ఎమోజీ పాస్‌వర్డ్‌!

పాస్‌వర్డ్‌ అనగానే అక్షరాలు, అంకెలు, చిహ్నాలే గుర్తుకొస్తాయి. వీటితో కూడిన సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవటం కష్టం. అన్నింటికీ ఒకే పాస్‌వర్డ్‌ను పెట్టుకున్నా.. తేలికైన, పొట్టి పాస్‌వర్డ్‌లు సృష్టించుకున్నా హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉండనే ఉంది. మరెలా?

Updated : 13 Dec 2023 10:03 IST

పాస్‌వర్డ్‌ అనగానే అక్షరాలు, అంకెలు, చిహ్నాలే గుర్తుకొస్తాయి. వీటితో కూడిన సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవటం కష్టం. అన్నింటికీ ఒకే పాస్‌వర్డ్‌ను పెట్టుకున్నా.. తేలికైన, పొట్టి పాస్‌వర్డ్‌లు సృష్టించుకున్నా హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉండనే ఉంది. మరెలా? ఎమోజీలనే పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటే? స్మైలీలు, అందమైన గుర్తుల వంటి ఎమోజీలను గుర్తుంచుకోవటం తేలిక. హ్యాకర్లు కూడా వీటిని అంత త్వరగా పట్టుకోలేకపోవచ్చు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లలో బోలెడన్ని ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి. ప్రామాణిక యూనికోడ్‌లో భాగమైన వీటిని ఎలాంటి టెక్స్ట్‌లోనైనా జోడించుకోవచ్చు. పాస్‌వర్డ్‌గానూ పెట్టుకోవచ్చు.

ఎమోజీలతో కూడిన పాస్‌వర్డ్‌ అక్షరాల మాదిరిగా మరీ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. ఐదారు ఎమోజీలతోనైనా బలమైన పాస్‌వర్డ్‌ను నిర్ణయించుకోవచ్చు. ఐదు వేర్వేరు ఎమోజీలు మామూలు 9 క్యారెక్టర్ల పాస్‌వర్డ్‌తో సమానంగా భద్రత కల్పిస్తాయి. అదే ఏడు ఎమోజీలను ఎంచుకుంటే 13 క్యారెక్టర్ల మాదిరిగా రక్షణ కల్పిస్తుంది. ఎమోజీల వరుసను గుర్తుంచుకోవటం తేలిక. అర్థం పర్థంలేని అక్షరాలు, సంకేతాలు, అంకెలకు బదులు సహేతుకమైన వాక్యం స్ఫురించేలా కూడా ఎమోజీలను ఎంచుకోవచ్చు. కావాలంటే ఇందుకోసం ఎమోజీ ట్రాన్స్‌లేటర్‌ లేదా ఛాట్‌జీపీటీ వంటి ఛాట్‌బాట్ల సాయం తీసుకోవచ్చు కూడా. ఉదాహరణకు ‘ఐయామ్‌ ఆన్‌ ద స్కై’ అనే వాక్యాన్ని ఎమోజీల రూపంలోకి అనువదించమని అడిగితే తగిన వాటిని వరుసగా సూచిస్తాయి. పాస్‌వర్డ్‌లను సంగ్రహించటానికి వాడే హ్యాకింగ్‌ టూల్స్‌ చాలావరకు పదాలు, సంఖ్యలు, చిహ్నాల వంటి వాటినే వెతుకుతాయి. అందువల్ల ఎమోజీ పాస్‌వర్డ్‌ ఒకింత సురిక్షితమేనని చెప్పుకోవచ్చు.

ఎలా సృష్టించుకోవాలి?

మొత్తం ఎమోజీలతోనే పాస్‌వర్డ్‌ను సృష్టించుకోవటం కన్నా అక్షరాలు, అంకెల మధ్య వీటిని జొప్పించుకుంటే మరిత బలంగా ఉంటుంది. అలాగని పొడవైన పాస్‌వర్డ్‌లు, పాస్‌వర్డ్‌ మేనేజర్‌, టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ వంటి సంప్రదాయ భద్రత మార్గాలకు ఎమోజీలు ప్రత్యామ్నాయం అనుకోవటానికి లేదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూనే ఎమోజీ పాస్‌వర్డ్‌లు ఎంచుకోవచ్చు. పాస్‌వర్డ్‌ మేనేజర్లు వీటిని కూడా స్టోర్‌ చేసుకుంటాయి. 2ఎఫ్‌ఏ కోడ్స్‌నూ సృష్టిస్తాయి.

ఎలా ఎంటర్‌ చేయాలి?

పరికరం, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను బట్టి ఎమోజీ పాస్‌వర్డ్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లలో వీటికి విడిగా ప్రత్యేక కీబోర్డు విభాగం ఉండటం తెలిసిందే. కంప్యూటర్లలోనైతే వేరే మార్గంలో ప్రయత్నించాలి.

  • విండోస్‌ 10 లేదా 11లో విండోస్‌, ప్లస్‌ మీటలను ఒకేసారి నొక్కితే ఎమోజీ టేబుల్‌ ప్రత్యక్షమవుతుంది.
  • మ్యాక్‌ఓఎస్‌లో ఎడిట్‌ ద్వారా ఎమోజీ అండ్‌ సింబల్స్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం కమాండ్‌, కంట్రోల్‌, స్పేస్‌బార్‌ మీటలను కలిపి నొక్కాలి.

చిక్కులు లేకపోలేదు

ఎమోజీ పాస్‌వర్డ్‌ల విషయంలో కొన్ని చిక్కులు లేకపోలేదు. వీటిని అన్ని సర్వీసులు అనుమతించ కపోవచ్చు. మైక్రోసాఫ్ట్‌/అవుట్‌లుక్‌, గూగుల్‌/జీమెయిల్‌ వంటివి తిరస్కరించొచ్చు. కానీ డ్రాప్‌బాక్స్‌, ఓపెన్‌ఏఐ వంటివి అనుమతిస్తాయి. కొన్నిసార్లు ఎమోజీ పాస్‌వర్డ్‌తో ఖాతాను సృష్టించుకున్నా సైన్‌ఇన్‌ అయ్యేటప్పుడు వెరిఫికేషన్‌లో విఫలం కావొచ్చు. కాబట్టి ఎమోజీ పాస్‌వర్డ్‌తో ప్రయోగాలు చేస్తూ.. అనుమతించిన చోట వాడుకోవటానికి ప్రయత్నించొచ్చు. స్మార్ట్‌ఫోన్ల మీద ఎమోజీలను ఎంటర్‌ చేయటం తేలికే గానీ డెస్క్‌టాప్‌ కంప్యూటర్లలో ఇబ్బంది కలిగించొచ్చు. చాలా స్మార్ట్‌ఫోన్‌ కీబోర్డుల మీద అంతకుముందు వాడిన ఎమోజీలు ప్రత్యక్షమవుతాయి. వీటిని హ్యాకర్లు అంత తేలికగా పట్టుకోలేకపోవచ్చు గానీ మన ఫోన్లను వాడే స్నేహితులు, కుటుంబసభ్యులు అంచనా వేసే అవకాశమైతే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని