వాట్సప్‌ మాటలు అక్షరాల్లో

వాట్సప్‌లో వాయిస్‌ మెసేజ్‌లు కొత్త కాదు. కానీ ఆ మాటలు అక్షరాలుగా మారితే? ఇలాంటి వినూత్న ఫీచర్‌ మీద వాట్సప్‌ దృష్టి సారించింది. ఇది ఫోన్‌లో నేరుగా మాటలను అక్షరాల రూపంలోకి మార్చేస్తుంది.

Updated : 19 Jun 2024 00:15 IST

వాట్సప్‌లో వాయిస్‌ మెసేజ్‌లు కొత్త కాదు. కానీ ఆ మాటలు అక్షరాలుగా మారితే? ఇలాంటి వినూత్న ఫీచర్‌ మీద వాట్సప్‌ దృష్టి సారించింది. ఇది ఫోన్‌లో నేరుగా మాటలను అక్షరాల రూపంలోకి మార్చేస్తుంది. ఐఫోన్‌లో బీటా వర్షన్‌గా ప్రత్యక్షమైన ఈ ఫీచర్‌ త్వరలో ఆండ్రాయిడ్‌ పరికరాలకు అందుబాటులోకి రానుంది. వాబీటాఇన్ఫో వెబ్‌సైట్‌ నివేదిక ప్రకారం దీన్ని వాడుకోవటానికి అదనంగా 150 ఎంబీ డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అధునాతన స్పీచ్‌ రికగ్నిషన్‌ పరిజ్ఞానంతో పనిచేస్తుంది. ఒకసారి డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోగానే వాయిస్‌ మెసేజ్‌లు టెక్స్ట్‌ రూపంలో కనిపిస్తాయి. వాయిస్‌ మెసేజ్‌లు బయటకు వినపడొద్దని అనుకునే సందర్భాల్లో ఈ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కొత్త వర్షన్‌లో మరింత మెరుగు పరచనున్నారు. ఇది ప్రస్తుతానికి హిందీ, ఇంగ్లిష్, రష్యన్, పోర్చుగీస్, స్పానిష్‌ భాషల్లో మాటలను అక్షరాల్లోకి మార్చగలదు. భాషను ఎంచుకున్న తర్వాత అక్షరాల్లోకి మార్చే ప్రక్రియను ఎనేబుల్‌ చేసుకోవటానికి మరో డేటా ప్యాకేజీని డౌన్‌లోడ్‌ చేయాలని అడుగుతుంది. బీటా వర్షన్లలో అందుబాటులో ఉన్నప్పటికీ దీన్ని వాట్సప్‌ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేవచ్చని అనుకుంటున్నారు.

వీడియో కాలింగ్‌ సామర్థ్యాలను మరింత మెరుగు పరచటం మీదా వాట్సప్‌ కృషి చేస్తోంది. ఇందుకోసం కొత్తగా మూడు ఫీచర్లను పరిచయం చేయనుంది. మొదటిది- వీడియో కాల్స్‌ చేస్తున్నప్పుడు స్క్రీన్‌ షేర్‌ చేసే సదుపాయం. ఇది వీడియో కాల్స్‌ మాట్లాడుతున్నప్పుడు సినిమాల వంటి ఇతర కంటెంట్‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. రెండోది- బృంద వీడియో కాల్స్‌లో పాల్గొనేవారి సంఖ్య పెంచటం. ఏ పరికరంలోనైనా ఒక వీడియో కాల్‌లో 32 మందిని జత చేసుకోవచ్చు. ఇది ఎక్కువ మందితో బృంద చర్చలు సాగించటానికి తోడ్పడుతుంది. మూడోది- బృంద చర్చల్లో తాము ప్రముఖంగా కనిపించేలా చేసుకోవటం. దీంతో తెర మీద తాము ప్రధానంగా కనిపించేలా, బృందానికి నాయకత్వం వహించేలా చూసుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని