Camera Finder: మొబైల్‌తో నిఘా కెమెరాలను ఇలా గుర్తించొచ్చు!

రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీయటానికి కొందరు కావాలని నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇవి హోటల్‌ గదులు, జిమ్‌లు, అద్దె ఇళ్లు.. చివరికి సొంత ఇంటిలోనూ ఎక్కడైనా ఉండొచ్చు. వీటిని గుర్తించటం అంత తేలిక కాదు.

Updated : 17 Aug 2022 17:56 IST

హస్యంగా ఫొటోలు, వీడియోలు తీయటానికి కొందరు కావాలని నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇవి హోటల్‌ గదులు, జిమ్‌లు, అద్దె ఇళ్లు.. చివరికి సొంత ఇంటిలోనూ ఎక్కడైనా ఉండొచ్చు. వీటిని గుర్తించటం అంత తేలిక కాదు. ప్రస్తుతం 2 మిల్లీమీటర్లంత చిన్న కటకాలతో కూడిన కెమెరాలూ ఉన్నాయి. పరిసరాల్లో కలిసిపోయి, ఏమాత్రం కనిపించకుండా కూడా వీటిని అమర్చొచ్చు. అనుమానాస్పద ప్రాంతాల్లో నిఘా కెమెరాలను గుర్తించటానికి నిపుణుల సాయం తీసుకోవచ్చు. ప్రత్యేకమైన పరికరాలతో పసిగట్టొచ్చు. అయితే ఇవి అన్నిసార్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఖర్చూ అవుతుంది. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. స్మార్ట్‌ఫోన్‌తోనూ తేలికగా, పెద్దగా ఖర్చు లేకుండా నిఘా కెమెరాలను గుర్తించొచ్చు.

* ముందుగా గదిలోని లైట్లను తీసేయాలి. కర్టెన్లతో కిటికీలను మూసేయాలి. లోపల చీకటిగా ఉండేలా చూసుకోవాలి.

* ఫోన్‌లో ఫ్లాష్‌లైట్‌, కెమెరా.. రెండింటినీ ఒకేసారి ఆన్‌ చేయాలి. నిఘా కెమెరా ఉండొచ్చని అనుమానిస్తున్న చోటు మీద ఫోన్‌ కెమెరాను ఫోకస్‌ చేయాలి.

* అక్కడ నిఘా కెమెరా ఉన్నట్టయితే ఫోన్‌ తెర మీద వెలుగు మెరుపులు కనిపిస్తాయి.

* ఒకవేళ ఫోన్‌లో ఫ్లాష్‌లైట్‌, కెమెరా రెండింటినీ ఒకేసారి ఆన్‌ చేయటం కుదరకపోతే వేరే ఫ్లాష్‌లైట్‌ను ఉపయోగించాలి.

ఫ్లాష్‌లైట్‌ లేకపోయినా..

కొన్నిసార్లు ఫ్లాష్‌లైట్‌ లేకపోయినా నిఘా కెమెరాలను గుర్తించొచ్చు. చాలా నిఘా కెమెరాలు చీకటిలో దృశ్యాలను చిత్రీకరించటానికి ఇన్‌ఫ్రారెడ్‌ కాంతిని వాడుకుంటాయి. ఇది మన కంటికి కనిపించదు. కానీ దీన్ని స్మార్ట్‌ఫోన్‌ కెమెరా గుర్తించగలదు. చీకటిలో ఫోన్‌తో వీడియో తీస్తున్నప్పుడు ఇది వెలుగుతూ, ఆరుతున్న చుక్క మాదిరిగా కనిపిస్తుంది. అయితే ఫోన్‌ మెయిన్‌ కెమెరా దీన్ని పసిగట్టలేదు. ఎందుకంటే ఇందులో ఇన్‌ఫ్రారెడ్‌ కాంతి ఫిల్టర్‌ ఉండొచ్చు. అందువల్ల ముందు కెమెరాతో వీడియో తీసి చూడటం మంచిది. ఇన్‌ఫ్రారెడ్‌ కాంతిని ఫోన్‌ గుర్తిస్తుందో లేదో తెలుసుకోవటానికి టీవీ రిమోట్‌తో పరీక్షించి చూడొచ్చు కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని