Published : 18 May 2022 00:50 IST

ఇక కాల్పనిక ఫొటోగ్రఫీ కాలం

ఫిల్మ్‌ ఫొటోగ్రఫీ తెలుసు. డిజిటల్‌ ఫొటోగ్రఫీ తెలుసు. మరి వర్చువల్‌ ఫొటోగ్రఫీ గురించి? ఇది తెర మీద కనిపించే దృశ్యాలను స్క్రీన్‌షాట్‌ తీయటానికి మాత్రమే సంబంధించింది కాదు. ఆన్‌లైన్‌ గేమర్స్‌ను వర్చువల్‌ ఫొటోగ్రాఫర్లుగా మారుస్తున్న కొత్త వైనం. వ్యాపార సంస్థలకు కలిసొస్తున్న కొత్త ఆకర్షణ సాధనం.

మీరొక వీడియో గేమ్‌ ఆడుతున్నారనుకోండి. మీ పాత్రను గానీ గేమ్‌లోని కృత్రిమ మేధ నియంత్రించే పాత్రను గానీ ప్రభావితం చేయకుండా కెమెరా తేలుతూ వస్తోంది. మీరు గేమ్‌లో సాహసాలు చేస్తున్నప్పుడు అది మీ ఫొటోలు తీస్తోంది. ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా. వర్చువల్‌ ఫొటోగ్రఫీ ఉద్దేశం ఇదే. నిజానికిది చాలాకాలంగా ఉన్నదే. అయితే వీడియో గేమ్స్‌ను రూపొందించేవారు ఫొటో మోడ్‌ను జోడించటం ఎక్కువవుతున్నకొద్దీ ఊపందుకుంటోంది. ఇన్‌-గేమ్స్‌ ఫొటోను షేర్‌ చేసుకునే సంస్కృతి కూడా పుంజుకుంటోంది. వర్చువల్‌ ఫొటోగ్రఫీ కేవలం వీడియో గేమ్స్‌కే పరిమితం కావటం లేదు. ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) వాడకం పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో దీన్ని వ్యాపార సంస్థలు సైతం వాడుకోవటం ఆరంభించాయి.

 వినోదంగా మొదలై..

ఇన్‌-గేమ్‌ ఫొటోలను తీసుకోవటానికి అనుమతించిన మరపురాని గేమ్స్‌లో గ్రాన్‌ టురిస్మో 4 ఒకటి. ఇది 2005లో ఆరంభమైంది. ఇందులో గేమ్‌ ఆడేవారు ‘ఫొటో మోడ్‌’ సాయంతో ట్రాక్‌ చుట్టుపక్కల తమ కార్లను, ఆయా లొకేషన్లను ఫొటోలు తీసుకోవటానికి వీలుంటుంది. కానీ ఇతర ఆటగాళ్లతో ఫొటోలను పంచుకునే సదుపాయం లేదు. ఫొటోలను క్లౌడ్‌లో అప్‌లోడ్‌ చేసుకొని, ఈమెయిల్‌ ద్వారా పంపించుకోవాల్సి ఉంటుంది. హాలో 3 రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ గేమ్స్‌లోని ‘థియేటర్‌ మోడ్‌’ సదుపాయం మూలంగా ఆన్‌లైన్‌లో గానీ ఆఫ్‌లైన్‌లో గానీ ఆడిన మ్యాచ్‌ మొత్తాన్ని రికార్డు చేసుకోవటం సాధ్యమైంది. ఇది ప్రొఫైల్‌లో ‘ఫైల్‌ షేర్‌’లో సేవ్‌ అవుతుంది. దీన్ని ఇతర ఆటగాళ్లు ప్రి-గేమ్‌ లాబీలో తేలికగా చూసుకోవచ్చు. కాలం గడుస్తున్న కొద్దీ గేమ్స్‌ అద్భుతమైన దృశ్యాలతో, వింత వింత ప్రపంచాలతో కనువిందు చేస్తూ వస్తున్నాయి. వీటన్నింటిని ఫొటోల రూపంలో భద్రపరచుకోవటం గేమ్స్‌లో ఒక భాగంగానూ మారిపోయింది. ఘోస్ట్‌ ఆఫ్‌ సుషిమా, డెత్‌ స్ట్రాండింగ్, హొరైజన్‌ ఫార్‌బిడెన్‌ వెస్ట్‌ వంటి గేమ్స్‌ దీనికి మరింత ఊతమిచ్చాయి. గేమర్స్‌ కాసేపు విశ్రాంతి తీసుకొని, ఫొటో మోడ్‌లో ఇష్టమైన చోట ఫొటోలు తీసుకోవటం ఒక ధోరణిగా స్థిరపడిపోయింది.

 ఎందుకింత ఆకర్షణ

వీడియో గేమ్స్‌ అంటే ఇష్టం లేనివారు సైతం వీటి దృశ్యాలను ఎప్పుడో అప్పుడు చూసే ఉంటారు. ఈ-కామర్స్‌ సంస్థలు వర్చువల్‌ ఫొటోలను ఇప్పటికే వాడుకుంటున్నాయి. ఈ సంస్థలు మామూలు ఫొటోలకు బదులు వర్చువల్‌ ఫొటోగ్రఫీ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాయి? వీటితో ఎలాంటి లాభాలున్నాయి?

తక్కువ ఖర్చు: సంప్రదాయ పద్ధతిలో ఫొటోలు తీయటానికి స్టుడియో, ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్, సహాయకులు కావాలి. వర్చువల్‌ ఫొటోగ్రఫీకి ఇవేమీ అవసరం లేదు. అందువల్ల ఖర్చు తగ్గుతుంది. అలాగని ప్రతి కంప్యూటర్‌తోనూ అత్యధిక నాణ్యతతో కూడిన ఫొటోలు తీస్తామంటే కుదరదు. శక్తిమంతమైన ప్రాసెసర్, మంచి గ్రాఫిక్స్‌ కార్డు, సమర్థమైన కూలింగ్‌ వ్యవస్థ, ఎక్కువకాలం మన్నే బ్యాటరీ వంటివన్నీ ఉండాల్సిందే.

స్పష్టత: ఆన్‌లైన్‌లో ఫోన్లు, కుర్చీల వంటివి కొనేటప్పుడు నమూనా ఫొటోలో అన్ని వివరాలూ స్పష్టంగా కనిపించాలని అనుకుంటాం కదా. వీటిని స్టుడియోకు తీసుకొచ్చి అన్ని కోణాల్లో, మంచి నాణ్యమైన ఫొటోలు తీయటమంటే మాటలు కాదు. శ్రమతో కూడుకున్న పని. ఇక వస్తువులు వివిధ రంగుల్లో ఉంటే ప్రతిదాన్నీ వేర్వేరు రంగుల్లో ఫొటోలు తీయటానికి ఇంకా శ్రమించాల్సి ఉంటుంది. అందుకే ఫర్నిచర్‌ కంపెనీలు ఆగ్మెంటెడ్‌ రియాలిటీ అనుభూతిని కలిగించానికి వర్చువల్‌ ఫొటోగ్రఫీని వాడుకుంటున్నాయి. గ్రాఫిక్స్, 3డీ నమూనాలతో రూపొందించే ఇవి నిజం వస్తువులనే తలదన్నేలా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఫర్నీచర్‌ ఎక్కడ పెడితే బాగుంటుంది? ఏ సైజులో, ఏ రంగులో అందంగా కనిపిస్తుంది? అనేవి యాప్‌లోనే చూసుకోవటానికివి వీలు కల్పిస్తున్నాయి.

ఎప్పుడైనా, ఎక్కడైనా: ఆరుబయట షూటింగ్‌ చేయటానికి వాతావరణమూ కలిసి రావాలి. అప్పుడే వస్తువులు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. స్టుడియోలోనూ వివిధ లైటింగ్‌ వ్యవస్థలు, లెన్సులు, చుట్టుపక్కల పరిసరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వర్చువల్‌ ఫొటోగ్రఫీకి ఇవేవీ అక్కర్లేదు. ఎప్పుడైనా ఫొటోలు తీసుకోవచ్చు. వెనకాల రంగు, ఫోకస్, ఫోకల్‌ లెంత్‌ వంటి వాటిని కెమెరా సెటింగ్స్‌తో చిటికెలో మార్చుకోవచ్చు.

భవిష్యత్తు దీనిదేనా?

ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ పరిజ్ఞానాలు రోజురోజుకీ అధునాతనంగా మారుతున్న తరుణంలో వర్చువల్‌ ఫొటోగ్రఫీ మున్ముందు ఇంకా పుంజుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గేమ్స్‌ ఆడేవారు వర్చువల్‌ ఫొటోగ్రఫీ అవార్డులు అందుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. వ్యాపార సంస్థలు తక్కువ ఖర్చుతో, మరింత నాణ్యమైన ఫొటోలు తీసుకోవటానికి మొగ్గుచూపొచ్చు. అయితే ఇది ఎంత త్వరగా పుంజకున్నా నిజ ప్రపంచ భావనను భర్తీ చేయలేదనేది మాత్రం వాస్తవం. అందమైన దృశ్య కావ్యాన్ని సృష్టించటంలో కలిగే తృప్తిని అందించలేదు. కానీ ప్రపంచ ధోరణితో పాటు భవిష్యత్తులో వర్చువల్‌ ఫొటోగ్రఫీ కూడా అత్యాధునికంగా మారిపోవచ్చు. నిజ ప్రపంచాన్ని తలదన్నే స్థాయికీ చేరుకోవచ్చు. విజువల్‌ ఎఫెక్ట్స్‌తో కూడిన సినిమాలు ఇప్పటికే మంత్రముగ్ధుల్ని చేయటం చూస్తూనే ఉన్నాం కదా.  

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని