కోపైలట్‌ వినూత్న ఫీచర్లు

కోపైలట్‌ బాట్‌ చాలా మారిపోయింది. ఇటీవలే మైక్రోసాఫ్ట్‌ కొత్తగా 14 కోపైలట్‌ ఫీచర్లను పరిచయం చేసింది మరి. మైక్రోసాఫ్ట్‌ 365 ఖాతా కలిగినవారు ఎవరైనా వర్డ్, పవర్‌ పాయింట్, ఎక్సెల్‌ వంటి అన్ని యాప్‌ల్లో వాడుకోవచ్చు.

Published : 10 Jul 2024 01:03 IST

కోపైలట్‌ బాట్‌ చాలా మారిపోయింది. ఇటీవలే మైక్రోసాఫ్ట్‌ కొత్తగా 14 కోపైలట్‌ ఫీచర్లను పరిచయం చేసింది మరి. మైక్రోసాఫ్ట్‌ 365 ఖాతా కలిగినవారు ఎవరైనా వర్డ్, పవర్‌ పాయింట్, ఎక్సెల్‌ వంటి అన్ని యాప్‌ల్లో వాడుకోవచ్చు. ఇంతకుముందు బిజినెస్‌ యూజర్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండేది. మైక్రోసాఫ్ట్‌ 365 లేదా కోపైలట్‌ ప్రొ కలిగి ఉన్నట్టయితే కొత్త ఫీచర్లూ వాడుకోవచ్చు. వీటిల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం. 

వర్డ్‌లో నేరుగా ఇమేజ్‌ల సృష్టి

మైక్రోసాఫ్ట్‌ డిజైనర్‌ ద్వారా కోపైలట్‌ సాయంతో ఇకపై వర్డ్, పవర్‌పాయింట్‌ డాక్యుమెంట్లలో నేరుగా ఇమేజ్‌లను సృష్టించుకోవచ్చు, శోధించొచ్చు. ఎలాంటి ఇమేజ్‌ కావాలో అక్షరాల్లో వర్ణిస్తే, ఇమేజ్‌లను సృష్టిస్తుంది. ఉదాహరణకు- ఇటుకలతో కట్టిన రంగురంగుల ఇంటిని సృష్టించమని అడిగారనుకోండి. రకరకాల శైలుల్లో ఇంటి బొమ్మలను సృష్టించి పెడుతుంది. వీటిల్లో ఇష్టమైన దాన్ని ఎంచుకొని, డాక్యుమెంట్‌లో ఇన్‌సర్ట్‌ చేసుకుంటే సరి. పవర్‌పాయింట్‌లో ఈ ఫీచర్‌ను స్లైడ్‌ డిజైన్‌లో భాగంగా వాడుకోవచ్చు.

వర్డ్‌లో పీడీఎఫ్‌ల సూచికలు

సందర్భానుసారంగా వర్డ్‌లో పీడీఎఫ్‌లు, ఎన్‌క్రిప్ట్‌ అయిన వర్డ్‌ డాక్యుమెంట్లను రిఫరెన్స్‌లుగా పొందుపరచొచ్చు. ఈమెయిళ్లు, మీటింగ్స్‌ వంటి మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సమాచారాన్నీ రిఫర్‌ చేయొచ్చు. ప్రాంప్ట్‌లతో ఇలాంటి పైళ్ల రకాలను వర్డ్‌లో పేర్కొనవచ్చు. ప్రాజెక్టు ప్రపోజల్‌ రాయమనీ కోపైలట్‌ను కోరుకోవచ్చు. సమావేశంలో ప్రాజెక్టును లోతుగా చర్చించి నప్పుడు లేదా పీడీఎఫ్‌ రూపంలో నోట్స్‌ ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్, ఫైలును విశ్లేషించటానికీ కోపైలట్‌ను వాడుకోవచ్చు. ఇది వాటిని పరిశీలించి నివేదిక రూపొందిస్తుంది. 

టీమ్స్‌తో జత

టీమ్స్‌ ఛాట్స్, ఛానెల్స్‌లోనూ కోపైలట్‌ అంతర్భాగంగా మారింది. మెసేజ్‌ను టైప్‌ చేసిన తర్వాత ఇష్టమైన విధంగా పదాలను సరిచేయమని దీన్ని అడగొచ్చు. యాడ్‌ ఎ కాల్‌ టు యాక్షన్, మేక్‌ ఇట్‌ పర్‌సుయేసివ్‌ వంటి ప్రాంప్ట్‌లనూ మైక్రోసాఫ్ట్‌ సూచిస్తుంది. కావాలంటే మెసేజ్‌ను జాబితాగా మార్చమని, సమగ్రమైన భాషను జత చేయమనీ అడగొచ్చు.

షేర్‌పాయింట్‌లో కంటెంట్‌ రీరైట్‌

కోపైలట్‌ తిరగరాసే సామర్థ్యం ఇప్పుడు షేర్‌పాయింట్‌కూ విస్తరించింది. సంస్థ కోసం వెబ్‌సైట్లను రూపొందిస్తున్నప్పుడు దీని టూల్స్‌ సాయంతో టెక్స్ట్‌ను తిరగరాసుకోవచ్చు. ఇందులో కొత్తేమీ లేదని, మామూలు రీరైటింగ్‌ టూల్స్‌గానే అనిపించొచ్చు గానీ వీటిని నేరుగా షేర్‌పాయింట్‌లో వాడుకునే అవకాశం ఉండటం విశేషం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని