WhatsApp: వాట్సాప్‌లో ఇవి కొందరికి తెలుసు.. కొందరికి తెలియవు.. మీకు తెలుసా?

వాట్సప్‌లో చాలా ఫీచర్లున్నాయి. కొన్ని యాప్‌ను ఓపెన్‌ చేయగానే కనిపిస్తాయి. కానీ కొన్ని ఫీచర్లు మేసేజ్‌లను కాసేపు అలాగే నొక్కి పడితే, మూడు చుక్కల మెనూను ఓపెన్‌ చేస్తే గానీ కనిపించవు.

Updated : 03 Mar 2022 15:47 IST

వాట్సప్‌లో చాలా ఫీచర్లున్నాయి. కొన్ని యాప్‌ను ఓపెన్‌ చేయగానే కనిపిస్తాయి. కానీ కొన్ని ఫీచర్లు మేసేజ్‌లను కాసేపు అలాగే నొక్కి పడితే, మూడు చుక్కల మెనూను ఓపెన్‌ చేస్తే గానీ కనిపించవు. చాలాకాలంగా వాట్సప్‌ వాడేవారిలో కొందరికి వీటి గురించి తెలిసే ఉంటుంది. కొత్తగా వాడేవారికి మాత్రం వింతగానే అనిపిస్తాయి. అలాంటి అదృశ్య ఫీచర్లలో కొన్ని ఇవి.

ముఖ్యమైన ఛాట్‌ పైభాగాన

వాట్సప్‌లో ఎన్నో ఛాట్లు. వీటిల్లో కొన్ని ముఖ్యమైనవి కావచ్చు. ఏవేవో మెసేజ్‌లు వస్తున్నప్పుడు ఇవి కిందికి వెళ్లిపోవచ్చు. అప్పుడు వెంటనే వీటిని చూడలేకపోవచ్చు. ముఖ్యమైన ఛాట్లను అన్నింటికన్నా పైన ఉండేలా చూసుకుంటే ఇలాంటి ఇబ్బందిని తప్పించుకోవచ్చు. ఇందుకు ఛాట్‌ను పిన్‌ చేసుకునే ఫీచర్‌ ఉపయోగపడుతుంది. వ్యక్తిగత ఛాట్‌ అయినా గ్రూప్‌ ఛాట్‌ అయినా.. దేన్నయినా పిన్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సప్‌ హోంస్క్రీన్‌లోకి వెళ్లి పిన్‌ చేయాలనుకుంటున్న ఛాట్‌ మీద కాసేపు అలాగే నొక్కి పట్టుకోవాలి. అప్పుడు పైన కొన్ని గుర్తులు కనిపిస్తాయి. వీటిల్లో పిన్‌ గుర్తును ఎంచుకొని ఎనేబుల్‌ చేసుకోవాలి. ఇలా మూడు ఛాట్ల వరకు పిన్‌ చేసుకోవచ్చు. ఇలా ముఖ్యమైన ఛాట్లు ఎప్పుడూ పైన ఉండేలా చూసుకోవచ్చు.

* ఐఫోన్లలో అయితే ఛాట్‌ను కుడివైపునకు స్వైప్‌ చేస్తే పిన్‌ గుర్తు కనిపిస్తుంది.

చదవని వాటికి గుర్తు

ఏదో మెసేజ్‌ వస్తుంది. దాన్ని ఓపెన్‌ చేశారు గానీ అప్పటికి చదవటం కుదరలేదు. తర్వాత చూద్దామని అనుకోవచ్చు. పనుల్లో పడిపోయి మరచిపోతే? తర్వాత దాని వంకే చూడకపోతే? అవి ముఖ్యమైన మెసేజ్‌లైతే ఇరకాటంలో పడటం ఖాయం. అందుకే తర్వాత చదువుదామని అనుకునే మెసేజ్‌లను మార్క్‌ చేసి పెట్టుకోవటానికీ వాట్సప్‌లో వీలుంది. హోంస్క్రీన్‌లోకి వెళ్లి, ఛాట్‌ మీద కాసేపు నొక్కి పట్టాలి. తర్వాత పైన కుడివైపున కనిపించే మూడు నిలువుగీతల మెనూను క్లిక్‌ చేయాలి. అందులో ‘మార్క్‌ అన్‌రీడ్‌’ ఆప్షన్‌ ఎంచుకోవాలి. అప్పుడు ఛాట్‌ పక్కన ఆకుపచ్చ చుక్క ప్రత్యక్షమవుతుంది. సమయం దొరికినప్పుడు మెసేజ్‌ను చదవగానే ఆకుపచ్చ చుక్క అదృశ్యమవుతుంది.

నోటి మూత

ఏదైనా గ్రూప్‌ లేదా వ్యక్తుల నుంచి అదేపనిగా, అతిగా నోటిఫికేషన్స్‌ వస్తున్నాయా? ఇవి చికాకు కలిగిస్తున్నాయా? ఇలాంటి ఇబ్బంది పడకుండా వాటిని మ్యూట్‌ చేసుకోవచ్చు. ఛాట్‌ మీద కాసేపు నొక్కి పెడితే, పైన స్పీకర్‌ మీద అడ్డం గీత ఉన్న గుర్తు కనిపిస్తుంది. దీన్ని నొక్కి ఎన్నిరోజుల వరకు మ్యూట్‌లో ఉండాలో ఎంచుకోవచ్చు. కావాలంటే శాశ్వతంగా మ్యూట్‌ చేసుకోవచ్చు. ఛాట్‌ను ఓపెన్‌ చేసి, పైన కుడివైపున మూడు చుక్కల మెనూను నొక్కినా ‘మ్యూట్‌ నోటిఫికేషన్స్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే ఆయా ఛాట్స్‌ నుంచి ఎలాంటి నోటిఫికేషన్లు అందవు.

ఆర్కైవ్‌తో విడిగా

మ్యూట్‌ చేసుకోవటంతో సంతృప్తి చెందకపోతే ఛాట్‌ను ఆర్కైవ్‌ చేసుకునే వెసులుబాటూ ఉంది. ఇది శాశ్వతంగా ఛాట్‌ను విడిగా ఉంచుతుంది. రివర్స్‌ చేసుకుంటే గానీ తిరిగి ప్రధాన విభాగంలో కనిపించదు. ఇందుకోసం మెయిన్‌ స్క్రీన్‌లో ఛాట్‌ మీద కాసేపు నొక్కి పట్టాలి. కిందికి చూస్తున్న బాణంతో కూడిన చదరపు గుర్తును క్లిక్‌ చేయాలి. దీంతో ఛాట్‌ ఆర్కైవ్‌ అవుతుంది. ఇది ఛాట్‌ విభాగంలో అన్నింటికన్నా కింద ఆర్కైవ్‌ విభాగంలో ఉండిపోతుంది. దీన్ని మళ్లీ యథావిధిగా చూసుకోవాలంటే ఛాట్‌ కిందికి వెళ్లి ‘ఆర్కైవ్డ్‌’ మీద ట్యాప్‌ చేయాలి. తర్వాత ఛాట్‌ మీద కాసేపు నొక్కి పట్టాలి. పైకి చూస్తున్న బాణంతో కూడిన చదరపు గుర్తును క్లిక్‌ చేయాలి.

నక్షత్రం గుర్తు

చిరునామాలు, లొకేషన్ల వంటి వివరాలతో కూడిన ముఖ్యమైన ఛాట్స్‌ ఎక్కడో అడుగున పడిపోతే వెతుక్కోవటం కష్టం. వీటిని ఎప్పుడంటే అప్పుడు చూసుకోవటానికి మార్గం లేకపోలేదు. అదే నక్షత్రం గుర్తు. దీంతో ముఖ్యమైన ఛాట్స్‌ను బుక్‌మార్క్‌ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకేచోట ఉండేలా చూసుకోవచ్చు. టెక్స్ట్‌, ఇమేజ్‌, లింక్‌, ఆడియో.. ఎలాంటి మెసేజ్‌ల మీదైనా కాసేపు అలాగే నొక్కి పట్టాలి. ఛాట్‌ పైభాగాన కనిపించే నక్షత్రం గుర్తును క్లిక్‌ చేయాలి. ఇలా ఎన్ని మెసేజ్‌లనైనా మార్క్‌ చేసుకోవచ్చు. ఇవన్నీ ‘స్టార్డ్‌ మెసేజ్‌స్‌’ విభాగంలో ఉంటాయి. హోంస్క్రీన్‌లో కుడివైపున నిలువు మూడు గీతల మెనూను నొక్కి దీనిలోకి వెళ్లొచ్చు. నక్షత్రం గుర్తుతో కూడిన మెసేజ్‌లు అన్నింటినీ చూడొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని