బాల్‌ రే బాల్‌!

ఫుట్‌బాల్‌. అత్యంత ఆదరణ పొందిన ప్రపంచ క్రీడ. ఒక్క కిక్‌తోనే బాల్‌తో చిత్ర విచిత్రాలు చేయించే క్రీడాకారులు.. ఏ క్షణం ఏమవుతుందోననే ఆసక్తితో వీక్షించే అభిమానులు.. కేరింతలతో దద్దరిల్లే స్టేడియాలు..

Updated : 30 Nov 2022 00:20 IST

ఫుట్‌బాల్‌. అత్యంత ఆదరణ పొందిన ప్రపంచ క్రీడ. ఒక్క కిక్‌తోనే బాల్‌తో చిత్ర విచిత్రాలు చేయించే క్రీడాకారులు.. ఏ క్షణం ఏమవుతుందోననే ఆసక్తితో వీక్షించే అభిమానులు.. కేరింతలతో దద్దరిల్లే స్టేడియాలు.. మొత్తంగా అదో నయనాందకర విన్యాసం. ఇక వరల్డ్‌ కప్‌ పోటీలంటే చెప్పేదేముంది? అనుక్షణమూ ఆసక్తే. అందుకే అధునాతన టెక్నాలజీలకూ ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పోటీలను మరింత బాగా ఆస్వాదించటానికే కాదు.. బంతి ప్రతి కదలికలను నిశితంగా గమనించటానికీ ఎన్నో కొంగొత్త పరిజ్ఞానాలను ప్రస్తుత ఫిఫా వరల్డ్‌ కప్‌లో వాడుకుంటున్నారు. స్టేడియం సదుపాయాల విషయంలోనూ వెనక్కి తగ్గటం లేదు. ప్రపంచ కప్‌ పోటీలకు ఆతిథ్యమిస్తున్న ఖతార్‌ పదేళ్ల ముందు నుంచే వీటిపై దృష్టి సారించింది. గత కొన్నేళ్లుగా ప్రపంచ కప్‌ పోటీలపై ఆధిపత్యం చూపిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలు ఈసారి మరింత కొత్తగానూ అలరిస్తున్నాయి. వరల్డ్‌ కప్‌ పోటీలను ఇవి మరింత ఆకర్షణీయంగా మలుస్తున్నాయి. మరి వీటి విశేషాలేంటో చూద్దామా!


అధునాతన శీతల వ్యవస్థ

ఖతార్‌లో ప్రపంచకప్‌ అనగానే అందరినీ కలవరపెట్టింది వాతావరణమే. అక్కడి నేల రాళ్లు, రప్పలతో కూడుకొని ఉండటం వల్ల వేడి ఎక్కువ. గాలిలో తేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం అక్కడ వేసవి కాలం. ఇలాంటి వాతావరణంలో ఆటలు ఆడాలంటే ఎవరికైనా కష్టమే. చూసేవారికీ ఇబ్బందే. అలాగని ఖతార్‌ భయపడలేదు. వరల్డ్‌ కప్‌ పోటీలు జరిగే స్టేడియాల్లో అధునాతన కూలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి ఔరా అనిపించింది. పదేళ్ల ముందు నుంచే దీని కోసం సన్నాహాలు ఆరంభించటం గమనార్హం. పోటీలు జరుగుతున్న 8 స్టేడియాల్లో ఏడింటిలో అధునాతన కూలింక్‌ వ్యవస్థను అమర్చారు. స్టేడియం లోపల ఆటగాళ్లకే కాదు, వీక్షకులకూ అసౌకర్యం కలగకుండా తగినంత ఉష్ణోగ్రత ఉండేలా చూడటం దీని ప్రత్యేకత. సమీపంలోని ఎనర్జీ కేంద్రాల నుంచి పైపుల ద్వారా వీటిల్లోకి చల్లటి నీటిని సరఫరా చేయటం దీనిలోని కీలకాంశం. ఈ నీరు స్టేడియంలోకి ప్రవేశించగానే చల్లటి గాలిగా మారి నాజిల్స్‌ ద్వారా మైదానం మొత్తం విస్తరిస్తుంది. ప్రేక్షకులు కూర్చునే సీట్ల వద్దా చల్లగాలి ప్రసరిస్తుంది. చల్లటి గాలి బయటకు రాకుండా చూడటానికి స్టేడియాల వెలుపల గోడకు ప్రత్యేకమైన సూక్ష్మ రంధ్రాలతో కూడిన ప్యానెళ్ల ‘చర్మాన్ని’ నిర్మించారు. దీనికి ఎడారిలో నివసించే తొండలను స్ఫూర్తిగా తీసుకోవటం విశేషం. ఈ తొండలు తమ చర్మం మీది పొలుసుల సాయంతో గాలిని దారి మళ్లిస్తాయి. ఇలా చల్లగా ఉండేలా చూసుకుంటాయి. ప్రపంచ కప్‌ సందర్భంగా ఆటగాళ్లకు, ప్రేక్షకులకు ఇలాంటి శీతల అనుభూతి కలిగించే పరిజ్ఞానాన్ని, వ్యవస్థలను వాడుకోవటం ఇదే మొదటిసారి.

* ఒక్క 974 స్టేడియంలోనే అధునాతన శీతల వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే దీనిలోకి సహజంగానే గాలి ధారాళంగా వచ్చి, పోతుంటుంది. సముద్ర తీరానికి దగ్గర్లో ఉండటం వల్ల దీనికి శీతల వ్యవస్థ అవసరం లేకపోయింది.


బోనకుల్‌

చూపు కోల్పోయినవారు సైతం ప్రపంచకప్‌ పోటీలను ఆస్వాదించే ఏర్పాటు చేయటం విశేషం. ఇందుకోసం బోనకుల్‌ అనే వినూత్న పరికరాన్ని రూపొందించారు. ఇది డిజిటల్‌ కంటెంట్‌ను తనకు తానే బ్రెయిలీ లిపిలోకి మార్చేస్తుంది. దీంతో ఎప్పటికప్పుడు ఆయా మ్యాచ్‌ల విశేషాలను, సమాచారాన్ని ఇట్టే తెలుస్తుంది. ‘ఛాలెంజ్‌ 22’ అనే కార్యక్రమాన్ని నిర్వహించి, దాని ఫలితాల ఆధారంగా ఈ పరికరాన్ని రూపొందించారు.


విప్పదీసే స్టేడియం

ప్రపంచకప్‌ ముగిశాక 974 స్టేడియం కనిపించకపోవచ్చు. దీన్ని పూర్తిగా విప్పదీసేలా నిర్మించారు మరి. పూర్తిగా విడదీయటానికి వీలుండే స్టీలు చట్రాలు, ఓడ సరకు రవాణా పెట్టెలతోనే దీన్ని నిర్మించారు. ఆకర్షణీయంగా కనిపించేలా తీర్చిదిద్దారు. సంప్రదాయ స్టేడియాలతో పోలిస్తే తక్కువ సామగ్రితో కట్టటం వల్ల ఇది చవకగానూ సిద్ధమైంది. ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ చరిత్రలోనే పూర్తిగా విడదీయగల స్టేడియంగానూ ఇది చరిత్ర సృష్టించనుంది. పదహారో రౌండ్‌ ముగిసిన తర్వాత దీనిలో 7 పోటీలను నిర్వహించనున్నారు.


సెమీ ఆటోమేటెడ్‌ ఆఫ్‌సైడ్‌ పరిజ్ఞానం

ఇది వీడియో అసిస్టెంట్‌ రెఫ్రీలు (వీఏఆర్‌), మైదానంలోని అధికారులు త్వరగా, మరింత కచ్చితంగా నిర్ణయాలు తీసుకోవటానికి తోడ్పడే పరిజ్ఞానం. ఇందుకోసం స్టేడియం చుట్టూరా కప్పు కింద 12 నిఘా కెమెరాలను, ప్రతీ ఆటగాడికి 29 డేటా కేంద్రాలను అమర్చటం గమనార్హం. మైదానం మీద కచ్చితమైన స్థితిని గుర్తించటానికి ఇది సెకండుకు 50 సార్లు సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ పరిజ్ఞానం కొత్త అల్‌ రిహ్లా బంతిలోని సెన్సర్‌తో కలిసి పనిచేస్తుంది. కృత్రిమ మేధ సాయంతో దానంతటదే మైదానం వెలుపల వీఏఆర్‌లకు వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఆటగాడు మైదానం వెలుపలి గీతను దాటినప్పుడు ఎక్కువసేపు వీడియోను రిప్లే చేయాల్సిన అవసరం తప్పుతుంది.

3డీ యానిమేషన్‌: వీఏఆర్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పరిజ్ఞానం కెమెరాలు, బాల్‌ నుంచి అందిన సమాచారం ఆధారంగా 3డీ యానిమేషన్‌ను సృష్టిస్తుంది. ఇది ఆటగాళ్ల స్థితిని కచ్చితంగా తెలియజేస్తుంది. బంతిని తన్నినప్పుడు ఆటగాళ్ల కాళ్లను స్పష్టంగా చూపిస్తుంది. ఈ 3డీ దృశ్యాలను స్టేడియంలో తెరల మీదా చూపిస్తారు. ఫిఫా ప్రపంచకప్‌ను ప్రసారం చేసే సంస్థలకూ దీన్ని అందిస్తారు. దీంతో ప్రేక్షకులకు ఆటకు సంబంధించిన వివరాలు స్పష్టంగా తెలుస్తాయి.


బంతి కనికట్టు!

ఫెనాల్టీ కిక్‌ లభించింది. ఆటగాడు బంతిని వేగంగా తన్నాడు. అది గాల్లో తేలుతూ దూసుకుపోతుంటుంది. మొదట్లో అది గోల్‌ బయటకు పోతున్నట్టే ఉంటుంది. అంతలో ఏదో మాయ చేసినట్టు, ఏదో అదృశ్య శక్తి నెట్టినట్టు బంతి దారి మారుతుంది. వంపు తిరిగి నేరుగా గోల్‌ పోస్టులో పడిపోతుంది. గోల్‌ కీపర్‌ హతాశుడవుతాడు. అభిమానులు ఆనంద పరవశు లవుతారు. ఇంతకీ బంతి గాలిలో ఉన్నట్టుండి దిశను ఎలా మార్చుకుంటుంది? దీని వెనక ఇమిడి ఉన్నది భౌతికశాస్త్ర సూత్రమే!
క్రీడాకారుడు బంతిని మధ్యభాగంలో తన్నినప్పుడు అది గుండ్రంగా తిరుగుతుంది. బంతి గాల్లో దిశను మార్చుకోవటానికి కారణమిదే. బంతి దిశ ఎంత వంపుతో మారాలనేది బంతి వెళ్లే మార్గం, గుండ్రంగా తిరిగే వేగం మీద ఆధారపడి ఉంటుంది. గాలిలో బంతి దిశ ఒకవైపునకు ఒరగటాన్ని మాగ్నస్‌ ఎఫెక్ట్‌ అంటారు. బంతి గిరగిరా తిరుగుతున్నప్పుడు బంతి, గాలి మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. అప్పుడు బంతి తిరిగే దిశకు గాలి ప్రతిస్పందిస్తుంది. గాలి వేగం తగ్గినప్పుడు దాని పీడనం పెరుగుతుందనేది బెర్నౌలీ సూత్రం నియమం. దీని ప్రకారం.. బంతి పైనుంచి కిందికి గుండ్రంగా తిరుగుతున్నప్పుడు దాని సగభాగం పైన గాలి చలన వేగం తగ్గుతుంది. అదే సమయంలో కింది సగభాగంలో గాలి వేగం తగ్గుతుంది. ఫలితంగా బంతి పైగాన పీడనం పెరిగి, అధోముఖ బలం ఏర్పడి బంతి గమనం మారుతుంది. క్రీడాకారుడు బంతి మధ్యన కుడివైపున తంతే అది అపసవ్య దిశలో తిరుగుతుంది. మాగ్నస్‌ బలం ఎడమ వైపున పనిచేస్తుంది. దీంతో బంతి గాల్లో ఎడమ వైపునకు వంగుతుంది. అదే బంతి మధ్యన ఎడమ వైపున తంతే అది సవ్య దిశలో తిరుగుతుంది. గాల్లో బంతి కుడి వైపునకు వంగుతుంది.


అల్‌ రిహ్లా బంతి

అధికారిక ప్రపంచకప్‌ పుట్‌బాల్‌ పేరేంటో తెలుసా? అల్‌ రిహ్లా. అంటే అరబిక్‌ భాషలో ‘ప్రయాణం’ అని అర్థం. అధునాతన పరిజ్ఞానంతో కూడిన లింక్డ్‌ బాల్‌ సిస్టమ్‌ దీని ప్రత్యేకత. దీని మధ్యలో మోషన్‌ సెన్సర్లతో కూడిన కొత్త అడిడాస్‌ సస్సెన్షన్‌ సిస్టమ్‌ ఉంటుంది. అత్యంత వేగంతో దూసుకుపోతున్నా ఇది బంతి వేగాన్ని గుర్తించగలదు. ప్రపంచకప్‌ చరిత్రలోనే ఇంత వేగంగా గాల్లో దూసుకుపోయే బంతి మరోటి లేదని ఫిపా పేర్కొంటోంది. కిక్‌ పాయింట్‌ను సస్పెన్షన్‌ సిస్టమ్‌ చాలా కచ్చితంగా గుర్తిస్తుంది. వీడియో ఆపరేషన్‌ గదికి సెకండుకు 500 సార్లు బంతికి సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తుంది. ఇది ఫిఫా వినూత్న సెమీ ఆటోమేటిక్‌ పరిజ్ఞానంతో కలిసి పనిచేస్తుంది. ఇలాంటి అధునాతన పరిజ్ఞానంతో కూడిన బంతిని ప్రపంచకప్‌లో వాడుకోవటం ఇదే మొదటిసారి.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని