క్లాడ్‌ 3.5 సోనెట్‌ వినూత్న ఏఐ మోడల్‌

కృత్రిమ మేధ రంగంలో రోజురోజుకీ పోటీ పెరుగుతోంది. వినూత్న మోడళ్లను సృష్టించటంలో సంస్థలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓపెన్‌ఏఐ పోటీ సంస్థ ఆంత్రోపోనిక్‌ కంపెనీ తీసుకొచ్చిన తాజా మోడలే దీనికి నిదర్శనం.

Published : 26 Jun 2024 00:27 IST

కృత్రిమ మేధ రంగంలో రోజురోజుకీ పోటీ పెరుగుతోంది. వినూత్న మోడళ్లను సృష్టించటంలో సంస్థలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓపెన్‌ఏఐ పోటీ సంస్థ ఆంత్రోపోనిక్‌ కంపెనీ తీసుకొచ్చిన తాజా మోడలే దీనికి నిదర్శనం. దీని పేరు క్లాడ్‌ 3.5 సోనెట్‌. సమగ్ర గ్రహణ, కోడింగ్, లెక్కలు, విజన్‌ వంటి విభాగాల్లో గత మోడళ్లను అధిగమించేలా దీన్ని రూపొందించారు. 

ఏంటీ క్లాడ్‌ 3.5 సోనెట్‌?

ఆంత్రోపోనిక్‌ గతంలో పరిచయం చేసిన క్లాడ్‌ 3 సోనెట్, క్లాడ్‌ 3 ఓపస్‌ మోడళ్ల కన్నా అధిక శక్తిమంతమైంది. ఇది అక్షరాలను విశ్లేషించటమే కాకుండా ఇమేజ్‌లనూ అర్థం చేసుకోగలదు, వ్యాఖ్యానించగలదు. మరింత సమాచారంతో కూడిన, అర్థవంతమైన టెక్స్ట్‌ను సృష్టించగలదు.

పోటీలో రాణింపు

ఏఐ మోడళ్ల సామర్థ్యాలను కచ్చితంగా గుర్తించటం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. కానీ క్లాడ్‌ 3.5 సోనెట్‌ కొన్ని పరీక్షల్లో ఓపెన్‌ఏఐకి చెందిన జీపీటీ-4ఓ వంటి ప్రముఖ మోడళ్లను సైతం అధిగమించినట్టు తెలుస్తోంది. రీడింగ్, కోడింగ్, లెక్కల వంటి అంశాల్లో కాస్త ముందంజలో ఉన్నట్టుగా ఇది సూచిస్తోంది. హాస్యాన్ని కూడా అర్థం చేసుకోవటం ఈ మోడల్‌ ప్రత్యేకత.

వేగం, కచ్చితత్వం

మరో ముఖ్యమైన అంశం వేగం. గత మోడల్‌ అయిన క్లాడ్‌ 3 ఓపస్‌ కన్నా ఇది సుమారు రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. వేగంగా ప్రతిస్పందనలు అవసరమయ్యే ఛాట్‌బాట్స్‌ వంటి వాటికిది ఎంతో అనువుగా ఉంటుంది. ఇక దృశ్యాల విషయానికి వస్తే ఛార్ట్‌లు, గ్రాఫ్‌లను చాలా కచ్చితంగా వ్యాఖ్యానించగలదు. మసక ఇమేజ్‌ల నుంచీ టెక్స్ట్‌ను అవగతం చేసుకోగలదు.

కొత్త రకం శిక్షణతో

అధునాతన రీతులతో రూపొందించిన క్లాడ్‌ 3.5 సోనెట్‌ కొత్తరకం శిక్షణతో బాగా రాటుదేలింది. కృత్రిమ మేధ సృష్టించిన సమాచారంతోనూ దీనికి శిక్షణ ఇవ్వటం గమనార్హం.

వ్యాపారాలను దృష్టిలో పెట్టుకొని

వాణిజ్య, వ్యాపారాల నిజ అవసరాలను దృష్టిలో పెట్టుకొని క్లాడ్‌ 3.5 సోనెట్‌ను సృష్టించారు. ఈ విషయంలో దీన్ని గొప్ప ముందడుగుగా భావిస్తున్నారు.

ఎలా వాడుకోవాలి?

క్లాడ్‌ 3.5 సోనెట్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఆంత్రోపోనిక్‌ వెబ్‌ యాప్, క్లాడ్‌ ఐఓఎస్‌ యాప్‌ ఉచిత యూజర్లు అదనంగా డబ్బు చెల్లించకుండానే దీన్ని వాడుకోవచ్చు. మరిన్ని ఎక్కువ సదుపాయాలు కావాలంటే డబ్బు చెల్లించి క్లాడ్‌ ప్రొ, క్లాడ్‌ టీప్‌ సేవలు పొందొచ్చు. వాణిజ్య సంస్థలయితే ఆంత్రోపోనిక్‌ ఏపీఐ.. అమెజాన్‌ బెడ్‌రాక్, గూగుల్‌ క్లౌడ్‌కు చెందిన వెర్టెక్స్‌ ఏఐ వంటి వేదికల ద్వారా క్లాడ్‌ 3.5 సోనెట్‌తో సమ్మిళితం కావొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు