ద్రవ గోలీలతో మందు చేరవేత

జబ్బు చేసినప్పుడు మందులు వేసుకోవటం తెలిసిందే. ఇవి రక్తంలో కలిసి శరీరమంతా ప్రవహిస్తాయి. అవసరమైన చోటుకు చేరుకున్న మందు ప్రభావం చూపుతుంది.

Published : 03 May 2023 00:03 IST

బ్బు చేసినప్పుడు మందులు వేసుకోవటం తెలిసిందే. ఇవి రక్తంలో కలిసి శరీరమంతా ప్రవహిస్తాయి. అవసరమైన చోటుకు చేరుకున్న మందు ప్రభావం చూపుతుంది. మిగతా మందు అంతా దాదాపు పనికిరాకుండానే పోతుందని అనుకోవచ్చు. మరి అవసరమైన చోట, అవసరమైన మోతాదులోనే మందును విడుదల చేస్తే? ఐఐటీ గువహటి పరిశోధకులు అలాంటి వినూత్న పరిజ్ఞానంతోనే ద్రవ గోలీలను సృష్టించారు. వీటిని మందులను మోసుకెళ్లేలా తీర్చిదిద్దొచ్చు. రసాయన చర్యల ప్రభావాలను గుర్తించటానికీ వాడుకోవచ్చు. సాధారణంగా జబ్బుల చికిత్స కోసం మాత్రలు, గొట్టాలు, సిరప్‌లు, పూత మందులు వాడుతుంటాం. వీటి కన్నా నియంత్రిత పద్ధతిలో మందును వెలువరించే విధానం మరింత సమర్థంగా పనిచేస్తుంది. ఇది నిజంగా అవసరమైన చోట.. అదీ నిర్ణీత మోతాదులో, నియమిత కాలం వరకే మందును విడుదల చేస్తుంది. అయితే ద్రవ రూపంలో మందును చేరవేయటం అంత తేలికైన పని కాదు. తాజా ద్రవ గోలీలు దీన్ని కూడా సాధించటం విశేషం. ఇవి మామూలు బిందువుల మాదిరిగా వేటికీ అంటుకోవు. తడవవు కూడా. వీటిని నీటికి అంటుకోని అతి సూక్ష్మ రేణువులతో సృష్టించారు మరి. నీటి కొలనులో వేసినప్పుడు ఇవి దొర్లుకుంటూ వెళ్తాయి. చిట్లిపోకుండా తేలుతాయి. వీటి మీదుండే నానో మట్టి పొర స్వభావాన్ని మార్చటం ద్వారా ఎప్పుడు, ఎంతసేపు మందును విడుదల చేయాలో నిర్ణయించారు. ఈ సమయాన్ని కొద్ది సెకండ్ల దగ్గర్నుంచి కొద్ది గంటల వరకూ కొనసాగించే వీలుండటం గమనార్హం. ఒకరకంగా ఇది టైమ్‌ బాంబ్‌ మాదిరిగా నిర్ణీత సమయానికి ‘పేలి’ మందును వెలువరిస్తుందన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని