జార్విస్‌.. జుకర్‌ ప్రత్యేక అసిస్టెంట్‌

మెటా (ఫేస్‌బుక్‌) సృష్టికర్త మార్క్‌ జుకర్‌బర్గ్‌ అనగానే ముందుగా టెక్నాలజీయే గుర్తుకొస్తుంది. ఇంట్లో రకరకాల పరికరాలు పని చేయటానికీ ఆయన దీన్నే ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఎకో, సిరి వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాక అంతా కాలు మీద కాలేసుకొని

Updated : 17 Nov 2021 01:01 IST

మెటా (ఫేస్‌బుక్‌) సృష్టికర్త మార్క్‌ జుకర్‌బర్గ్‌ అనగానే ముందుగా టెక్నాలజీయే గుర్తుకొస్తుంది. ఇంట్లో రకరకాల పరికరాలు పని చేయటానికీ ఆయన దీన్నే ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఎకో, సిరి వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాక అంతా కాలు మీద కాలేసుకొని అన్ని పనులు చేయించుకుంటున్నారని పెదవి విరుస్తున్నారేమో. జుకర్‌ బర్గ్‌ ఇలాంటి పరికరాల సాయం గానీ అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్‌ను గానీ వాడుకోరు. కృత్రిమ మేధతో పనిచేసే ప్రత్యేక అసిస్టెంట్‌ను రూపొందించుకున్నారు. దీని పేరు జార్విస్‌. ఐరన్‌ మ్యాన్‌ స్ఫూర్తితో దీన్ని తయారుచేసుకున్నారు. ఇంట్లోని కెమెరాలు, స్పీకర్లు, లైట్లు, చివరికి టోస్టర్‌.. అన్నీ దీంతోనే అనుసంధానమై ఉంటాయి. టెక్స్ట్‌, వాయిస్‌ రికగ్నిషన్‌తో పనిచేసే ఇది జుకర్‌బర్గ్‌కు అవసరమైన పనులన్నీ చేసి పెడుతుంది. జార్విస్‌ ఆయా వ్యక్తుల మాటలనూ గుర్తించగలదు. అడిగే వ్యక్తులను బట్టి, వారి ఇష్టాయిష్టాలను గుర్తించి పాటలు వినిపిస్తుంది కూడా. ఇంట్లో భార్య పిల్లలు ఎక్కడున్నారో వెతకాల్సిన పనిలేదు. జార్విస్‌ను అడిగితే చాలు. ఫేస్‌ రికగ్నిషన్‌ పరిజ్ఞానంతో కూడిన ఇది ఇల్లంతా వెదికి వాళ్లు ఎక్కడున్నారో చెప్పేస్తుంది. తలుపు కెమెరా సాయంతో ఇంటికి ఎవరు వచ్చారో గుర్తిస్తుంది. జుకర్‌బర్గ్‌ వాయిస్‌ కమాండ్ల కన్నా ఫోన్‌తోనే జార్విస్‌ను నియంత్రిస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని