ఉష్ణ ప్రాంత యాపిల్‌!

ఆవిష్కరణలకు శాస్త్రవేత్తలే కానక్కర్లేదు. వినూత్నంగా ఆలోచించ గలిగితే ఎవరైనా కొత్త పరిజ్ఞానాలను రూపకల్పన చేయొచ్చు. ఇందుకు హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లా పానీయాలా గ్రామానికి చెందిన హరిమన్‌ శర్మ ఓ చక్కటి ఉదాహరణ.

Published : 21 Jun 2023 00:08 IST

ఆవిష్కరణలకు శాస్త్రవేత్తలే కానక్కర్లేదు. వినూత్నంగా ఆలోచించ గలిగితే ఎవరైనా కొత్త పరిజ్ఞానాలను రూపకల్పన చేయొచ్చు. ఇందుకు హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లా పానీయాలా గ్రామానికి చెందిన హరిమన్‌ శర్మ ఓ చక్కటి ఉదాహరణ. ఆయన సృష్టించిన కొత్తరకం యాపిల్‌ ఉష్ణ ప్రాంతాల్లోనూ పండుతుంది మరి.

సాధారణంగా యాపిల్‌ చెట్టుకు చల్లటి వాతావరణం అవసరం. చల్లగా ఉన్న సమయంలోనే పూత పూసి, కాయలు కాస్తుంది. కానీ హరిమన్‌ శర్మ సృష్టించిన యాపిల్‌ రకానికైతే చల్లటి వాతావరణమేమీ అవసరం లేదు. కొత్తరకం వంగడాలను సృష్టించటం మీద  ఆయనకు గల ఆసక్తే ఇప్పుడు వేలాది మంది రైతులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలుస్తోంది. యాపిల్‌ పండ్లను పండించాలనే ఎన్నో ప్రాంతాల కలలను నిజం చేస్తోంది. ఒకరోజు హరిమన్‌ ఇంటి ఆవరణలో యాపిల్‌ మొక్క మొలిచింది. ఆయన అంతకు ముందు సంవత్సరం దగ్గర్లోని గ్రామం నుంచి యాపిల్‌ విత్తనాలను కొని తెచ్చి, ఇంటి ఆవరణలో చల్లారు. సముద్రమట్టానికి 1,800 అడుగుల ఎత్తులోని గ్రామంలో, అదీ వేడి వాతావరణంలో యాపిల్‌ విత్తనం మొలకెత్తటమంటే మాటలు కాదు. ఇదే హరిమన్‌ను ఆకర్షించింది. అందుకే ఆయన ఆ చెట్టును జాగ్రత్తగా పెంచారు. దాని కొమ్మలను అంటుకట్టాలని అనుకున్నారు. కానీ అక్కడ యాపిల్‌ చెట్లు లేకపోవటంతో ఆల్‌ బుఖార చెట్టుకు అంటుకట్టారు. అది అంటుకోవటమే కాదు, మంచి పండ్లనూ కాసింది. అనంతరం షిమ్లా నుంచి కొన్ని యాపిల్‌ మొక్కలను తెచ్చి, దానికి అంటుకట్టారు. అలా కొత్తరకం యాపిల్‌ చెట్ల తోటను పెంచారు. ఇప్పటికీ అది పండ్లు కాస్తుండటం గమనార్హం. ఈ యాపిల్‌ రకానికి ఆయన పేరు మీదుగానే హెచ్‌ఆర్‌ఎంఎన్‌ 99 అని పేరు పెట్టారు. దీనికి గాను ఎన్నో జాతీయ, రాష్ట్ర, జిల్లా పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణతో పాటు 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ యాపిళ్లను పండిస్తుండటం విశేషం. ఒక చెట్టు (ఏడేళ్ల వయసు) సగటున క్వింటాలు దిగుబడి ఇస్తుంది. నాటిన మూడు సంవత్సరాల తర్వాత తొలి కాత కాస్తుంది. గజ్జి తెగులునూ తట్టుకుంటుంది. తక్కువ ఉష్ణోగ్రతలో పండే యాపిల్‌ రకాల కన్నా ఇది గొప్పదని, వైవిధ్యాన్ని కలిగుందని గుజరాత్‌ రాష్ట్ర బయోటెక్నాలజీ మిషన్‌ తేల్చింది. అందుకే హరిమన్‌ను యాపిల్‌ మ్యాన్‌ ఆఫ్‌ బిలాస్‌పూర్‌ అనీ పిలుచుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని