Updated : 11 May 2022 10:38 IST

స్పర్శజ్ఞానంలో కొత్తకోణం

మన చర్మ స్పర్శజ్ఞానం అద్భుతమైంది. ఇది ఉపరితలాల రసాయన మిశ్రమాల్లో స్వల్ప మార్పులనూ గుర్తించగలదని యూనివర్సిటీ ఆఫ్‌ డెలావేర్‌ (యూడీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. స్పర్శ జ్ఞానంతో ముడిపడిన పరికరాల రూపకల్పనలో ఇది కొత్త మార్పులకు శ్రీకారం చుట్టగలదని, వర్చువల్‌ రియాలిటీ పరిజ్ఞానాలకు ఎంతగానో ఉపయోగపడగలదని భావిస్తున్నారు.

నిషి ఇంద్రియ జ్ఞానాలతో కూడిన వ్యవస్థల రూపకల్పనలో ఇటీవల చాలా ఆసక్తి పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌ తెరలు, కంప్యూటర్‌ మానిటర్లు, వర్చువల్‌ రియాలిటీ హెడ్‌సెట్స్‌, ఆడియో పరికరాల్లో చూపు, శబ్ద జ్ఞానాలను ఇప్పటికే వాడుకుంటున్నారు. అయితే నొప్పి, వేడి, పరిసరాల అవగాహనతో ముడిపడిన తాకిన (టాక్టయిల్‌) అనుభూతి కలిగించటమనేది అంత తేలికైన పనికాదు. ఇదో సంక్లిష్టమైన వ్యవస్థ. అందుకే టెక్నాలజీ అవసరాలకు దీన్ని వాడుకోవటంలో పెద్దగా పురోగతి సాధించలేకపోయాం. ఈ అడ్డంకిని అధిగమించటానికి యూడీ శాస్త్రవేత్తలు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. వేలితో తాకటం ద్వారా ఆయా ఉపరితలాలపై స్వల్ప రసాయన మార్పులనూ మనం గుర్తించగలమని నిరూపించారు. ఉదాహరణకు నత్రజని అణువు ఉండాల్సిన చోట కర్బన అణువు ఉన్నా పసిగట్టగలమని రుజువు చేశారు. దేనినైనా తాకితే దాని ఉపరితం మన వేలికి తగులుతుంది. వేలు, ఉపరితలం మధ్య పుట్టుకొచ్చే ఘర్షణలో మార్పులను బట్టి మన అనుభూతి మారుతుంది. ఇక్కడే రసాయన శాస్త్రం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. మరింత సున్నితమైన ఇంద్రియ జ్ఞానాలను పుట్టించటానికి ఆయా పదార్థాల రసాయన స్వభావాలు కొత్త దారులను తెరవగలవని పరిశోధకులు భావిస్తున్నారు. వర్చువల్‌ రియాలిటీ పరికరాల నుంచి సమాచారాన్ని అందించే పదార్థాన్ని రూపొందించటానికి తోడ్పడగలవని ఆశిస్తున్నారు. ఇటీవలి కాలంలో స్పర్శ జ్ఞానాన్ని కలిగించటానికి తోడ్పడే హ్యాప్టిక్‌ టెక్నాలజీ వేగంగా పురోగమిస్తోంది. మొబైల్‌ ఫోన్లు, గేమ్‌ కంట్రోళ్లలో వైబ్రేషన్‌ వంటివి హ్యాప్టిక్‌ టెక్నాలజీకి ఉదాహరణలే. శరీరానికి ధరించే కొన్ని పరికరాలు ఇందుకోసం సేంద్రియ పదార్థాలను వినియోగించుకుంటాయి. సిలికాన్‌తో కూడిన సిలేన్‌ పొరల మందాల వ్యత్యాసాలను వేలితో తాకటం ద్వారా మనం గుర్తించగలమని యూడీ శాస్త్రవేత్తలు ఇంతకుముందే గుర్తించారు. రసాయన మార్పుల కారణంగా పుట్టుకొచ్చే ఘర్షణలో తేడాల మూలంగానే ఇది సాధ్యమవుతుందని తేల్చారు. ఇలాగే పాలిమర్‌ పొరల తేడాలనూ వేలితో తాకటం ద్వారా గుర్తించగలమని తాజాగా నిరూపించారు. పాలిమర్‌ అణువుల స్ఫటికీకరణలో స్వల్ప మార్పులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి మూలంగానే వేలితో తాకినప్పుడు ఘర్షణలో తేడాలు పుట్టుకొస్తున్నాయి. ఇవే స్వల్ప మార్పులను సైతం గుర్తించటానికి వీలు కల్పిస్తున్నాయి. భౌతికంగా తాకటానికి బదులు రసాయన గుణాలతోనే స్పర్శ అనుభూతిని కలిగించే కొత్త పరికరాల రూపకల్పనకు ఇది దారితీయగలదని భావిస్తున్నారు. దీని ద్వారా మెటావర్స్‌ లాంటి కాల్పనిక వాస్తవ ప్రపంచంలో ప్రత్యక్షంగా తాకిన అనుభూతి కలగొచ్చు. మున్ముందు ఇది వర్చువల్‌ రియాలిటీని ప్రత్యక్ష ప్రపంచంగా మార్చగలదన్నా అతిశయోక్తి కాదు.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts