
ఆధునిక కాల బ్రౌజర్ బ్రేవ్
బ్రౌజర్ అనగానే క్రోమ్, సఫారీ, ఎడ్జ్, ఫైర్‌ఫాక్స్ వంటివే గుర్తుకొస్తాయి. ఇలాంటి పెద్ద కంపెనీల బ్రౌజర్లు వినియోగదారుల డేటా భద్రతకు, హ్యాకర్ల దాడులను తప్పించటానికి అవసరమైన సదుపాయాలూ కల్పిస్తాయి. అయితే అన్నిసార్లూ ఇవి గోప్యతను పూర్తిగా కాపాడలేకపోవచ్చు. సెర్చ్ ఇంజిన్ డేటాను సంరక్షించుకోవటానికి ప్రైవసీ సెట్టింగులను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే భద్రతను కల్పించే ఎక్స్‌టెన్షన్లనూ ఎంచుకోవాల్సి రావొచ్చు. ఇలాంటి జంజాటాలేవీ వద్దనుకునేవారు ‘బ్రేవ్’ బ్రౌజర్‌ను ప్రయత్నించి చూడొచ్చు. ఆధునిక యుగం బ్రౌజర్‌గా పేరొందుతున్న ఇది గోప్యతను కాపాడటం మీద ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ప్రకటనలను అడ్డుకుంటుంది. మన వ్యవహారాలను గమనించే థర్డ్ పార్టీ కుకీస్‌ను, ట్రాకర్లను కూడా అడ్డుకుంటుంది. అయితే ఆయా ప్రకటనలు, కుకీస్‌ను బ్లాక్ చేయకుండా నిర్ణయించుకోవటానికీ వీలుంటుంది. మరి అన్ని ప్రకటనలను బ్రేవ్ అడ్డుకుంటే కంటెంట్‌ను సృష్టించే వెబ్‌సైట్లకు ఆదాయం ఎక్కడ్నుంచి వస్తుంది? దీనికీ బ్రేవ్ దగ్గర పరిష్కారముంది. మనం ఏదైనా వెబ్‌సైట్‌ను చూసినప్పుడు పబ్లిషర్లకు, కంటెంట్ రచయితలకు అజ్ఞాతంగా క్రిప్టోకరెన్సీ రూపంలో కొంత మొత్తం చెల్లిస్తుంది. అంతేకాదు.. బ్రేవ్‌కు సొంత సెర్చ్ ఇంజిన్ కూడా ఉంది. దీని బీటా వర్షన్ విడుదలైంది. క్రోమ్ ఫ్రేమ్‌వర్క్ మీద బ్రేవ్ బ్రౌజర్ ఆధారపడటం వల్ల క్రోమ్ ఎక్స్‌టెన్షన్లన్నీ ఇందులోనూ పనిచేస్తాయి. ఎక్స్‌టెన్షన్లు, థీమ్స్ కోసం క్రోమ్ వెబ్ స్టోర్‌కే రావాల్సి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.