మహత్తరంగా ఫైల్స్

ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడేవారికి గూగుల్‌ రూపొందించిన ఫైల్స్‌ యాప్‌ అతి వేగంగా అత్యవసరమైందిగా మారిపోయింది. మొదట్నుంచీ దీనికి ఎన్నెన్నో కొత్త కొత్త మహత్తరంగా ఫైల్స్‌ టూల్స్‌ తోడవ±తూనే వస్తున్నాయి. ఫైల్‌ మేనేజర్‌గానో, క్లీనప్‌ టూల్‌గానో మాత్రమే కాదు.

Published : 08 Jun 2022 01:25 IST

ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడేవారికి గూగుల్‌ రూపొందించిన ఫైల్స్‌ యాప్‌ అతి వేగంగా అత్యవసరమైందిగా మారిపోయింది. మొదట్నుంచీ దీనికి ఎన్నెన్నో కొత్త కొత్త మహత్తరంగా ఫైల్స్‌ టూల్స్‌ తోడవ±తూనే వస్తున్నాయి. ఫైల్‌ మేనేజర్‌గానో, క్లీనప్‌ టూల్‌గానో మాత్రమే కాదు.. అంతకుమించి మరెన్నో పనులకు ఉపయోగపడుతోంది. ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోదగిన దీంతో వివిధ టూల్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన అవసరమూ తప్పుతోంది. మరి దీనిలోని మంచి ఫీచర్లు, వాటిని ఉపయోగించుకోవటమెలాగో తెలుసుకుందామా.

జంక్‌ నిర్మూలన
అనవసరమైన, ఉపయోగించని ఫైళ్లు, యాప్‌లు విలువైన స్టోరేజీలో నిండిపోతాయి. ఫోన్‌ వేగాన్నీ తగ్గిస్తాయి. ఇలాంటి జంక్‌ ఫైళ్లను తొలగించుకోవటానికి ఫైల్స్‌ యాప్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని  ‘క్లీన్‌’ బటన్‌ను నొక్కితే ప్రస్తుతం ఫోన్‌లో ఎంత ఖాళీ ఉంది, ఎంత తిరిగి పొందొచ్చో తెలిసిపోతుంది. ‘జంక్‌ ఫైల్స్‌’ విభాగంలో ‘కన్‌ఫర్మ్‌ అండ్‌ ఫ్రీ అప్‌’ బటన్‌ను నొక్కితే తాత్కాలిక ఫైళ్లు పోతాయి. అదనపు ఆప్షన్స్‌ ద్వారా డూప్లికేట్‌ ఫైల్స్‌, మెమేస్‌, పాత స్క్రీన్‌ షాట్స్‌, పెద్ద ఫైల్స్‌, డౌన్‌లోడ్స్‌నూ చూడొచ్చు. ‘సెలెక్ట్‌ అండ్‌ ఫ్రీ అప్‌’ బటన్‌ను నొక్కి వాటిని రివ్యూ చేసుకోవచ్చు, డిలీట్‌ చేసుకోవచ్చు.

వేగంగా ఫైళ్ల గుర్తింపు
ఫోన్‌లో బోలెడన్ని ఫైళ్లు ఉండొచ్చు. వీటిని తేలికగా    ఫోల్డర్ల వారీగా చూసుకోవటానికి ‘బ్రౌజ్‌’ విభాగం బటన్‌ ఉపయోగపడుతుంది. దీన్ని నొక్కితే డౌన్‌లోడ్స్‌, ఇమేజెస్‌, వీడియోస్‌, ఆడియో, డాక్యుమెంట్స్‌ విభాగాలు కనిపిస్తాయి. ఆయా ఫోల్డర్‌లోకి వెళ్లి ఫైల్‌ను ఓపెన్‌ చేయొచ్చు, డిలీట్‌ చేయొచ్చు. వేరే యాప్‌తో షేర్‌ చేసుకోవచ్చు. తెర మీద కుడివైపు మూలన ఉండే సెర్చ్‌ గుర్తును ట్యాప్‌ చేసి ఫైల్‌ పేరును టైప్‌ చేస్తే అవి, వాటితో ముడిపడినవి వెంటనే కనిపిస్తాయి.

రహస్య ఫైళ్ల ఎన్‌క్రిప్షన్‌
ఫోన్‌లో రహస్య ఫొటోలు, డాక్యుమెంట్లు ఉన్నట్టయితే, అవి ఫైల్స్‌ యాప్‌లో కనిపించొద్దని అనుకుంటే ‘సేఫ్‌ ఫోల్డర్‌’ ఫీచర్‌ను వాడుకోవచ్చు. దీని ద్వారా ఎన్‌క్రిప్ట్‌ అయిన, పిన్‌తో సురక్షితమైన ప్రత్యేక ఫోల్డర్‌ను సృష్టించుకోవచ్చు. ఇది తనకుతానే లాక్‌ అవుతుంది. అందువల్ల వేరేవాళ్లెవరూ దీనిలోని ఫైళ్లను చూడలేరు. ఈ ఫీచర్‌ను సెట్‌ చేసుకోవాలంటే- బ్రౌజ్‌ స్క్రీన్‌లో కిందికి వెళ్లి ‘సేఫ్‌ ఫోల్డర్‌’ను ఎంచుకోవాలి. నాలుగంకెల పిన్‌ను ఎంటర్‌ చేసి, కన్‌ఫర్మ్‌ చేసుకోవాలి. ‘నెక్స్ట్‌’ బటన్‌, తర్వాత ‘ఓకే’ నొక్కితే ఫోల్డర్‌ క్రియేట్‌ అవుతుంది. ఏదైనా ముఖ్యమైన ఫైల్‌ను చూస్తున్నప్పుడు మూడు చుక్కల మెనూ బటన్‌ నొక్కి ‘మూవ్‌ టు సేఫ్‌ ఫోల్డర్‌’ను ఎంచుకోవచ్చు. పిన్‌ను ఎంటర్‌ చేస్తే అది ఎన్‌క్రిప్ట్‌ అయిపోతుంది. ‘మూవ్‌ అవుట్‌ ఆఫ్‌ సేఫ్‌ ఫోల్డర్‌’ను ఎంచుకుంటే తిరిగి మామూలుగా మారిపోతుంది.

అదృశ్య ఫైళ్లూ చూడొచ్చు
ఇది యాప్‌ బ్యాకప్స్‌ వంటి అదృశ్య ఫైళ్లనూ చూపిస్తుంది. ఇందుకోసం పైన ఎడమవైపు మూలన కనిపించే మూడు గీతల మెనూ బార్‌ ద్వారా సెటింగ్స్‌లోకి వెళ్లి ‘షో హిడెన్‌ ఫైల్స్‌’ను ఆన్‌ చేసుకోవాలి. వెనక్కి వచ్చి, బ్రౌజ్‌ స్క్రీన్‌ మీద ‘ఇంటర్నల్‌ స్టోరేజీ’ని ఎంచుకోవాలి. అప్పుడు అంతకుముందు కనిపించకుండా ఉన్న ఫోల్డర్లు, ఫైళ్లు కనిపిస్తాయి. అనవసరమైనవాటిని డిలీట్‌ చేసుకోవచ్చు.

షేర్‌ చేసుకోవచ్చు
గూగుల్‌ ఫైల్స్‌ యాప్‌లో అన్నింటికన్నా ఉపయోగకరమైన ఫీచర్‌ మొబైల్‌ డేటా లేకపోయినా ఆండ్రాయిడ్‌ ఫోన్ల మధ్య పెద్ద ఫైళ్లను సత్వరం పంపటం, అందుకోవటం. ఇలా షేర్‌ చేసుకునే ఫైళ్లు ఎన్‌క్రిప్ట్‌ అవుతాయి కూడా. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే రెండు ఫోన్లలోనూ ఫైల్స్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొని ఉండాలి. వై-ఫైకి కనెక్ట్‌ కావటమో లేదా బ్లూటూత్‌ అయినా వాడుకోవచ్చు. కింద కుడివైపు మూలన కనిపించే ‘షేర్‌’ బటన్‌ నొక్కి, ‘సెండ్‌’ను ఎంచుకోవాలి. లొకేషన్‌ను యాక్సెస్‌ చేసుకోవటానికి గూగుల్‌కు అనుమతి ఇవ్వటానికి ‘కంటిన్యూ’ బటన్‌ నొక్కాలి. తర్వాత యూజర్‌నేమ్‌ ఎంటర్‌ చేయాలి. అవతలివారినీ ఇలాగే చేయమని చెప్పాలి. కాకపోతే వాళ్లు ‘రిసీవ్‌’ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వారి పేరు కనిపించగానే దాని మీద ట్యాప్‌ చేసి, పంపించాల్సిన ఫైళ్లను సెలెక్ట్‌ చేసుకోవాలి. తర్వాత ‘సెండ్‌’ను ఎంచుకోవాలి.

బ్యాకప్‌ ఫైల్స్‌
ఆన్‌లైన్‌లో ఫైలు కాపీని క్రియేట్‌ చేసుకోవాలనుకున్నా, ఫైళ్లను ఆన్‌లైన్‌లోకి పంపించి ఫోన్‌ స్పేస్‌ను ఖాళీ చేసుకోవాలనుకున్నా ఫైల్స్‌ యాప్‌తో నేరుగా బ్యాకప్‌ చేసుకోవచ్చు. ఫైలును ఎంచుకొని, మూడు చుక్కల మెనూను నొక్కి ‘బ్యాకప్‌ టు గూగుల్‌ డ్రైవ్‌’ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరి. ఒకవేళ వన్‌డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌ వంటి క్లౌడ్‌ స్టోరేజీ యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసుకున్నట్టయితే వాటిల్లోనూ బ్యాకప్‌ చేసుకోవచ్చు. ఫోన్‌లోంచి ఎస్‌డీ కార్డులోకీ తేలికగా ఫైలును పంపించుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. ఇందుకోసం బ్రౌజ్‌ ద్వారా ఇంటర్నల్‌ స్టోరేజీలోకి వెళ్లి ఫైళ్లను ఎంచుకోవాలి. తర్వాత ‘మూవ్‌ టు’ లేదా ‘కాపీ టు’ ఆప్షన్లతో ‘ఎస్‌డీ కార్డు’ను ఎంచుకుంటే సరి.

మీడియా ఫైళ్లు ప్లే
వీడియో, ఆడియో ఫైళ్లను తేలికగా చూసుకోవటానికే కాదు, వేరే యాప్‌లతో పనిలేకుండా వాటిని ప్లే చేసుకోవచ్చు. ఫైల్స్‌ యాప్‌లో ఇన్‌బిల్ట్‌గా మీడియా ప్లేయర్‌ కూడా ఉంటుంది మరి. బ్రౌజ్‌ స్క్రీన్‌లో వీడియో విభాగాన్ని ఓపెన్‌ చేసి, క్లిప్‌ను ట్యాప్‌ చేస్తే ప్లే అవుతుంది. ఫోన్‌ కెమెరాతో తీసినవి, ఫోన్‌లో స్టోర్‌ అయినవి.. ఎలాంటి వీడియోలనైనా చూసుకోవచ్చు. మూడు చుక్కల మెనూ ద్వారా ప్లేబ్యాక్‌ వేగాన్నీ నిర్ణయించుకోవచ్చు. ఆడియో విభాగంలో యాప్‌ నోటిఫికేషన్‌ సౌండ్స్‌, ఫోన్‌తో రికార్డు చేసిన ఫైళ్లు ఉంటాయి. మీడియా ప్లేయర్‌లో మూడు చుక్కల మెనూ ద్వారా ఆడియో ఫైలును రింగ్‌టోన్‌గానూ సెట్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని