వ్యూ వన్స్‌ మెసేజ్‌లు అభ్యంతరకరంగా ఉంటే?

వాట్సప్‌లో ‘వ్యూ వన్స్‌’ ఫీచర్‌ గురించి తెలిసిందే. దీని కింద ఎవరైనా పంపిన ఫొటోలు, వీడియోలను ఒకసారి మనం ఓపెన్‌ చేస్తే వాటంతటవే అదృశ్యమైపోతాయి. మళ్లీ కనిపించవు.

Updated : 02 Nov 2022 17:56 IST

వాట్సప్‌లో ‘వ్యూ వన్స్‌’ ఫీచర్‌ గురించి తెలిసిందే. దీని కింద ఎవరైనా పంపిన ఫొటోలు, వీడియోలను ఒకసారి మనం ఓపెన్‌ చేస్తే వాటంతటవే అదృశ్యమైపోతాయి. మళ్లీ కనిపించవు. మరింత వ్యక్తిగత గోప్యత కోసం ఈ ఫీచర్‌ను ఉద్దేశించినప్పటికీ కొందరు దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు పంపి, ఇబ్బంది పెట్టొచ్చు. ఇది చాలా మానసిక క్షోభకు గురిచేస్తుంది. అలాగని భరించాల్సిన పనిలేదు. ఇలాంటి వ్యూ వన్స్‌ మీడియా అంశాల మీద రిపోర్టు చేయటానికీ వాట్సప్‌ అవకాశం కల్పించింది. అదెలాగో చూద్దాం.

ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనైతే..

* ముందుగా వాట్సప్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. వ్యూ వన్స్‌ మెసేజ్‌లను పంపినవారి వ్యక్తిగత ఛాట్‌లోకి వెళ్లాలి.

* తెరకు పైన కుడివైపు మూలన కనిపించే మూడు చుక్కల మెనూ బటన్‌ను నొక్కాలి. తర్వాత రిపోర్టు కాంటాక్ట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* మనకు పరిచయం లేనివారు పంపిన మెసేజ్‌లైతే రిపోర్ట్‌ అన్‌నోన్‌ యూజర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఐఫోన్‌ వాడేవారైతే..

* వాట్సప్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, వ్యూ వన్స్‌ మీడియాను పంపినవారి ఛాట్‌లోకి వెళ్లాలి. తెర కింది భాగాన ఉండే మూడు చుక్కల మెనూ మీద నొక్కాలి. ఇక్కడ్నుంచి రిపోర్ట్‌ కాంటాక్ట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

వ్యూ వన్స్‌ వివరాలు

వ్యూ వన్స్‌ మీడియా ద్వారా అందినవాటిని పరికరంలోని ఫొటోస్‌లో లేదా గ్యాలరీలో సేవ్‌ చేసుకోవటానికి వీలుండదు. దీని కింద పంపిన లేదా అందుకున్న ఫొటోలు, వీడియోలను ఫార్వర్డ్‌, షేర్‌ చేయటమూ సాధ్యం కాదు. స్టార్‌ గుర్తునూ పెట్టుకోలేం. రీడ్‌ రిసీప్ట్స్‌ ఆన్‌ చేసి ఉన్నట్టయితే అందుకున్నవారు వాటిని ఓపెన్‌ చేశారో లేదో మాత్రమే తెలుస్తుంది. వీటిని 14 రోజుల వరకు ఓపెన్‌ చేయనట్టయితే ఛాట్‌ నుంచి తొలగిపోతాయి. వ్యూ వన్స్‌ ద్వారా ఫొటోలు, వీడియోలు పంపాలనుకుంటే ప్రతీసారి ఈ ఫీచర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మెసేజ్‌ను ఓపెన్‌ చేయనట్టయితే బ్యాకప్‌ నుంచి రిస్టోర్‌ చేసుకునే అవకాశముంది. అప్పటికే ఓపెన్‌ చేస్తే మాత్రం బ్యాకప్‌లోనూ ఉండదు. రిస్టోర్‌ కూడా చేసుకోలేం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని