బుక్‌మార్క్‌ యాప్‌రే!

ఇంటర్నెట్‌లో విహరిస్తుంటాం. ట్విటర్‌లో ట్వీట్లను చూస్తుంటాం. ఏదో కథనం ఆకర్షించొచ్చు. ఏదో ట్వీట్ల మాల ఆసక్తికరంగా అనిపించొచ్చు. కానీ పూర్తిగా చదవటానికి సమయం దొరక్కపోవచ్చు.

Updated : 07 Sep 2022 10:13 IST

ఇంటర్నెట్‌లో విహరిస్తుంటాం. ట్విటర్‌లో ట్వీట్లను చూస్తుంటాం. ఏదో కథనం ఆకర్షించొచ్చు. ఏదో ట్వీట్ల మాల ఆసక్తికరంగా అనిపించొచ్చు. కానీ పూర్తిగా చదవటానికి సమయం దొరక్కపోవచ్చు. తీరిక దొరికినప్పుడు చదువుదామని అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే బుక్‌మార్కింగ్‌ యాప్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. నిజానికివి కొత్తవేమీ కావు. కానీ రోజురోజుకీ మెరుగవుతూ వస్తున్నాయి. కథనాలను, ట్విటర్‌ థ్రెడ్లను, చివరికి మొత్తం వెబ్‌సైట్లను సేవ్‌ చేసుకోవటానికి.. తిరిగి చదువుకోవటానికి బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం.


మ్యాటర్‌

ఇది ఐఓఎస్‌ పరికరాలకు, వెబ్‌లోనే అందుబాటులో ఉండే యాప్‌. ఇతర బుక్‌మార్కింగ్‌ యాప్‌ల మాదిరిగానే దానంతటదే సేవ్‌ చేసిన తేదీల వారీగా కథనాల జాబితాను తయారుచేస్తుంది. కావాలంటే ముందుగా చదవాలని అనుకునే కథనాల వారీగా వీటి క్రమాన్ని మార్చుకోవచ్చు. అప్పటికే చదవటం మొదలెట్టిన వాటిని, చిన్న చిన్న కథనాలను ఫిల్టర్ల సాయంతో వెతుక్కోవచ్చు. వాటిని అన్నింటికన్నా పైన ఉండేలా చూసుకోవచ్చు. ఇలా మ్యాటర్‌ యాప్‌లో కథనాల క్రమం చాలా బాగా పనిచేస్తుందన్నమాట. ఇతర యాప్‌ల్లోనూ ఇలాంటి సదుపాయం ఉంటుంది గానీ సెటింగ్స్‌లోకి వెళ్లి మార్చు కోవాల్సి ఉంటుంది. మ్యాటర్‌ అయితే దానంతటదే ఈ పని చేసుకొని పోతుంది. పాకెట్‌ లేదా ఇన్‌స్టాపేపర్‌ వంటి ఇతర యాప్‌ల జాబితాలనూ ఇంపోర్ట్‌ చేసుకోవచ్చు.


ఇన్‌స్టాపేపర్‌

మామూలు వెబ్‌ యాడ్‌ ఆన్‌గా మొదలైన ఇన్‌స్టాపేపర్‌ ఇప్పుడు క్లీన్‌ యూఐతో పూర్తిస్థాయి యాప్‌గా రూపాంతరం చెందింది. ఉచిత ఖాతాతో లెక్కలేనన్ని కథనాలు, వీడియోలు, ఇతర కంటెంట్‌ను సేవ్‌ చేసుకోవచ్చు. సేవ్‌ చేసిన కథనాల్లో ముఖ్యమైన విషయాలను హైలెట్‌ చేసుకోవటానికీ ఇందులో ఆప్షన్‌ ఉంది. పెయిడ్‌ వర్షన్‌లోనైతే సేవ్‌ చేసిన డాక్యుమెంట్లు, నోట్స్‌, టెక్స్ట్‌-టు-స్పీచ్‌ అన్నింటి మొత్తం టెక్స్ట్‌లోనూ అవసరమైన అంశాన్ని సెర్చ్‌ చేసి చూసుకోవచ్చు.


పాకెట్‌

కథనాలను స్కాన్‌ చేసుకోవాలని భావించే అందరికీ తెలిసిన యాప్‌ ఇది. ఆన్‌లైన్‌లో ఎక్కడ్నుంచైనా కథనాలను, వార్తలను, క్రీడలను, వీడియోలను అన్నింటినీ సేవ్‌ చేసేస్తుంది. దీని హోం స్క్రీన్‌ మీద తాజాగా స్టోర్‌ చేసినవి ‘బెస్ట్‌ ఆఫ్‌ ద వెబ్‌’ పేరుతో కనిపిస్తాయి. వీటిని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకోవచ్చు, యాప్‌లో ఇతరులకు సిఫారసు చేయొచ్చు. దీన్ని ఉచితంగానే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రీమియం వర్షన్‌లోనైతే సేవ్‌ చేసిన కథనాలు లైబ్రరీలో శాశ్వతంగా ఉండిపోతాయి. వెబ్‌సైట్‌ నుంచి అదృశ్యమైనా సరే అలాగే ఉంటాయి. ప్రీమియం ఫాంట్స్‌ వంటి ఇతర ఫీచర్లనూ ఉపయోగించుకోవచ్చు.


రెయిన్‌డ్రాప్‌.ఐఓ

సమగ్రమైన బుక్‌మార్క్‌ మేనేజర్లలో ఇదొకటి. వెబ్‌ లింకులను ఫోల్డర్లు, ఉప ఫోల్డర్లుగా సేవ్‌ చేసుకోవటానికి అవసరమైన టూల్స్‌, ఫీచర్లు దీని సొంతం. వీటిల్లోంచి అవసరమైన అంశాలను వెతుక్కోవటానికి ఫిల్టర్లు, ట్యాగ్స్‌ కూడా ఉంటాయి. బుక్‌మార్కులను విభాగాలుగా వర్గీకరించుకున్నాక వాటికి నోట్స్‌ను యాడ్‌ చేసుకోవచ్చు. యాప్‌ నుంచి బయటకు వెళ్లకుండానే లింక్‌ల ప్రివ్యూలనూ చూసుకోవచ్చు. రెయిన్‌డ్రాప్‌.ఐఓ యాప్‌ నుంచి లింక్‌లను షేర్‌ చేసుకోవటం తేలిక. సెర్చ్‌ చేస్తున్నప్పుడే వెబ్‌పేజీలోని మొత్తం కంటెంట్‌ కనిపిస్తుంటుంది. బుక్‌మార్క్‌ జాబితాను బ్యాకప్‌ చేసుకోవటానికి డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌ వంటి ఇతర యాప్‌లతోనూ ఇది ఇట్టే ఇమిడిపోతుంది. మరిన్ని ఎక్కువ ఫీచర్లు కావాలంటే పెయిడ్‌ వర్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.


బుక్‌మార్క్‌ నింజా

క్లీన్‌ ఇంటర్ఫేస్‌తో కూడిన దీనిలో ఒక్క క్లిక్‌తోనే బుక్‌మార్క్‌ను యాడ్‌ చేసుకోవచ్చు. బుక్‌మార్కులను బృందాలుగా విభజించుకోవటం, ఇతరులతో షేర్‌ చేసుకోవటం, వివిధ లేఅవుట్లను ఎంచుకోవటం అన్నీ తేలికే. ఇది డుప్లికేట్‌ లింక్‌లను గుర్తించి, వాటిని నిర్మూలిస్తుంది కూడా. ఇలా జాబితాను క్రమ పద్ధతిలో ఉంచుతుంది. కాకపోతే దీన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. పరీక్షించి చూడాలనుకుంటే 30 రోజుల ఉచిత ట్రయల్‌ను వాడుకోవచ్చు.


డ్రాప్‌మార్క్‌

ఇది బుక్‌మార్క్‌లను తేలికగా వెతుక్కునేలా చేయటమే కాదు, వాటిని అందంగా కనిపిచేలా కూడా చేస్తుంది. వాటికి టెక్స్ట్‌, ఇమేజ్‌, వీడియోలను జోడించు కోవటానికీ వీలు కల్పిస్తుంది. ఒక్కరే కాదు, బృందంగానూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. బుక్‌ మార్కులను ఆయా విభాగాలుగా వర్గీకరించుకోవచ్చు. వీటిల్లో వివిధ రకాల ఉప విభాగాలనూ సృష్టించు కోవచ్చు. ప్రతి బుక్‌మార్కుకు ప్రత్యేకమైన లేఅవుట్‌ను సైతం సృష్టించుకోవచ్చు. ఉచిత వర్షన్‌లోనే మామూలు అవసరాలకు కావాల్సిన అన్ని ఫీచర్లు ఉంటాయి. మరిన్ని అదనపు సదుపాయాలు కావాలంటే పెయిడ్‌ వర్షన్‌కు వెళ్లాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని