ఇకపై పెద్ద ట్వీట్లు

ట్విటర్‌ అంటేనే చిన్న వాక్యాల వేదిక. తక్కువ పదాల్లోనే అవసరమైన సందేశాన్ని ఇవ్వటం దీని ఉద్దేశం. ఇదే దీనికి ప్రజాదరణ తెచ్చిపెట్టింది. అయితే కొన్నిసార్లు విషయాన్ని వివరంగా చెపాల్సి రావొచ్చు. ఇందుకోసం చాలామంది థ్రెడ్స్‌ రూపంలో ట్వీట్లను

Published : 29 Jun 2022 00:54 IST

ట్విటర్‌ అంటేనే చిన్న వాక్యాల వేదిక. తక్కువ పదాల్లోనే అవసరమైన సందేశాన్ని ఇవ్వటం దీని ఉద్దేశం. ఇదే దీనికి ప్రజాదరణ తెచ్చిపెట్టింది. అయితే కొన్నిసార్లు విషయాన్ని వివరంగా చెపాల్సి రావొచ్చు. ఇందుకోసం చాలామంది థ్రెడ్స్‌ రూపంలో ట్వీట్లను గుదిగుచ్చి పోస్ట్‌ చేస్తుంటారు. ఇవన్నీ వరుస క్రమంలో కనిపిస్తాయి. కొన్నిసార్లు వీటిని చదవటం కష్టంగా ఉంటుంది. కొందరైతే ఇతర యాప్స్‌లో రాసి, దాన్ని పీడీఎఫ్‌ గానో ఇమేజ్‌గానో మార్చి, స్క్రీన్‌ షాట్‌ తీసి పోస్ట్‌ చేస్తుంటారు. మున్ముందు ఇలాంటి ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. ఇన్‌బిల్ట్‌గా నోట్స్‌ ఫీచర్‌ను జత చేయాలని ట్విటర్‌ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దీనిపై కొన్ని దేశాల్లో పరీక్షలు మొదలయ్యాయి. ఇది పెద్ద ట్వీట్లను రాయటానికి వీలు కల్పిస్తుంది. ‘రైట్‌’ ట్యాబ్‌ మీద క్లిక్‌ చేయగానే నోట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. రాయటం పూర్తయ్యాక నోట్‌ను జతచేస్తే చాలు. దీంతో కథల వంటివీ రాసుకోవచ్చు. శీర్షిక పెట్టుకోవచ్చు. కావాలంటే కథనం మీద, మధ్యలో ఫొటోలు సైతం జత చేయొచ్చు.


ఇన్‌స్టాగ్రామ్‌లోనూ..

ఇన్‌స్టాగ్రామ్‌ సైతం కొత్తగా నోట్స్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే ట్విటర్‌ నోట్స్‌లా పెద్ద సమాచారాన్ని పోస్ట్‌ చేయటానికి ఉద్దేశించింది కాదు. కొంతకాలం తర్వాత అదృశ్యమయ్యే కంటెంట్‌ను పోస్ట్‌ చేయటానికిది ఉపయోగపడుతుంది. ఒకరకంగా దీన్ని స్టికీ నోట్స్‌ అనుకోవచ్చు. ఇది 24 గంటల్లో మాయమవుతుంది. ‘క్లోజ్‌ ఫ్రెండ్స్‌’ బృందం లేదా అనుసరించే వారి కోసం ప్రకటనల వంటివి జారీ చేయటానికిది వీలు కల్పిస్తుంది. అయితే వీటికి సంబంధించిన నోటిఫికేషన్లేవీ అందవు. కానీ రోజంతా యాప్‌లో వీటిని చూడొచ్చు. మెసేజ్‌ల ద్వారా జవాబు కూడా ఇవ్వచ్చు. ముఖ్యమైన మెసేజ్‌లు ఇన్‌బాక్స్‌లో ఎక్కడో ఉండిపోకుండా ప్రముఖంగా కనిపించేలా చూడటానికి ఈ నోట్స్‌ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది. మర్నాటి వరకు ఫోన్‌ కాల్స్‌కు అందుబాటులో ఉండలేని పరిస్థితుల్లో దగ్గరి స్నేహితులకు అవసరమైన సమాచారం ఇవ్వటానికీ తోడ్పడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని