ఇలా వెతికితే..

దేని గురించి తెలుసుకోవాలన్నా ముందు గూగుల్‌ మీదే కన్ను పడుతుంది. ఇలా సెర్చ్‌ చేయగానే అలా బోలెడన్ని వెబ్‌సైట్లు ప్రత్యక్షమవుతాయి. కాకపోతే వీటిల్లో మనకు కావాల్సిందేటన్నది వెతుక్కోవటమే కాస్త కష్టమైన పని. కానీ కొన్ని చిట్కాలతో అవసరమైన విషయాన్ని కచ్చితంగా తెలుసుకునే మార్గం లేకపోలేదు.

Published : 13 Apr 2022 01:44 IST

దేని గురించి తెలుసుకోవాలన్నా ముందు గూగుల్‌ మీదే కన్ను పడుతుంది. ఇలా సెర్చ్‌ చేయగానే అలా బోలెడన్ని వెబ్‌సైట్లు ప్రత్యక్షమవుతాయి. కాకపోతే వీటిల్లో మనకు కావాల్సిందేటన్నది వెతుక్కోవటమే కాస్త కష్టమైన పని. కానీ కొన్ని చిట్కాలతో అవసరమైన విషయాన్ని కచ్చితంగా తెలుసుకునే మార్గం లేకపోలేదు. ఇందుకు కొన్ని ఆపరేటర్లు ఎంతగానో ఉపయోగపడతాయి.

పదానికి అర్థం నేరుగా

గూగుల్‌ సెర్చ్‌లో అంతర్గత నిఘంటువు దాగుంది. ఇందుకోసం సెర్చ్‌ బార్‌లో define అని టైప్‌ చేసి, తర్వాత అర్థాన్ని తెలుసుకోవాలనుకునే పదాన్ని టైప్‌ చేస్తే చాలు. వెంటనే అర్థాలతో పాటు వ్యతిరేక పదాలు, సమానార్థకాలూ కనిపిస్తాయి. ఆయా పదాలను ఎలా వాడాలో తెలిపే వాక్యాలూ ప్రత్యక్షమవుతాయి.

ఆయా వెబ్‌సైట్లకు చెందినవే

ఆయా వైబ్‌సైట్లలో ఉండే అంశాలను మాత్రమే శోధించటానికి ఉపయోగపడేది site: ఆప్షన్‌. సెర్చ్‌ బార్‌లో తెలుసుకోవాలని అనుకునే అంశాన్ని, తర్వాత site: అని టైప్‌ చేయాలి. దీని తర్వాత వెబ్‌సైట్‌ పేరును టైప్‌ చేయాలి. అప్పుడు ఆ అంశానికి, ఆ వెబ్‌సైట్‌కు సంబంధించిన విషయాలే ప్రత్యక్షమవుతాయి. (ఉదా: RRR movie site: eenadu)

అనవసరమైనవి లేకుండా

అవసరం లేనివి వదిలేసి మిగతా విషయాలను మాత్రమే సెర్చ్‌ చేసుకునే వెసులుబాటూ ఉంది. దీనికి మైనస్‌ గుర్తు (-) ఉపయోగపడుతుంది. దీంతో ఏదైనా విషయాన్ని సెర్చ్‌ చేస్తున్నప్పుడు వద్దనుకునేవి కనిపించకుండా చూసుకోవచ్చు. ఉదాహరణకు చికెన్‌ వంటకాలను సెర్చ్‌ చేస్తున్నారనుకోండి. టమోటాలు లేనివి కావాలనుకోండి. chicken recipes -tomato అని టైప్‌ చేస్తే టమోటాలు లేని చికెన్‌ వంటకాలు ప్రత్యక్షమవుతాయి.

లెక్కలు కూడా

గూగుల్‌ను కాలిక్యులేటర్‌గానూ వాడుకోవచ్చు. sin, log, square root వంటి పదాలతో మామూలు లెక్కల నుంచి కఠినమైన లెక్కల వరకూ చేసుకోవచ్చు. ఉదాహరణకు 60కి వర్గమూలాన్ని కనుక్కోవాలని అనుకున్నారనుకోండి. root of 60 అని టైప్‌ చేయగానే కింద కాలిక్యులేటర్‌ లాంటిది ప్రత్యక్షమై అందులో జవాబు కనిపిస్తుంది.graph for సాయంతో ఎలాంటి గ్రాఫ్‌లనైనా సృష్టించుకోవచ్చు. ఉదాహరణకు-y^4 గ్రాఫ్‌ను చూడాలనుకుంటే graph for y^4 అని టైప్‌ చేస్తే వెంటనే గ్రాఫ్‌ రూపంలో కనిపిస్తుంది.

ఆయా ఫైళ్లు మాత్రమే

కేవలం పీడీఎఫ్‌ ఫైళ్లు మాత్రమే చూడాలనుకున్నారు. లేదూ డాక్స్‌ ఫైళ్లు మాత్రమే వెతకాలని అనుకుంటున్నారు. ఇలా ఆయా రకాల ఫైళ్లను శోధించటానికి  filetype: అని టైప్‌ చేసి, తర్వాత ఫైల్‌ రకాన్ని టైప్‌ చేయాలి. ఉదాహరణకు బంగారానికి సంబంధించిన పీడీఎఫ్‌ ఫైళ్లు మాత్రమే చదవాలని అనుకున్నారనుకోండి. gold filetype:pdf అని టైప్‌ చేస్తే చాలు. పీడీఎఫ్‌ ఫైళ్లే కనిపిస్తాయి.

ఆయా కాలానికి సంబంధించినవే

ఏదో సమాచారం గురించి వెతుకున్నాం. ఎప్పటెప్పటివో కనిపిస్తున్నాయి. మీరేమో నెల క్రితం జరిగినవే చూడాలని అనుకుంటున్నారు. దీనికీ మార్గముంది. దేని గురించైనా సెర్చ్‌ చేయగానే కింద బోలెడన్ని వెబ్‌సైట్లు కనిపిస్తాయి కదా. అప్పుడు టూల్స్‌ బటన్‌ మీద క్లిక్‌ చేస్తే చాలు. ఎనీ టైమ్‌, పాస్ట్‌ అవర్‌, పాస్ట్‌ 24 అవర్స్‌.. ఇలా రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో కావాల్సింది ఎంచుకుంటే ఆయా కాలాలకు సంబంధించినవే ప్రత్యక్షమవుతాయి.

టైమర్‌గానూ

సెర్చ్‌ చేయటానికే కాదు.. గూగుల్‌ను టైమర్‌, స్టాప్‌వాచ్‌గానూ వాడుకోవచ్చు. సెర్చ్‌ బార్‌లో timer అని టైప్‌ చేస్తే టైమ్‌, స్టాప్‌వాచ్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. టైమర్‌లో సమయాన్ని ఎంచుకుంటే అక్కడ్నుంచి టైమ్‌ తగ్గుతూ వస్తుంది. స్టాప్‌వాచ్‌ను ఎంచుకుంటే అప్పట్నుంచి మిల్లీసెకన్లు, సెకన్లతో సహా ఎంత సమయం గడిచిపోయిందనేది కనిపిస్తుంది.

పెద్ద అంకెల ఉచ్చారణ

పెద్ద పెద్ద అంకెల ఉచ్చారణ చాలాసార్లు కష్టంగా అనిపిస్తుంటుంది. వీటిని ఇంగ్లిషులో ఎలా పలకాలో తెలుసుకోవటానికి =english ఆపరేటర్‌ సాయం చేస్తుంది. దీనికి ముందు అంకెను టైప్‌ చేస్తే దాన్ని ఎలా పలకాలో అక్షరాల్లో చూపిస్తుంది. ఉదాహరణకు 99999999ను ఎలా ఉచ్చరించాలో తెలుసుకోవాలంటే 99999999=english అని టైప్‌ చేస్తే చాలు.

అది లేదా ఇది

ఒకదాని గురించి గానీ మరోదాని గురించి గానీ వెతకాలనుకుంటే OR ఆపరేటర్‌ బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఆండ్రాయిడ్‌, ఐఫోన్లలో మంచి గేమ్స్‌ గురించి తెలుసుకోవాలని అనుకున్నారనుకోండి. best games android OR iphone అని టైప్‌ చేస్తే విడివిడిగా వీటికి సంబంధించిన వెబ్‌సైట్లు ప్రత్యక్షమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు