వాట్సప్‌ బృందాల్లో ఈవెంట్స్‌

వాట్సప్‌ కొత్తగా గ్రూప్‌ ఛాట్స్‌లో ఈవెంట్స్‌ ఫీచర్‌ను ఆరంభించింది. దీంతో గ్రూప్‌ ఛాట్స్‌లో సులభంగా, నేరుగా సమావేశాలను  నిర్వహించుకోవచ్చు.

Published : 03 Jul 2024 00:44 IST

వాట్సప్‌ కొత్తగా గ్రూప్‌ ఛాట్స్‌లో ఈవెంట్స్‌ ఫీచర్‌ను ఆరంభించింది. దీంతో గ్రూప్‌ ఛాట్స్‌లో సులభంగా, నేరుగా సమావేశాలను నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ 2.24.9.20 అప్‌డేట్‌లో బీటా వర్షన్‌గా ఉన్న ఈ ఫీచర్‌ త్వరలో విస్తృతంగా అందుబాటులోకి రానుంది. ఇంతకుముందు ఈవెంట్స్‌ ఫీచర్‌ కమ్యూనిటీ గ్రూప్‌ ఛాట్స్‌కే పరిమితమై ఉండేది. తాజా అప్‌డేట్‌తో ఇది మామూలు గ్రూప్‌ ఛాట్స్‌కూ విస్తరించనుంది. వీడియో లేదా ఆడియో కాల్‌కు సంబంధించి పేరు, వివరణ, తేదీ, లొకేషన్‌ వంటి వివరాలను  ఎంటర్‌ చేసి ఈవెంట్‌ను సృష్టించుకోవచ్చు. ఇష్టాయిష్టాలను బట్టి గ్రూప్‌ సభ్యులు ఈ ఆహ్వానాన్ని అంగీకరించొచ్చు, తిరస్కరించొచ్చు. ఈవెంట్‌ను సృష్టించినవారు అవసరమైతే వివరాలను అప్‌డేట్‌ చేయొచ్చు కూడా. వాట్సప్‌లో అన్నింటి మాదిరిగానే ఈ ఈవెంట్స్‌ కూడా పూర్తిగా గోప్యంగా ఉంటాయి. చర్చలో పాల్గొనే సభ్యులకు మాత్రమే వివరాలను యాక్సెస్‌ చేయటానికి అవకాశముంటుంది. మున్ముందు ఈవెంట్‌ రిమైండర్స్, కవర్‌ ఫొటోలను సెట్‌ చేసుకోవటం వంటి అదనపు సదుపాయాలనూ దీనికి జోడించాలని వాట్సప్‌ భావిస్తోంది.

మెటా సంస్థ ఇటీవల వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌ వేదికల్లో మెటా ఏఐ అసిస్టెంట్‌ను కూడా పరిచయం చేసింది. దీంతో నేరుగా కృత్రిమ మేధ (ఏఐ) సేవలను పొందొచ్చు. ఫేస్‌బుక్‌ యాప్‌లో పోస్టులను స్క్రోలింగ్‌ చేస్తూనే ఏఐ అసిస్టెంట్‌ను ఉపయోగించుకోవచ్చు కూడా. ఇది మైక్రోసాఫ్ట్, గూగుల్‌ నుంచి అప్పటికప్పుడే ఫలితాలనూ చూపించగలదు. కాబట్టి ప్రయాణ ప్రణాళిక రూపొందించుకోవటం, రద్దీలేని దారులను ఎంచుకోవటం వంటి పనులనూ గ్రూప్‌లో ఛాట్స్‌ చేస్తున్నప్పుడే పంచుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని