వై-ఫై క్షేమమా!

ఒడిలో ల్యాప్‌టాప్‌. చేతిలో మొబైల్‌ ఫోన్‌. బల్ల మీద డెస్క్‌టాప్‌. గోడకు స్మార్ట్‌ టీవీ. ప్రస్తుతం ఇళ్లన్నీ ఇలాంటి డిజిటల్‌ పరికరాలతోనే శోభిల్లుతున్నాయి. వై-ఫై నెట్‌వర్క్‌తో వీటిని వాడుకోవటం పరిపాటిగానూ మారింది.

Updated : 14 Jun 2023 12:54 IST

ఒడిలో ల్యాప్‌టాప్‌. చేతిలో మొబైల్‌ ఫోన్‌. బల్ల మీద డెస్క్‌టాప్‌. గోడకు స్మార్ట్‌ టీవీ. ప్రస్తుతం ఇళ్లన్నీ ఇలాంటి డిజిటల్‌ పరికరాలతోనే శోభిల్లుతున్నాయి. వై-ఫై నెట్‌వర్క్‌తో వీటిని వాడుకోవటం పరిపాటిగానూ మారింది. వైర్‌లెస్‌తో అనుసంధానమయ్యే డిజిటల్‌ పరికరాల వినియోగం చాలా వేగంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో హోం నెట్‌వర్క్‌ భద్రతకూ ప్రాధాన్యం ఏర్పడింది. అలాగని వై-ఫై నెట్‌వర్క్‌ భద్రతను కాపాడుకోవటానికి టెక్‌ నైపుణ్యం సాధించాల్సిన పనేమీ లేదు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చాలు.


డిఫాల్ట్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ మార్చుకోవటం
ముందుగా చేయాల్సింది డిఫాల్ట్‌ నేమ్‌ (ఎస్‌ఎస్‌ఐడీ), పాస్‌వర్డ్‌ మార్చుకోవటం. వైర్‌లెస్‌ రూటర్ల కంపెనీలు డిఫాల్ట్‌గా ఎస్‌ఎస్‌ఐడీ సదుపాయాన్ని కల్పిస్తాయి. చాలావరకు ఇది కంపెనీ పేరు అయ్యుంటుంది. వైర్‌లెస్‌ కనెక్టెడ్‌ పరికరాలు చుట్టుపక్కల వై-ఫై నెట్‌వర్క్‌లను వెతికేటప్పుడు ప్రతీ నెట్‌వర్క్‌ను ఎస్‌ఎస్‌ఐడీ జాబితా రూపంలోనే చూపిస్తాయి. హ్యాకర్లు మన నెట్‌వర్క్‌లో చొరబడటానికిది అవకాశం కల్పించొచ్చు. కాబట్టి వ్యక్తిగత వివరాలు అవతలివారికి తెలియకుండా ఉండేందుకు ఎస్‌ఎస్‌ఐడీని మార్చుకోవటం మంచిది. ఇందుకోసం కంప్యూటర్‌ లేదా మొబైల్‌ఫోన్‌లో వెబ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి అడ్రస్‌ బార్‌లో రూటర్‌ ఐపీ అడ్రస్‌ను టైప్‌ చేసి, ఎంటర్‌ చేయాలి. మెనూలో వైర్‌లెస్‌ ఆప్షన్‌లోకి వెళ్తే వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ నేమ్‌లో డిఫాల్ట్‌ ఐడీ నేమ్‌ కనిపిస్తుంది. దీన్ని మార్చుకొని, సేవ్‌ చేసుకోవాలి.
* డిఫాల్ట్‌గా వచ్చే పాస్‌వర్డ్‌నూ మార్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు తేలికగా గుర్తిస్తారు. రూటర్‌ కంపెనీ తెలిస్తే ఇది మరింత తేలికవుతుంది. కాబట్టి కొత్త పాస్‌వర్డ్‌ను సెట్‌ చేసుకోవాలి. కనీసం 20 అక్షరాలు గల పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి. ఇందులో అక్షరాలు, అంకెలు, చిహ్నాల వంటివన్నీ ఉండేలా చూసు
కోవాలి.


ఇంట్లో లేనప్పుడు ఆఫ్‌
బయటకు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోతే రూటర్‌ను ఆఫ్‌ చేసేయాలి. ఇది మనశ్శాంతినీ కలిగిస్తుంది.
*వేర్వేరు ప్రాంతాల్లో వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ను వాడుకోవటానికి రిమోట్‌ యాక్సెస్‌ ఉపయోగపడినప్పటికీ కొన్నిసార్లు భద్రతకు ముప్పు ఏర్పడొచ్చు. కాబట్టి అవసరమైతే రిమోట్‌ యాక్సెస్‌ను డిసేబుల్‌ చేసుకోవాలి. దీంతో హోం నెట్‌వర్క్‌ మీద హ్యాకర్లు దాడి చేయకుండా జాగ్రత్త పడొచ్చు.


నెట్‌వర్క్‌ ఎన్‌క్రిప్షన్‌ ఎనేబుల్‌
దాదాపు అన్ని వైర్‌లెస్‌ రూటర్లు ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ను కలిగుంటాయి. అయితే చాలా రూటర్లలో ఇది డిఫాల్ట్‌గా ఆఫ్‌ అయ్యుంటుంది. దీన్ని ఆన్‌ చేసుకుంటే షేర్‌ చేసుకున్న డేటా ఎన్‌క్రిప్ట్‌ అవుతుంది. ఇలా నెట్‌వర్క్‌ భద్రతను కాపాడుకోవచ్చు. రూటర్‌ను ఇన్‌స్టాల్‌ చేసిన తక్షణమే ఎన్‌క్రిప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవటం మంచిది. ఇందుకోసం ఐపీ చిరునామాతో రూటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ కన్సోల్‌కు లాగిన్‌ అవ్వాలి. వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ లేదా వైర్‌లెస్‌ సెక్యూరిటీ విభాగంలోకి వెళ్లాలి. ఇందులో ఎన్‌క్రిప్షన్‌ ఆప్షన్‌ను మార్చుకోవాలి. ప్రస్తుతం చాలా ఎన్‌క్రిప్షన్‌ రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో సమర్థంగా పనిచేసేవి డబ్ల్యూపీఏ2, డబ్ల్యూపీఏ3.
* అప్పటికే ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ను రూటర్‌ వాడుకుంటుంటే? దాన్ని తెలుసుకోవటమెలా? ఫోన్‌ లేదా ట్యాబ్లెట్‌తో దీన్ని చూడొచ్చు. పరికరం సెటింగ్స్‌ను ఓపెన్‌ చేయాలి. నెట్‌వర్క్‌ విభాగం పక్కన ప్యాడ్‌లాక్‌ గుర్తు ఉన్నట్టయితే ప్రాథమిక సెక్యూరిటీ ఎనేబుల్‌ అయినట్టే. ఇక్కడే ఎన్‌క్రిప్షన్‌ రకాన్నీ చూడొచ్చు.


యాక్సెస్‌ పరిమితం
ఇంట్లో వై-ఫైని షేర్‌ చేసుకోవటం మంచిదే. కానీ తెలియనవారికి యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ ఇస్తేనే చిక్కులు. ఇంట్లో మరమ్మతులు చేసేవారికో, రంగులు వేసేవారికో ఇవ్వటం తగదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఇంటి వై-ఫై కనెక్షన్‌ ఇవ్వటం కన్నా గెస్ట్‌ వై-ఫై నెట్‌వర్క్‌ని సెట్‌ చేసుకోవాలి. దీంతో ఇంటర్నెట్‌ను మాత్రమే షేర్‌ చేసుకోవచ్చు. షేర్డ్‌ ఫోల్డర్లు, ప్రింటర్లు, స్టోరేజీ పరికరాలు, ప్రధాన వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన పరికరాలు ఇతరుల కంట పడకుండా కాపాడుకోవచ్చు.


ఫైర్‌వాల్‌ రక్షణ
మాల్వేర్‌, వైరస్‌ల వంటివి కంప్యూటర్‌లో జొరపడకుండా ఫైర్‌వాల్‌ నిరోధిస్తుంది. సాధారణంగా వైర్‌లెస్‌ రూటర్లలో ఇన్‌బిల్ట్‌గా ఫైర్‌వాల్‌ రక్షణ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇది ఆఫ్‌ అయ్యుండొచ్చు. అందువల్ల రూటర్‌ ఫైర్‌వాల్‌ను ఆన్‌ చేసుకోవాలి. ఇందుకోసం ఐపీ అడ్రస్‌తో లాగిన్‌ అయ్యి, రూటర్‌ సెటింగ్స్‌లోకి వెళ్లాలి. ఇందులో అడ్వాన్స్‌డ్‌ సెటింగ్స్‌ విభాగంలో ఫైర్‌వాల్‌ బాక్స్‌ను ఆన్‌ చేసుకోవాలి. దీంతో నెట్‌వర్క్‌లోకి ఇతరులు రావటం, పోవటాన్ని నివారించొచ్చు. ఒకవేళ రూటర్‌లో ఫైర్‌వాల్‌ లేనట్టయితే కంప్యూటర్‌లో మంచి ఫైర్‌వాల్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. లేకపోతే వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ మీద హ్యాకర్లు దాడి చేసే ప్రమాదముంది.


సాఫ్ట్‌వేర్‌ అప్‌ టు డేట్‌
ఇతర సాఫ్ట్‌వేర్ల మాదిరిగానే కొన్నిసార్లు రూటర్‌ ఫర్మ్‌వేర్‌లో లోపాలు తలెత్తొచ్చు. రూటర్‌ కంపెనీ ఫర్మ్‌వేర్‌ను వెంటనే విడుదల చేసి, సరిదిద్దకపోతే ఇది పెద్ద చిక్కులకు దారితీయొచ్చు. కాబట్టి రూటర్‌కు అందుబాటులో ఉన్న తాజా సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. తాజా సెక్యూరిటీ ప్యాచెస్‌ను వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దీంతో హ్యాకర్లు మన వై-ఫై నెట్‌వర్క్‌లోకి చొరపడటం తప్పుతుంది.


నెట్‌వర్క్‌కు వీపీఎన్‌ యాక్సెస్‌

వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ (వీపీఎన్‌) రహస్య, ఎన్‌క్రిప్ట్‌ మార్గాన్ని సృష్టిస్తుంది. వై-ఫై కనెక్షన్ల ద్వారా పరికరం నుంచి వెళ్లిన, అందిన సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్‌ చేస్తుంది. ఇలా చదవలేని, పట్టుకోలేని పద్ధతిలోకి మార్చేస్తుంది. అందువల్ల ఆన్‌లైన్‌లో ప్రసారమైన డేటా సురక్షితంగా, భద్రంగా ఉంటుంది. పీసీ, మ్యాక్‌, మొబైల్‌ ఫోన్ల వంటి పరికరాల్లో వీపీఎన్‌లను వాడుకోవచ్చు. నోర్టన్‌ సెక్యూర్‌ వీపీఎన్‌ వంటివి చాలానే అందుబాటులో ఉన్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని