డిలీట్‌ అయిన ఫైళ్లు తిరిగి పొందాలంటే?

ఇప్పుడు చాలావరకు డిజిటల్‌ ప్రపంచంలోనే జీవిస్తున్నాం. ఫొటోలు, డాక్యుమెంట్ల దగ్గర్నుంచి డబ్బులు పంపటం వరకూ ఎన్నెన్నో పనులు చిటికెలో చేసేస్తున్నాం. ఈ క్రమంలో కొన్నిసార్లు పొరపాటున విలువైన కుటుంబ సభ్యుల ఫొటోలు, బ్యాంకు డాక్యుమెంట్ల వంటివి డిలీట్‌ చేస్తుంటాం

Published : 09 Feb 2022 00:30 IST

ప్పుడు చాలావరకు డిజిటల్‌ ప్రపంచంలోనే జీవిస్తున్నాం. ఫొటోలు, డాక్యుమెంట్ల దగ్గర్నుంచి డబ్బులు పంపటం వరకూ ఎన్నెన్నో పనులు చిటికెలో చేసేస్తున్నాం. ఈ క్రమంలో కొన్నిసార్లు పొరపాటున విలువైన కుటుంబ సభ్యుల ఫొటోలు, బ్యాంకు డాక్యుమెంట్ల వంటివి డిలీట్‌ చేస్తుంటాం. వేలు కాస్త అటూఇటైతే ఫోల్డర్‌ పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాగని భయపడిపోవాల్సిన పనిలేదు. ప్రశాంతంగా, త్వరగా స్పందిస్తే తిరిగి వీటిని పొందొచ్చు. సిస్టమ్‌లో ఉన్న డిఫాల్ట్‌ టూల్స్‌ దగ్గర్నుంచి ఉచిత థర్డ్‌ పార్టీ యాప్‌ల వరకూ ఎన్నెన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

బ్యాకప్‌ మరవద్దు: కంప్యూటర్‌లో అయినా ఫోన్‌లో అయినా బ్యాకప్‌ చేసుకోవటం మరవద్దు. డిలీట్‌ అయిన ఫైళ్లను తిరిగి పొందటానికిది బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాకప్‌, క్లౌడ్‌ స్టోరేజీ యాప్స్‌ చాలావరకు సమగ్రంగా ఉంటున్నాయి. తేలికగానూ వాడుకోవచ్చు. పొరపాటున ఫైళ్లు డిలీట్‌ అయినప్పుడే కాదు, ర్యాన్సమ్‌వేర్‌ వంటి ఇబ్బందులు ఎదురైనా బ్యాకప్‌ ఉపయోగపడుతుంది. కంప్యూటర్‌లో విండోస్‌ (వన్‌డ్రైవ్‌), మ్యాక్‌ఓఎస్‌ (ఐక్లౌడ్‌) ఆపరేటింగ్‌ సిస్టమ్‌లతో బిల్టిన్‌గా వచ్చే సదుపాయాలను వినియోగించుకోవచ్చు. డ్రాప్‌ బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌ వంటి యాప్స్‌నూ వాడుకోవచ్చు. ఎప్పుడైనా ఫైళ్లను డిలీట్‌ చేస్తే వీటి నుంచి రిస్టోర్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు డ్రాప్‌బాక్స్‌ ఇంటర్‌ఫేస్‌లో ‘డిలీటెడ్‌ ఫైల్స్‌’ లింక్‌ మీద క్లిక్‌ చేస్తే చాలు. తేలికగా రిస్టోర్‌ అవుతుంది.

రీసైకిల్‌ బిన్‌, ట్రాష్‌ సాయం: చాలామందికి వీటి గురించి తెలిసే ఉంటుంది. డిలీట్‌ అయిన ఫైళ్లు వీటిల్లో కొంతకాలం వరకు అలాగే ఉంటాయి. వీటి మీద రైట్‌ క్లిక్‌ చేసి రిస్టోర్‌ చేసుకోవచ్చు. సాధారణంగా విండోస్‌లో డెస్క్‌టాప్‌ మీద ఒక పక్కన రీసైకిల్‌ బిన్‌ ఉంటుంది. ఒకవేళ అక్కడ కనిపించకపోతే కంట్రోల్‌ ప్యానల్‌లో డెస్క్‌టాప్‌ ఐకన్‌ ఆప్షన్‌ ద్వారా డెస్క్‌టాప్‌ మీదికి తెచ్చుకోవచ్చు. ఒక్కో ఫైలును గానీ మొత్తం ఫైళ్లను గానీ ఎంచుకొని రిస్టోర్‌ చేసుకోవచ్చు. మ్యాక్‌ఓస్‌లో డిలీట్‌ అయిన ఫైళ్లు ట్రాష్‌లోకి చేరతాయి. ఇందులోంచి ఫైల్‌ను డ్రాగ్‌ చేసి బయటకు తేవచ్చు. లేదంటే ఫైల్‌ మీద రైట్‌ క్లిక్‌ చేసి, పుట్‌బ్యాక్‌ ఆప్షన్‌ను ఎంచుకొని రిస్టోర్‌ చేసుకోవచ్చు. ట్రాష్‌లో ఫైళ్లు 30 రోజుల వరకు ఉంటాయి. విండోస్‌లోనైతే రీసైకిల్‌ బిన్‌ నిండిపోయేంతవరకు అలాగే ఉంటాయి. కాబట్టి అవసరమైన ఫైళ్లను వీలైనంత త్వరగా వీటిల్లోంచి తీసుకోవటం మంచిది.

థర్డ్‌పార్టీ యాప్‌లతో: డిజిటల్‌ సొరంగంలోంచి ఫైళ్లను వెలికి తీయటానికి థర్డ్‌ పార్టీ యాప్‌ల సాయమూ తీసుకోవచ్చు. ఇవి ఆయా డిస్కుల నుంచి ఓవర్‌రిటెన్‌ కాని ఫైళ్ల అంశాలను వెతికి పట్టుకుంటాయి. వాటన్నింటినీ క్రోడీకరించి పూర్తి ఫైలుగా మారుస్తాయి. కావాలంటే EaseUS Data Recovery,Active@ Undelete, Disk Drill,Recuva వంటి వాటిని ప్రయత్నించొచ్చు. ఈ యాప్‌లను చాలావరకు ఉచితంగానే వాడుకోవచ్చు. ఇంకాస్త ఎక్కువ ఆప్షన్లు కావాలంటే కొనుక్కోక తప్పదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని