రాబ్లమ్స్‌ విభాగం కనిపిస్తుంది. ఆయా సమస్యలకు సంబంధించిన అంశాన్ని ఎంచుకొని క్లిక్‌ చేయాలి. అప్పుడు వివిధ పరిష్కారాలు, ఇందుకోసం అనుసరించాల్సిన సూచనలు కనిపిస్తాయి. వీటిని పూర్తి చేయగానే విండోస్‌ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తుంది. లేదా ఇతర పరిష్కార మార్గాలను సూచిస్తుంది. విండోస్‌లో అందుబాటులో ఉన్న అన్ని ట్రబుల్‌షూటర్స్‌ను చూడాలనుకుంటే విండోస్‌ సెటింగ్స్‌లోకి వెళ్లాలి. ఇందులో అప్‌డేట్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం ద్వారా ట్రబుల్‌షూట్‌లోకి వెళ్లి అడిషనల్‌ ట్రబుల్‌షూటర్‌ను ఎంచుకోవాలి. అప్పుడు మొత్తం ట్రబుల్‌షూటర్ల జాబితా కనిపిస్తుంది. దేనినైనా రన్‌ చేయాలనుకుంటే దానిపై క్లిక్‌ చేసి, రన్‌ ట్రబుల్‌షూటర్‌ బటన్‌ను నొక్కితే చాలు. సమస్య తేలికైందా? తీవ్రమైందా? అనేది తెలుసుకోవటానికిది చక్కటి టూల్‌. తేలికైనదైతే ఆయా సూచనలతో పరిష్కరించుకోవచ్చు. తీవ్రమైనదైతే టెక్నీషియన్‌ సాయం తీసుకోవాల్సిందే.

డిస్క్‌ డీఫ్రాగ్మెంటర్‌
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుత హార్డ్‌ డ్రైవ్‌లు చాలా సమర్థంగా ఉంటున్నాయి. అందువల్ల పాత విండోస్‌ వర్షన్లలో మాదిరిగా ఇప్పుడు డీఫ్రాగ్మెంటింగ్‌ పెద్దగా ఉపయోగపడటం లేదు. అయినా కూడా పీసీ వేగాన్ని పెంచటంలో ఎంతో కొంత తోడ్పడే అవకాశం లేకపోలేదు. ఇందుకు ఎన్నో థర్డ్‌పార్టీ టూల్స్‌ ఉన్నప్పటికీ విండోస్‌లో డిఫాల్ట్‌గా వచ్చే డిస్క్‌ డీఫ్రాగ్మెంటర్‌ తక్కువదేమీ కాదు. పీసీ పనితీరు మెరుగుపడటానికిది బాగా ఉపయోగపడుతుంది. విండోస్‌ గుర్తును క్లిక్‌ చేసి సెర్చ్‌ బాక్స్‌ ద్వారా దీన్ని వెతకొచ్చు. టూల్‌ను ఓపెన్‌ చేసి అనలైజ్‌ లేదా ఆప్టిమైజ్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. అప్పుడు ఏ డ్రైవ్‌ను డీఫ్రాగ్మెంట్‌ చేయాలో అడుగుతుంది. దాన్ని ఎంచుకంటే డీఫ్రాగ్మెంట్‌ చేసి పెడుతుంది. కావాలంటే ఆటోమేటిక్‌గా డీఫ్రాగెంట్‌ చేసేలా సమయాన్నీ నిర్ణయించుకోవచ్చు. దీంతో మన ప్రమేయమేమీ లేకుండానే ఆ సమయానికి పని చేసేస్తుంది.

ఫైల్‌ హిస్టరీ బ్యాకప్‌
ఫైల్‌ హిస్టరీ పేరును బట్టి ఇది ఫైళ్ల గత వర్షన్లను రిస్టోర్‌ మాత్రమే చేస్తుందని భావిస్తుంటారు. నిజానికిది పూర్తిస్థాయి బ్యాకప్‌ టూల్‌. పీసీకి ఎక్స్‌టర్నల్‌ డ్రైవ్‌ను కనెక్ట్‌ చేసి, బ్యాకప్‌ చేసుకోవాలని అనుకుంటున్న ఫైళ్లను ఎంచుకోవచ్చు. ఎప్పుడెప్పుడు బ్యాకప్‌ కావాలో కూడా నిర్ణయించుకోవచ్చు. విండోస్‌ 10లోనైతే స్టార్ట్‌ ద్వారా సెటింగ్స్‌లోకి వెళ్తే అప్‌డేట్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం కనిపిస్తుంది. దీన్నుంచి బ్యాకప్‌లోకి అక్కడ్నుంచి బ్యాకప్‌ యూజింగ్‌ ఫైల్‌ హిస్టరీని ఎంచుకోవాలి. దీంతో డిఫాల్ట్‌ ఫోల్డర్లు వాటంతటవే బ్యాకప్‌ అవుతాయి. వద్దనుకుంటే వాటిని డిలీట్‌ చేసుకోవచ్చు. కావాలంటే కొత్తవి యాడ్‌ చేసుకోవచ్చు. డ్రైవ్‌లో స్టోరేజీ పరిమితి ఒక్కటే అడ్డంకి. పెద్ద స్టోరేజీ ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

సిస్టమ్‌ రిస్టోర్‌
ఏదైనా ప్రోగ్రామ్‌, డ్రైవర్‌ ఇన్‌స్టాల్‌ చేశాక సమస్యలు తలెత్తినప్పుడు సిస్టమ్‌ రిస్టోర్‌ వరంలా ఉపయోగపడుతుంది. ఇది నిర్ణయించుకున్న సమయంలో ఉన్నట్టుగా పీసీని సేవ్‌ చేసి పెడుతుంది. ఏదైనా పొరపాటు జరిగితే తేలికగా పాత స్థితికి తీసుకొస్తుంది. విండోస్‌ 10లో సిస్టమ్‌ రిస్టోర్‌ను మనమే యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రోగ్రామ్‌లు ఇన్‌స్టాల్‌ అయినప్పుడే ఆటోమేటిక్‌ సిస్టమ్‌ రిస్టోర్‌ సయమాన్ని క్రియేట్‌ చేస్తుంటాయి. మైక్రోసాఫ్ట్‌ సూచనల ద్వారా సిస్టమ్‌ రిస్టోర్‌ను ఎలా క్రియేట్‌ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. ఒకసారి దీన్ని క్రియేట్‌ చేసుకుంటే సిస్టమ్‌ను రిస్టోర్‌ చేసినప్పుడు ఆ సమయం వరకు ఉన్న ఫైళ్లు అలాగే ఉంటాయి.

విండోస్‌ రిలయబిలిటీ మానిటర్‌
మనం గుర్తించలేకపోవచ్చు గానీ విండోస్‌ తనకు తానే అన్ని హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ మార్పులను రికార్డు చేసి పెట్టుకుంటుంది. విండోస్‌ రిలయబిలిటీ మానిటర్‌ కోసం వీటిని సేవ్‌ చేసుకుంటుంది. దీని ద్వారా సిస్టమ్‌ ఎలా పనిచేస్తోంది? ఏవైనా సమస్యలొస్తే ఎలా పరిష్కరిస్తోంది? అనేవి చూసుకోవచ్చు. దీన్ని చేరుకోవాలంటే కంట్రోల్‌ ప్యానెల్‌లోకి వెళ్లి సెక్యూరిటీ అండ్‌ మెయింటెనెన్స్‌ కోసం సెర్చ్‌ చేయాలి. మెయింటెనెన్స్‌ విభాగంలో వ్యూ రిలయబిలిటీ హిస్టరీ మీద క్లిక్‌ చేయాలి. అప్పుడు రిలయబిలిటీ మానిటర్‌ రిపోర్టును సృష్టిస్తుంది. దీంతో ఇటీవల ఎదురైన ఎర్రర్స్‌, క్రాషెస్‌కు సంబంధించి టెక్నికల్‌ వివరాలనూ చూసుకోవచ్చు.

విండోస్‌ సిస్టమ్‌ ఇమేజ్‌
సిస్టమ్‌ ఇమేజ్‌ టూల్‌ను విండోస్‌కు కాపీ అనుకోవచ్చు. ఇందులో ప్రోగ్రామ్స్‌, ఫైల్స్‌, సిస్టమ్‌ సెటింగ్స్‌ కాపీలన్నీ ఉంటాయి. దీన్ని డీవీడీలో లేదా ఎక్స్‌టర్నల్‌ డ్రైవ్‌లో స్టోర్‌ చేసుకోవచ్చు. పీసీ ఎప్పుడైనా క్రాష్‌ అయినప్పుడు బూట్‌ చేసుకోవటానికి వాడుకోవచ్చు. డిస్క్‌ ఇమేజెస్‌ను క్రియేట్‌ చేసుకునే విధానం విండోస్‌ 7, విండోస్‌ 8.1, 10లకు వేర్వేరుగా ఉంటుందని గమనించాలి.

విండోస్‌ మెమరీ డయగ్నాస్టిక్స్‌ టూల్‌
పీసీ సమస్యను గుర్తించినప్పుడు ఇది తనకు తానే రన్‌ అవుతుంది. ఒకవేళ ఏదైనా సమస్య ఉందని అనుమానం వచ్చినప్పుడు మనమే రన్‌ చేసుకోవచ్చు. మెమరీని చెక్‌ చేసుకోవచ్చు. విండోస్‌, ఆర్‌ కీలను ఒకేసారి కలిపి నొక్కితే రన్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో mdsched అని టైప్‌ చేసి ఎంటర్‌ను నొక్కాలి. అప్పుడు ఒక విండో ఓపెన్‌ అవుతుంది. వెంటనే టూల్‌ రన్‌ కావాలా? లేకపోతే తర్వాత బూట్‌ చేసినప్పుడు రన్‌ కావాలా? అనేది ఎంచుకోవాలి. ఈ టూల్‌ ఏదైనా సమస్యను గుర్తిస్తే పీసీ తయారీ సంస్థను సంప్రదించాలని మైక్రోసాఫ్ట్‌ సూచిస్తోంది. ఎందుకంటే మెమరీ సమస్యలు చాలావరకు మెమరీ చిప్స్‌ లేదా ఇతర హార్డ్‌వేర్‌ భాగాలతో ముడిపడి ఉంటుంటాయి. పీసీ ఇంకా వారంటీ సమయంలో ఉన్నట్టయితే మార్చుకోవటానికీ ఇది ఉపయోగపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని