Digilocker: ఆధార్‌లో చిరునామా మారిస్తే అన్ని పత్రాల్లో మార్చినట్టే!

ముఖ్యమైన పత్రాలను డిజిటల్‌ రూపంలో డిజిలాకర్‌లో భద్రపరచుకోవటం తెలిసిందే. ఇది చాలా సురక్షితం. అందుకే చాలామంది పాన్‌కార్డు, ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బీమా పత్రాలు, ధ్రువీకరణ పత్రాల వంటి వాటిని ఇందులో దాచుకుంటారు.

Updated : 17 Aug 2022 11:20 IST

 

ముఖ్యమైన పత్రాలను డిజిటల్‌ రూపంలో డిజిలాకర్‌లో భద్రపరచుకోవటం తెలిసిందే. ఇది చాలా సురక్షితం. అందుకే చాలామంది పాన్‌కార్డు, ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బీమా పత్రాలు, ధ్రువీకరణ పత్రాల వంటి వాటిని ఇందులో దాచుకుంటారు. ఒకసారి డిజిలాకర్‌లో భద్రపరచుకుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌ సేవలు తేలికగా పొందొచ్చు. అయితే ఎప్పుడైనా చిరునామా మారితేనే ఇబ్బంది. అన్నింటిలోనూ విడివిడిగా మార్చుకోవాల్సి ఉంటుంది. మున్ముందు ఇలాంటి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. డిజిలాకర్‌లోని పత్రాల్లో చిరునామాను సులభంగా మార్చుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. మారిన చిరునామాను ఒక్క ఆధార్‌కార్డులో అప్‌డేట్‌ చేస్తే చాలు. మిగతా    అన్ని పత్రాల్లోనూ చిరునామా దానంతటదే మారిపోయేలా యూఐడీఏఐ ప్రయత్నాలు చేస్తోంది.

ఆయా ప్రభుత్వ విభాగాల సహకారంతో దీన్ని సాకారం చేయనుంది. ఆధార్‌ కార్డులో చిరునామా మారితే డిజిలాకర్‌లో స్టోర్‌ అయిన డ్రైవింగ్‌ లైసెన్స్‌లోనూ చిరునామా మారేలా ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతో చర్చలు ఆరంభించింది. ఆదాయ పన్ను శాఖ సహకారంతో పాన్‌ కార్డులోనూ ఇలాంటి మార్పులకు వీలు కల్పించటంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆధార్‌కార్డులో చిరునామా మారితే మిగతా పత్రాల్లో వివరాలను విడివిడిగా అప్‌డేట్‌ చేసుకోవాల్సి వస్తోంది. ఉదాహరణకు- డ్రైవింగ్‌ లైసెన్స్‌లో చిరునామాను మార్చుకోవాలంటే కేంద్రీకృత పోర్టల్‌లో విడిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తును నింపి, రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి చూపించాల్సి ఉంటుంది. కొత్త పద్ధతి అందుబాటులోకి వస్తే ఇలాంటి ఇబ్బంది తప్పుతుంది. ఆధార్‌ కార్డులో చిరునామా మారితే డ్రైవింగ్‌ లైసెన్స్‌లోనూ మారుతుంది. దీంతో వేర్వేరు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని