Phone Hacking: ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందా?

ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్‌ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.

Updated : 10 Dec 2023 19:51 IST

ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్‌ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది. ఈ నోటిఫికేషన్లు ఏ ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్‌కూ ఉద్దేశించినవి కావని యాపిల్‌ స్పష్టీకరించింది. దాడుల గురించి యాపిల్‌ హెచ్చరించటం ఇదేమీ కొత్త కాదు. ఏదైనా అనుమానిత దాడికి ప్రయత్నం జరుగుతున్నట్టు గుర్తిస్తే 2021 నుంచీ ఇలాంటి ఆటోమేటెడ్‌ నోటిఫికేషన్లు జారీచేస్తోంది. తాజా హెచ్చరికల్లో నిజానిజాల మాటెలా ఉన్నా అసలు ఫోన్ల మీద సైబర్‌ నేరగాళ్లు ఎవరైనా దాడి చేసి, హ్యాక్‌ చేస్తే?(Phone hacking) ఎలా గుర్తించాలి. ఎలా నివారించుకోవాలి?

సైబర్‌ నేరగాళ్లు హానికర సాప్ట్‌వేర్‌ను జొప్పించి స్మార్ట్‌ఫోన్లను హ్యాక్‌ చేస్తుంటారు. పరికరంలో స్టోర్‌ అయిన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తుంటారు. మన ప్రమేయమేమీ లేకుండానే ఫోన్‌ను వాడేస్తుంటారు. అనుచిత యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తుంటారు. నిజానికి ఏ స్మార్ట్‌ఫోనూ పరిపూర్ణమైంది కాదు. అప్పుడప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ అదేపనిగా ఇబ్బందులు సృష్టిస్తుంటే ‘ఫోన్‌ను ఎవరైనా హ్యాక్‌ చేశారా?’ అనే సందేహం కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. మరి ఈ విషయాన్ని తెలుసుకునేదెలా? ఇందుకు కొన్ని సంకేతాలు, లక్షణాలు లేకపోలేదు. వీటి గురించి ముందే తెలుసుకొని ఉంటే జాగరూకతతో మెలగొచ్చు.

ఇవీ సంకేతాలు, హెచ్చరికలు

డేటా ఎక్కువగా ఖర్చవటం: మామూలుగా కన్నా సెల్‌ ఫోన్‌ బిల్లు మరీ ఎక్కువగా వస్తోందా? అయితే సందేహించాల్సిందే. దీనికి మాల్వేర్‌ కారణం కావొచ్చు. స్పైవేర్‌ లేదా మాల్వేర్‌ నిరంతరం ఫోన్‌లో పనిచేస్తూనే ఉంటుంది. డేటాను వాడుకుంటూనే వస్తుంది. కాబట్టి అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌ తీసుకున్నట్టయితే డేటా వాడకం మీద ఓ కన్నేసి ఉంచాలి. అసాధారణంగా మరీ ఎక్కువగా డేటా ఖర్చవుతున్నట్టయితే ఫోన్‌ హ్యాకింగ్‌కు గురైందని భావించాలి.

అదేపనిగా పాపప్‌లు: ఫోన్‌లో ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు అదేపనిగా అనుచిత పాపప్‌లు ఉబికి వస్తున్నా అనుమానించాలి. అలాగే ఉన్నట్టుండి ప్రకటనలు లేదా అనుచిత అంశాలు పాపప్‌ అవుతున్నా సమస్యగానే భావించాలి. ఇవి రెండూ ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందనటానికి సంకేతాలే. పాపప్‌లు కనిపించినప్పడు విండోను జాగ్రత్తగా క్లోజ్‌ చేయాలి. వాటి మీద ఎక్కడా క్లిక్‌ చేయొద్దు.

డౌన్‌లోడ్‌ చేయని కొత్త యాప్‌లు: ఫోన్‌లో ముందుగానే డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌లు ఉండటం మామూలే. కానీ మనం డౌన్‌లోడ్‌ చేయని, కొనని యాప్‌లు కనిపిస్తున్నట్టయితే హ్యాకింగ్‌కు సంకేతం కావొచ్చు.

తెలియని అవుట్‌గోయింగ్‌ కాల్స్‌: ఎప్పుడో అప్పుడు పొరపాటున వేలు తగిలి కాల్‌ వెళ్లటం అనుభవమే. కానీ కాల్‌ హిస్టరీలో మనకు తెలియని నంబర్లు కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే. ఫోన్‌ తనకు తానే ఇష్టమొచ్చినట్టు కాల్స్‌ చేస్తున్నా, మెసేజ్‌లు పంపిస్తున్నా హ్యాక్‌ అయ్యిండొచ్చని అనుమానించాలి.

వేగం నెమ్మదించటం: ఫోన్‌ వేగం బాగా తగ్గిపోయినా, యాప్స్‌ వంటివి ఎంతకీ ఓపెన్‌ కాకపోయినా హ్యాకింగ్‌కు సంకేతమే. అలాగే ఫోన్‌ తరచూ బాగా వేడెక్కుతున్నా, కాసేపు వాడినా మరీ ఎక్కువగా వేడి అవుతున్నా అనుమానించాల్సిందే. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మాల్వేర్‌ నిరంతరం రన్‌ అవుతుండటం వల్ల ఫోన్‌ బాగా వేడెక్కుతుంది.

స్పామ్‌ మెసేజ్‌లు: తెలియని నంబర్ల నుంచి కాల్స్‌ లేదా స్పామ్‌ మెసేజ్‌లు వస్తున్నా.. ఫోన్‌ నుంచి స్పామ్‌ మెసేజ్‌లు వెళ్తున్నా హ్యాక్‌ అయ్యిండొచ్చని అనుకోవాలి.

సెక్యూరిటీ ఫీచర్ల డిసేబుల్‌: మనకు తెలియకుండానే స్క్రీన్‌లాక్‌, యాంటీవైరస్‌ వంటి భద్రతా ఫీచర్లు డిసేబుల్‌ అయితే సందేహించాల్సిందే. ఇవి హ్యాకింగ్‌కు బలమైన గుర్తులని తెలుసుకోవాలి.

అనుమానిస్తే ఏం చెయ్యాలి?

ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందనిపిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముందుగా కాంటాక్ట్‌ నంబర్లన్నింటికీ ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందనే విషయాన్ని తెలపాలి. మన ఫోన్‌ నుంచి వచ్చే అనుమానిత లింకులేవీ క్లిక్‌ చేయొద్దని తెలియజేయాలి.

 • ఫోన్‌ వై-ఫై, మొబైల్‌ డేటాను టర్న్‌ఆఫ్‌ చేయాలి. దీంతో మోసగాళ్లకు ఫోన్‌ మీద మరింత ఆధిపత్యం దక్కకుండా చేయొచ్చు.
 • ఫోన్‌లోని మాల్వేర్‌ను గుర్తించి, తొలగించటానికి యాంటీ-మాల్వేర్‌ సాఫ్ట్‌వేర్‌ తోడ్పడుతుంది. దీన్ని తరచూ రన్‌ చేస్తుండాలి. ఒకవేళ అలాంటి సాఫ్ట్‌వేర్‌ లేనట్టయితే యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసి, రన్‌ చేయాలి.
 • ఫోన్‌ హ్యాక్‌ అయినప్పుడు లాగిన్‌ పాస్‌వర్డ్‌లను మోసగాళ్లు తెలుసుకునే ప్రమాదముంది. కాబట్టి మాల్వేర్‌ను తొలగించిన తర్వాత అన్ని పాస్‌వర్డ్‌లను రీసెట్‌ చేసుకోవాలి. ప్రతి ఖాతాకూ వేర్వేరుగా కఠినమైన పాస్‌వర్డ్‌లను నిర్ణయించుకోవాలి.
 • ఫోన్‌లో పొరపాటున మాల్వేర్‌ చొరపడటానికి ప్రధాన కారణం అనుమానిత యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవటం. ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందని అనిపిస్తే యాప్‌ల జాబితాను నిశితంగా పరిశీలించాలి. థర్డ్‌ పార్టీ యాప్‌ స్టోర్‌ నుంచి లేదా అనధీకృత సోర్సుల నుంచి డౌన్‌లోడ్‌ అయిన యాప్‌లు కనిపిస్తే వెంటనే డిలీట్‌ చేయాలి. ఆ యాప్‌లు ఏయే డేటాను యాక్సెస్‌ చేస్తున్నాయో కూడా చూడాలి. దీంతో ఏ ఖాతా పాస్‌వర్డ్‌లు మార్చాలో తెలుస్తుంది. అవసరమైతే వ్యక్తిగత సమాచారాన్నీ అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది.
 • ఫ్యాక్టరీ రీసెట్‌ చేస్తే చాలావరకు మాల్వేర్‌ తొలగిపోతుంది. అయితే దీంతో ఫోన్‌లో స్టోర్‌ అయిన ఫొటోలు, నోట్స్‌, కాంటాక్ట్స్‌ వంటి సమాచారమూ పోతుంది. కాబట్టి ఫోన్‌ను రిస్టోర్‌ చేయటానికి ముందు డేటాను బ్యాకప్‌ చేయాలి. అయితే యాప్స్‌ను బ్యాకప్‌ చేయొద్దు. ముఖ్యంగా ఫోన్‌లో మాల్వేర్‌ ఉన్నట్టు అనుమానిస్తే అసలే యాప్స్‌ను బ్యాకప్‌ చేయొద్దు. తిరిగి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన యాప్స్‌ పేర్లను రాసి పెట్టుకోవాలి. అవి విశ్వసనీయమైనవని తెలుసుకున్నాకే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
 • అదనపు భద్రత కోసం ముఖ్యమైన యాప్‌లన్నింటికీ టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ సెట్‌ చేసుకోవాలి.
 • యాప్‌లకు ఇచ్చిన అనుమతులను సమీక్షించుకోవాలి. ఫోన్‌ ఫీచర్లకు, డేటాకు అనవసరంగా యాక్సెస్‌ ఇచ్చినట్టయితే డిసేబుల్‌ చేసుకోవాలి.
 • బ్యాంకు ఖాతాలు, ఈమెయిళ్లు, ఇతర రహస్య ఖాతాల వంటి వాటిల్లో ఏదైనా అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయేమో ఓ కంట కనిపెడుతుండాలి.
 • సమస్యను పరిష్కరించటం తెలియకపోతే పోతే సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల సాయం తీసుకోవాలి.

ఫోన్‌ను ఎలా హ్యాక్‌ చేస్తారు?

స్మార్ట్‌ఫోన్‌ హ్యాకర్లు రకరకాల పద్ధతులతో ఫోన్‌లోకి చొరబడతారు. ఫిషింగ్‌ అటాక్స్‌, స్మిషింగ్‌ అటాక్స్‌, స్పైవేర్‌, అన్‌సెక్యూర్‌ వైఫై, హానికర యాప్‌ల వంటి వాటిని ఇందుకు వాడుకుంటారు. ఈమెయిల్‌, టెక్స్ట్‌ మెసేజ్‌, ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఫిషింగ్‌కు పాల్పడతారు. నమ్మకమైన వనరులేనని భావించేలా చేసి బురిడీ కొట్టిస్తారు. ఎస్‌ఎంఎస్‌, ఫిషింగ్‌ కలయికే స్మిషింగ్‌. ఈమెయిళ్ల కన్నా టెక్స్ట్‌ మెసేజ్‌లనే ఎక్కువగా నమ్ముతుంటారు కాబట్టి సైబర్‌ నేరగాళ్లు ఎస్‌ఎంఎస్‌లతో మోసం చేస్తుంటారు. ముందు హానికర లింక్‌తో కూడిన మెసేజ్‌ను పంపిస్తారు. దాన్ని క్లిక్‌ చేసి వ్యక్తిగత సమాచారం ఇవ్వగానే దాని సాయంతో మోసానికి తెగబడతారు. స్పైవేర్‌ అనేది ఒకరకం మాల్వేర్‌. మోసగాళ్లు మన ప్రమేయం లేకుండా, మనకు తెలియకుండానే ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తారు. ఇది గుట్టుగా మన సమాచారాన్ని దొంగిలిస్తుంది. స్పైవేర్లలో యాడ్వేర్‌, ట్రోజన్స్‌, ఇంటర్నెట్‌ ట్రాకర్స్‌, కీబోర్డు లాగర్స్‌ వంటి రకరకాలు ఉన్నాయి. పబ్లిక్‌ వైఫై వంటి అన్‌సెక్యూర్‌ వైఫైని వాడేటప్పుడూ హ్యాకర్ల తేలికగా ఫోన్‌లోకి చొచ్చుకొచ్చేస్తారు. హానికర యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తుంటారు.

నివారించుకోవచ్చా?

 • పాస్‌వర్డ్‌ మేనేజర్‌ వంటి భద్రమైన యాప్‌ను వాడితే తప్ప ఫోన్‌లో పాస్‌వర్డ్‌లు, క్రెడిట్‌ కార్డు వివరాల వంటి కీలకమైన సమాచారాన్ని సేవ్‌ చేయొద్దు.
 • ఫోన్‌కు ఇతరులు ఊహించలేని కఠినమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి.
 • ముఖ్యమైన యాప్స్‌ను పాస్‌వర్డ్‌తో లాక్‌ చేసుకోవాలి.
 • బ్లూటూత్‌ను వాడుతున్నప్పుడే ఆన్‌ చేయాలి. మిగతా సమయాల్లో తప్పనిసరిగా ఆఫ్‌లో పెట్టుకోవాలి.
 • అప్పుడప్పుడు పాపప్స్‌, బ్యాటరీ త్వరగా నిండుకోవటం వంటి అసాధారణ యాక్టివిటీ ఏమైనా జరుగుతుందేమో గమనిస్తుండాలి.
 • సాఫ్ట్‌వేర్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్స్‌ విడుదలైన వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలి.
 • డేటాను రక్షించుకోవటానికి తరచూ ఫోన్‌ను బ్యాకప్‌ చేసుకోవాలి.
 • పబ్లిక్‌ వై-ఫై నెట్‌వర్క్‌లను వాడుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అదనపు భద్రత కోసం పీపీఎన్‌ను వాడుకోవాలి.
 • విశ్వసనీయమైన మొబైల్‌ సెక్యూరిటీ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
 • అంతర్జాలాన్ని వాడేటప్పుడు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి తెలుసుకొని, జాగ్రత్తగా మెలగాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని