నవ యూట్యూబ్‌

అతి పెద్ద వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ నిరంతరం తనకు తాను మెరుగవుతూనే వస్తోంది. తాజాగా ఏఐ లైవ్‌ ఛాట్, ఛానల్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్, సెర్చింగ్‌కు గూగుల్‌ లెన్స్‌ జత చేయటం వంటి అధునాతన ఫీచర్లను పరిచయం చేయనుంది.

Published : 19 Jun 2024 00:03 IST

అతి పెద్ద వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ నిరంతరం తనకు తాను మెరుగవుతూనే వస్తోంది. తాజాగా ఏఐ లైవ్‌ ఛాట్, ఛానల్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్, సెర్చింగ్‌కు గూగుల్‌ లెన్స్‌ జత చేయటం వంటి అధునాతన ఫీచర్లను పరిచయం చేయనుంది. యూట్యూబ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ ప్రోగ్రామ్స్‌లో భాగంగా ఎంపిక చేసిన కొందరికి వీటిని పరీక్షించటానికి అనుమతించింది. త్వరలోనే ఇవి అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఆలోపు వీటి విశేషాలేంటో చూసేద్దాం.

ఏఐ లైవ్‌ ఛాట్‌ సమ్మరీస్‌

ఇంగ్లిష్‌లో ప్రత్యక్ష ప్రసారాలు చేస్తూ.. ఎక్కువగా ఛాట్‌ సెషన్స్‌ నిర్వహించే ఛానల్స్‌ కోసం దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇది లైవ్‌ ఛాట్‌ చేస్తున్నప్పుడు ప్రత్యేక బ్యానర్‌లో ముఖ్యమైన వ్యాఖ్యానాలు, చర్చల సారాంశాన్ని చూపిస్తుంది. ఎక్కువమంది చర్చల్లో పాల్గొన్నప్పుడు అసలు విషయాన్ని బాగా అర్థం చేసుకోవటానికిది తోడ్పడుతుంది.

సెర్చ్‌ కోసం గూగుల్‌ లెన్స్‌

యూట్యూబ్‌ ప్రియులు సెర్చ్‌ బార్‌లో గూగుల్‌ లెన్స్‌ బటన్‌ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. మరింత సమర్థంగా వీడియో కంటెంట్‌ను వెతకటానికిది తోడ్పడుతుంది. ఆండ్రాయిడ్‌ యూజర్లలో ఎంపిక చేసిన కొంతమందికి ఇది అందుబాటులోకి వచ్చింది. సమంజసమైన వీడియోలను వెతుక్కోవటానికి దీనిలోని ఇమేజ్‌ రికగ్నిషన్‌ పరిజ్ఞానం సాయం చేస్తుంది.

క్యూఆర్‌ కోడ్‌ షేరింగ్‌

ఛానెల్స్‌ను ఇతరులతో తేలికగా షేర్‌ చేసుకోవటానికి క్యూఆర్‌ కోడ్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. దీని సాయంతో ఛానెళ్లతో ముడిపడిన క్యూఆర్‌ కోడ్‌ను సృష్టించి, దాన్ని ఇతరులతో షేర్‌ చేసుకోవచ్చు. కోడ్‌ను స్కాన్‌ చేసి వెంటనే ఆయా ఛానెళ్లను చూసి, ఆస్వాదించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని