పాస్‌వర్డ్‌ మేనేజర్‌తోనూ భద్రంగా..

సైబర్‌ సెక్యూరిటీ, ప్రైవసీ, హ్యాకింగ్‌.. ఇటీవల వీటి ప్రస్తావన పదే పదే వింటున్నాం. బ్యాంకు లావాదేవీలైనా, నగదు చెల్లింపులైనా, కొనుగోళ్లయినా అన్నీ ఫోన్లు, వెబ్‌సైట్లతోనే కానిచ్చేస్తున్నాం. ఇలా ఆన్‌లైన్‌ వ్యవహారాల మీద ఆధారపడటం రోజురోజుకీ ఎక్కువవుతోంది. దీంతో సైబర్‌ నేరగాళ్ల బారినపడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పెరుగుతోంది.

Updated : 12 Jan 2022 05:06 IST

సైబర్‌ సెక్యూరిటీ, ప్రైవసీ, హ్యాకింగ్‌.. ఇటీవల వీటి ప్రస్తావన పదే పదే వింటున్నాం. బ్యాంకు లావాదేవీలైనా, నగదు చెల్లింపులైనా, కొనుగోళ్లయినా అన్నీ ఫోన్లు, వెబ్‌సైట్లతోనే కానిచ్చేస్తున్నాం. ఇలా ఆన్‌లైన్‌ వ్యవహారాల మీద ఆధారపడటం రోజురోజుకీ ఎక్కువవుతోంది. దీంతో సైబర్‌ నేరగాళ్ల బారినపడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పెరుగుతోంది. ఇందుకోసం చాలామంది పాస్‌వర్డ్‌ మేనేజర్లను వినియోగిస్తుంటారు. దీంతో అన్ని పాస్‌వర్డ్‌లనూ ఒకేచోట భద్ర పరచుకోవచ్చు. బోలెడన్ని పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవటం, కొత్త పాస్‌వర్డ్‌లను సృష్టించుకోవటం తప్పుతుంది. మాస్టర్‌ పాస్‌వర్డ్‌, కొన్ని అదనపు భద్రతలతో కూడుకొని ఉండటం వల్ల ఆన్‌లైన్‌ భద్రతకు పాస్‌వర్డ్‌ మేనేజర్‌ ఎంతగానో ఉపయోగ పడుతుంది. అయితే ఇది హ్యాకర్ల చేతికి చిక్కితే మాత్రం చిక్కులు తప్పవు. అందువల్ల దీని విషయంలోనూ జాగ్రత్తలు పాటించటం మంచిది.

మల్టీఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌:  ఇది పాస్‌వర్డ్‌ మేనేజర్‌ భద్రతకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కనీసం రెండు పద్ధతులతో మన గుర్తింపును ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది మరి. అంటే మాస్టర్‌ పాస్‌వర్డ్‌తో పాటు మొబైల్‌ ఫోన్‌కు గానీ ఈమెయిల్‌కు గానీ అందే ఓటీపీని ఎంటర్‌ చేస్తే తప్ప ఆయా వెబ్‌సైట్లను చూడటానికి కుదరదు. కాస్త ఖరీదైన పాస్‌వర్డ్‌ మేనేజర్లయితే ఫిజికల్‌ కీ సదుపాయాన్నీ కల్పిస్తాయి. ఉదాహరణకు- ప్రిడేటర్‌, యూఎస్‌బీ రాప్టర్‌ వంటి యాప్‌లతో యూఎస్‌బీ ఫ్లాష్‌డ్రైవ్‌ను యూఎస్‌బీ సెక్యూరిటీ కీగా మార్చుకోవచ్చు.

ఆటోమేటిక్‌ లాగిన్‌ వద్దు:  హ్యాకర్లు మన పరికరంలోకి హానికర ప్రోగ్రామ్‌లను జొప్పిస్తే, ఆటోమేటిక్‌ లాగిన్‌తో తేలికగా ఆయా వెబ్‌సైట్లను యాక్సెస్‌ చేయొచ్చు. కాబట్టి బ్రౌజర్లు, పాస్‌వర్డ్‌ మేనేజర్లలో ఆటోమేటిక్‌ లాగిన్‌ అవకాశాన్ని వాడకపోవటమే ఉత్తమం.
లాగిన్‌ నోటిఫికేషన్‌ ఎనేబుల్‌: పాస్‌వర్డ్‌ మేనేజర్‌పై లాగిన్‌ నోటిఫికేషన్స్‌ను ఎనేబుల్‌ చేసుకొని ఉండటం తప్పనిసరి. దీంతో ఎవరైనా మన పాస్‌వర్డ్‌లను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే స్మార్ట్‌ఫోన్‌ లేదా ఈమెయిల్‌కు నోటిఫికేషన్‌ అందుతుంది. వెంటనే అప్రమత్తం కావటానికి వీలుంటుంది.

తరచూ పాస్‌వర్డ్‌ మారుస్తుండాలి
మన పాస్‌వర్డ్‌ తెలుసుకోవటానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టు అనుమానం వస్తే వెంటనే పాస్‌వర్డ్‌ను మార్చేయాలి. కొత్త పాస్‌వర్డ్‌ పాత దాంతో పోలి ఉండకుండా చూసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు